కళాత్మకం : స్వరరాగ చక్ర ప్రవాహం!
స్వరాలు ఏడే అయినా సంగీతం ఒక సముద్రం. అందులోనూ కర్ణాటక సంగీతమైతే మహాసముద్రమే. ఇందులో 72 మేళకర్త (జనక) రాగాలు, వాటి నుంచి పుట్టిన జన్యరాగాలు ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన దక్షిణాది సంగీతంలోని ప్రధాన రాగాలను సులువుగా అర్థమయ్యే రీతిలో క్రోడీకరించిన చెన్నై వాసి లేళ్లపల్లి శేషాచల రమేశ్‌తో సంభాషణ...
మీ గురించి క్లుప్తంగా...
చెన్నై ఐఐటీలో ఎం.టెక్ చేసి, ప్రస్తుతం చెన్నైలోని షిప్పింగ్‌యార్‌డలో ఐటీ డిపార్ట్‌మెంట్ ఏజీఎంగా పని చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజులలో... పగిలిపోయిన పెన్సిల్ బాక్స్‌తో రబ్బర్‌బాండ్ గిటార్ తయారుచేశాను. వాటి మీద కొన్ని మెలడీలు వాయించడానికి ప్రయత్నించాను. నేను పెద్దవాడినయ్యాక, మా నాన్నగారు నాకు చిన్న కీబోర్డు కొన్నారు. దానిమీద నేను చిన్న చిన్న రాగాలు వాయిస్తూ, ట్యూన్స్ చేస్తుండే వాడిని. ఇవన్నీ కూడా సంగీతంలో ఎటువంటి శిక్షణ లేకుండా చేసినవే. ఐఐటీలో కర్ణాటక సంగీతం, లలితసంగీతం... వీటికి సంబంధించి తరచు సంభాషణలు జరుగుతుండేవి. కాలేజీ చదువు పూర్తయ్యాక నా మనసు సంగీతం వైపు పరుగులు తీసింది.
సంగీతచక్రం తయారుచేయాలనే ఆలోచన వెనుక..?
సంగీతమంటే చాలా కష్టమని పిల్లలు గురువుల వద్దకు వెళ్లడానికి కూడా భయపడతారు, ప్రాథమిక అంశాలను నేర్పే గురువులు కూడా దొరకట్లేదు, సంగీతంలోని రాగాలన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండటం... ఈ అంశాలను బాగా నిశితంగా పరిశీలించి, అందుకు ఏదైనా పరిష్కారం చూడాలని ఆలోచించాను. అలా ఎన్నో సంవత్సరాల కృషి ఫలితంగా ఈ చక్రం రూపకల్పనకు పునాది ఏర్పడింది.
కర్ణాటక సంగీతంలోని రాగాలను బాగా నిశితంగా వింటూ, ఆయా రాగాలను సూక్ష్మంగా పరిశీలించేవాడిని. వెస్టర్న్ స్కేల్‌తో కర్ణాటక రాగాలను అనుసంధానం చేస్తే తేలికగా ఉంటుందని భావించాను. అలా ప్రాక్పశ్చిమ సంగీతాల అనుసంధానంగా దీని నిర్మాణం జరిగింది.
ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది?
ఈ చక్రం... సంగీత ప్రారంభకులకు మాత్రమే కాకుండా, సుశిక్షితులకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ చార్ట్ చూస్తే పిల్లలు సైతం రాగాలను కీ బోర్డ్ మీద సులువుగా పలికించగలుగుతారు. కొత్తగా ట్యూన్స్ చేయాలనుకునేవారు ఈ చక్రం సహాయంతో చేయగలుగుతారు.
కీబోర్డు మీద మాత్రమేనా? ఇతర వాయిద్యాలకు ఉపయోగపడదా?
కీ బోర్డు వాయించేవారికి మాత్రమే కాకుండా అన్నిరకాల సంగీత పరికరాలు వాయించేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న కీబోర్డులలో తంబుర, సితార్, వయొలిన్, వీణ, ఫ్లూట్ వంటి భారతీయ వాద్యాలన్నీ అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల ఈ చక్రం సహాయంతో అన్నిరకాల వాద్యపరికరాలను ఉపయోగించి ట్యూన్‌స చేయవచ్చు.
చక్ర నిర్మాణం గురించి...
డెబ్బైరెండు మేళకర్తలను సులువుగా నేర్చుకోవడానికి వీలుగా ఈ చక్రనిర్మాణం జరిగింది. ఈ చక్రాన్ని రెండు భాగాలుగా విభజించాను. ఒక్కో వరుసకి 36 విభాగాలు ఉంటాయి. మళ్లీ వాటిని 12 కింద విభజించాను. ఒక్కో చక్రం కింద ఆరు రాగాలు ఉంటాయి. ఆ రాగాల మూర్ఛన, వాటి స్వరస్థానాలు కీ బోర్డు మీద సూచించి ఉంటాయి. దీనిని చూడవచ్చు, స్పృశించవచ్చు, అనుభూతి చెందవచ్చు, దృశ్యీకరణ చేయవచ్చు, గుర్తుంచుకోవచ్చు.
చ్రక్రాన్ని అర్థంచేసుకోవడానికి సంగీతం తెలిసి ఉండాలా?
సంగీతం గురించి ఏ మాత్రం తెలియనివారు సైతం స్వరాల గురించి, మేళకర్తల గురించి, రాగాల గురించి చర్చించుకుంటే, అనుభూతి చెందగలుగుతారు. ఈ చక్రాన్ని అందరికీ అందుబాటు ధరలో అందచేయాలని సంకల్పిం చాం. ఇంతేకాకుండా నేను, నా భార్య శ్రీదేవితో కలిసి జ్చఛ్ఛిట (జౌౌఛీ, ్చజీఛీ, ఛిౌ్టజిజీజ, ్ఛఛీఠఛ్చ్టిజీౌ, టజ్ఛ్ట్ఛిట) అనే సంస్థను స్థాపించాం. చక్రాలను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని జ్చఛ్ఛిట కోసం ఖర్చు చేయాలని నిశ్చయించుకున్నాం.
మీ చక్రానికి వస్తున్న స్పందన...
ఈ విషయంలో ముందుగా రాజా రామవర్మ (ట్రావన్‌కోర్ సంస్థానాధీశులు, రాజా రవివర్మ వంశానికి చెందినవారు) గురించి చెప్పుకోవాలి. చెన్నైలో కర్ణాటక సంగీతానికి సంబంధించిన వర్క్‌షాప్ నిర్వహించినప్పుడు ఈయన కొందరు విద్యార్థులకు వీటిని ఉచితంగా అందచేశారు. ఈ చక్రాన్ని ఉపయోగించి సాధన చేసినవారిలో చాలామంది ఇది తమకెంతో ఉపయుక్తంగా ఉందని వివరించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ వంటివారు ఎంతగానో ప్రశంసించారు. సంగీత రాగాలను, మూర్ఛనలను అర్థం చేసుకుని, సులువుగా నేర్చుకోవడానికి రమేశ్ గారు చేసిన కృషి ప్రశంసనీయం.
- సంభాషణ: డా.పురాణపండ వైజయంతి
రాగాలు, మూర్ఛనలు, స్వరస్థానాలు
కర్ణాటక సంగీతం మీద వెలువడిన చాలా పుస్తకాలలో 72 మేళకర్తలకు సంబంధించి అగ్ని, వేద, ఋతు, ఆదిత్య... వంటివి ఉన్నాయి. ఈ చక్రం కింద రాగాలను... మూర్ఛనలు, స్వరస్థానాలను అనుసరించి తయారుచేశారు. ఉదాహరణకు చక్రవాకం (16 వ మేళకర్త), శంకరాభరణం (29వ మేళకర్త), మేఘకళ్యాణి (65వ మేళకర్త) మొదలైనవి