సింగపూర్ ప్రధానితో కలిసి టిఫిన్ చేస్తున్న భారత ప్రధాని
భారత దేశానికి స్వాతంత్య్రం 1947లో వచ్చింది. సింగపూర్‌లో మొట్టమొదటి శాకాహార హోటల్ అదే సంవత్సరం ప్రారంభమైంది. 2015 లో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్, భార్య హోచింగ్‌లతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ హోటల్‌లోనే తృప్తిగా భోజనం చేశారు. అదే మురుగయ్య రాజు ప్రారంభించిన కోమల విలాస్... ఇదే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్...
ఇక్కడ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అదే సంవత్సరం సింగపూర్ సెరంగూన్ రోడ్‌లో భారత కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించేలా మొట్టమొదటి శాకాహార హోటల్ భోజన ప్రియుల కోసం తలుపులు తెరిచి, ఆహ్వానం పలికింది. అదే కోమల విలాస్. అచ్చమైన ఈ శాకాహార హోటల్‌లో సింగపూర్ ప్రధాని దంపతులతో కలిసి భారత ప్రధాని ఇడ్లీ, వడ, దోసెలను ఆస్వాదించారు.
తొమ్మిది దశాబ్దాల క్రితం...
మురుగయ్య రాజు 1936లో తన పదహారవ ఏట సింగపూర్‌లో తమిళనాడు నుంచి పొట్ట కూటి కోసం సింగపూర్ చేరారు. ‘‘మా తాతయ్య మురుగయ్య రాజు, చిన్నవయసులోనే సింగపూర్ వచ్చి శ్రీకరుణా విలాస్‌లో పని చేశారు. ఈ హోటల్‌లో అన్ని పనులు తాతగారే స్వయంగా చేసేవారు. పది సంవత్సరాల పాటు అక్కడ అవిశ్రాంతంగా పనిచేసిన తాతగారు... అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించారు. ఒక మంచి రెస్టారెంటు కొనేస్థాయికి ఎదిగారు’’ అంటారు గుణశేఖరన్. శ్రీకరుణ విలాస్ అధినేత యజమానురాలి పేరు కోమల. మురుగయ్య సింగపూర్ వచ్చిన కొత్తలో ఆమె మురుగయ్యను తల్లిలా చేరదీశారు. అందువల్ల ఆయన ఆ తల్లి మీద ఉన్న గౌరవంతో తన హోటల్‌కి కోమల విలాస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే దొరుకుతుంది.
భోజనం కూడా...
తంజావూరు జిల్లాలో పనిచేస్తున్న సంప్రదాయ వంట మనిషితో మురుగయ్య రాజుకి పరిచయం కావడంతో, అల్పాహారంతో పాటు భోజనాలు కూడా ప్రారంభించారు. అది కూడా అరటి ఆకులలో వడ్డించారు. నెమ్మదినెమ్మదిగా మెనూలో కొత్త కొత్త వంటలను చేర్చారు. అవీ భారతీయ శాకాహార వంటకాలు మాత్రమే. సింగపూర్‌లో ఇంటింటా కోమల విలాస్ పేరు మార్మోగింది. అక్కడ ఎన్ని భారతీయ రెస్టారెంట్లు వచ్చినా, కోమల విలాస్‌కు పోటీ ఇవ్వలేకపోతున్నాయి.
సంప్రదాయ వంటకాలు మాత్రమే...
సంప్రదాయ వంటవారిని భారతదేశం నుంచి ఎంచుకోవడమే కోమల విలాస్ విజయ రహస్యం. ‘‘భారత దేశం నుంచి మాత్రమే సంప్రదాయ వంటవారు దొరుకుతారని మా నమ్మకం. స్వయంగా భారతదేశం వెళ్లి, అక్కడి వంటవారితో వంటలు చేయించి, రుచి చూసి, నచ్చితేనే వారిని మాతో తీసుకువస్తాం. అందుకే మా దగ్గర వంట రుచిగా ఉంటుంది. ఇక్కడి శాకాహార భోజనం చాలా రుచిగా, సంప్రదాయంగా ఉంటుందనే ముద్ర పడింది కోమల విలాస్‌కి’’ అంటారు గుణశేఖరన్.ఇక్కడి వంటకాలలో మసాలా ఎక్కువగా ఉండదని తెలియడంతో, విదేశీయులు సైతం ఇక్కడ భోజనం చేయడానికి ఉబలాటపడుతుంటారు.
పది సంవత్సరాల క్రితం...
సింగపూర్‌కి వచ్చే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉత్తరాది వారు కూడా తరలి వస్తుండటంతో, ఆ వంటకాలను కూడా పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త వంటలతో కోమల విలాస్ నిత్యయవ్వనంగా ఉండి, సింగపూర్‌లో అందరికీ సుపరిచితంగా ఉంటోంది నేటికీ.
ఉత్తర భారతదేశానికి చెందిన బ్రెడ్ బటూరాను సింగపూర్‌లో మొట్టమొదటగా పరిచయం చేసిన ఘనత కోమల విలాస్‌దే. ‘మా కోమల విలాస్‌కి వచ్చినవారు మసాలా దోసె తినడం మరువకండి. ఇక్కడకు వచ్చి మసాలా దోసె తిన్నవారు రుచి బాగా లేదని ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అతిథ్యం ఇవ్వడానికి మా తాతగారు స్థాపించిన కోమల విలాస్‌ను ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత, సింగపూర్ ప్రధానులిద్దరూ వడ, ఇడ్లీ, రెండు రకాల దోసెలు తిన్నారు. స్వీట్ లస్సీ, మ్యాంగో లస్సీ, నిమ్మరసం కూడా తీసుకున్నారు. గుణశేఖరన్
Comments
Please login to add a commentAdd a comment