
అనుపమా షెనాయ్.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్. 2010, కర్ణాటక కేడర్. రెండేళ్ల కిందట.. బళ్లారి జిల్లాలోని కుడ్లిగీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నప్పుడు అక్కడి మద్యం మాఫియా కోరలు విరిచే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆ మాఫియా లీడర్ కర్ణాటక రాష్ట్ర కేబినెట్‌లోని ఓ మంత్రికి చాలా దగ్గర. ఆ మంత్రి సహాయంతో అనుపమను నానా ఇబ్బందులు పెట్టాడు. ఆమె పైఅధికారులతో చెప్పించి కట్టుదిట్టం చేశాడు. అయినా అమె సర్దుకుపోలేదు. దుష్టశక్తులతో ఢీకొనడానికే సిద్ధపడ్డారు!
మాఫియాను నిలువరించడానికి అనుపమ చాలా పోరాటమే చేశారు. ఆ లిక్కర్ మాఫియా వల్ల కుడ్లిగీ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అయినా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆఖరికి డిపార్ట్‌మెంట్‌లో కూడా తనకు మద్దతు దొరక్కపోయేసరికి కలత చెందిన అనుపమ.. ఉద్యోగానికి రాజీనామా చేశారు.
రాజకీయ నాయకుల అవినీతితో విసిపోయి అనుపమ అప్పుడే ఓ నిర్ణయానికీ వచ్చారు. తను రాజకీయాల్లోకి రావాలని! అయితే ఇప్పుడున్న పార్టీల కండువా మోయకుండా తనే సొంతంగా ఓ పార్టీ పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఆ పార్టీ మూడు ‘సీ’లను.. అంటే కరప్షన్, కమ్యూనలిజం, కాస్టీజం.. వీటికి వ్యతిరేకంగా ఉండాలనుకున్నారు. అదే తమ ఎజెండాగా ‘భారతీయ జనశక్తి కాంగ్రెస్’ను స్థాపించారు.
ఈ పోటీ గెలుపు కోసం కాదు
మే 12న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న మొత్తం 225 అసెంబ్లీ స్థానాలలో అనుపమ ‘భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ’ 30 స్థానాలకు పోటీ చేస్తోంది. అనుపమ కోస్తా ఉడిపి జిల్లా నుంచి పోటీకి నిలబడుతున్నారు. ‘‘పార్టీ పెట్టి ఆర్నెల్లు కూడా కాలేదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు మా ధ్యేయం కాదు. మా పార్టీ గురించి ప్రజలకు తెలియాలి. ఈ ఎన్నికలను అందుకోసమే ఉపయోగించుకుంటున్నాం’’ అంటున్నారు అనుపమ షెనాయ్.
బీజేసీ నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ నేర చరిత్ర లేదు. ఎవరూ అవినీతి పరులు కాదు. అంతేకాదు, తన పార్టీకి సామాజిక, ఆర్థిక హోదా సంబంధం లేదనీ స్పష్టం చేస్తున్నారు అనుపమ. పైగా సామాజికంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యమని ముందే స్పష్టం చేశారు. పేద వర్గం కూడా తన పార్టీలో నిరభ్యంతరంగా చేరవచ్చనీ, వారికీ టికెట్స్ ఇస్తామనీ హామీ ఇస్తున్నారు అనుపమ.
విద్యకు, ఆరోగ్యానికీ ప్రాధాన్యం
‘‘బీజేపీ, కాంగ్రెస్.. ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా అన్నీ అవినీతి కూపాలే. బీజేపీ అయితే మరీనూ’’ అంటున్నారు అనుపమ. ‘‘కర్ణాటకలో ఆ పార్టీ ఆగడాలకు అంతే లేదు. కాంగ్రెస్ కూడా మూడు ‘సీ’లకు దాసోహం. అందుకే వాటన్నిటికీ అతీతంగా బీజేసీని ఏర్పాటు చేశాం. మా పార్టీ పారదర్శకంగా ఉంటుంది. ప్రో విమెన్, ప్రో ఎన్విరాన్‌మెంట్, ఇంకా.. చిరకాలం కొనసాగే విధానాలే మా పార్టీ లక్ష్యం.
వీటిని ఏ పార్టీ ఆచరించినా మా మద్దతు, సహకారం ఉంటాయి. ఆరోగ్యం, విద్య ఎంతగా వ్యాపార రంగాలు అయిపోయాయో చూస్తున్నాం. ఆ ధోరణిని అరికడతాం. ఆ రెండు రంగాల్లోనూ ప్రభుత్వ సంస్థలనే ప్రోత్సహిస్తాం. వాటి విధులను మెరుగుపరుస్తాం. ప్రజలే కింగ్ మేకర్స్. వారి సంపూర్ణ భద్రత, రక్షణే మా బాధ్యత’’ అని ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు అనుపమా షెనాయ్.
హాయిగా ఉద్యోగం చేసుకోకా!
కాంప్రమైజ్ అయిపోయి.. హాయిగా ఉద్యోగం చేసుకోక.. పార్టీలు.. ఎన్నికలు.. అంటూ ఈ తలనొప్పులు ఎందుకు? అని అనుపమను వెనక్కి లాగిన వారూ చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ .. ‘‘ఇరవై నాలుగు గంటలూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖే అవినీతిమయమై, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ప్రజాకంటకంగా మారితే.. ‘నాకేంటి? నా జీతం నాకొస్తోంది కదా’ అని ఊరకుండిపోయే తత్వం కాదు నాది.
ప్రశ్నించే యువత రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడున్న పార్టీల్లో యువతకు అవకాశం లేదు. నా పార్టీ ద్వారా వారికి అవకాశం కల్పిస్తా.. అవినీతి లేని పాలన అందే వరకు పోరాడుతా’’ అని సమాధానమిస్తున్నారు అనుపమ.
Comments
Please login to add a commentAdd a comment