ఇరుముడి యాత్ర
శబరిమల
శబరిమల లేదా శబరిమలై అని పిలిచే ఈ ప్రాంతం కేరళలో ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రం. పతనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల కిందకు వస్తుంది. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. మణికంఠుడుగానూ భక్తులు కొలిచే ఈ స్వామి దర్శనానికి చేసే యాత్ర న వంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. శబరిమల యాత్రకు ప్రతి యేడాది దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండలపూజ నవంబర్ 17, మకరవిళక్కు(మకరజ్యోతి) జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు.
ప్రాచుర్యం వచ్చిందిలా...
1977 వరకు శబరిమల అయ్యప్పస్వామి గురించి తెలుగు వారికి అంతగా తెలియదు. విజయవాడలోని గొల్లపూడి, హైదరాబాద్ బొల్లారంలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడం, కొందరు తెలుగువారు తమిళులు, కేరళీయులతో యాత్ర చేసి రావడంతో తెలుగురాష్ట్రాలలో అయ్యప్పస్వామి ప్రాచుర్యం పెరిగింది. ఈ యాత్రకు దాదాపుగా స్త్రీలకు అనుమతి లేదని చెప్పాలి. అడవులు, కొండల గుండా నడవాల్సిన దారి, మరుగు సదుపాయాలు లేకపోవడం, నెలసరి సమస్య, మగవారి బ్రహ్మచర్యదీక్ష మొదలైన కారణాల వల్లనే స్త్రీలకు ప్రవేశం కల్పించలేదనిపిస్తోంది. అయితే పదేళ్ల లోపు బాలికలను, యాభై ఏళ్లు దాటిన వారిని మాత్రం అనుమతిస్తారు.
శబరిమల యాత్రకు ఇరుముడి జీవం వంటిది. పరశురామ నిర్మితమైన పదునెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడానికి దీక్ష, ఇరుముడి ఏర్పాటుచేశారు.
కొండాకోనల్లో... జానపదాలతో...
నలభై ఒక్క రోజులపాటు దీక్షలో పాటించిన కఠోర నియమాల పరమార్థమేమిటో పెద్దపాదంలో ఒక్కొక్కటిగా బోధపడుతుంటుంది. ఒంటికి రంగులు పులుముకొని... గిరిజనుల్లా వేషాలు ధరించి... జానపదాలు పాడుతూ... మేళతాళాలకు నర్తిస్తూ ‘ఎరుమేలి’లో ‘పేటతుళ్లి’ (మహిషితో యుద్ధం చేసినప్పుడు అయ్యప్ప చేసిన తాండవం) ఆడతారు భక్తులు. అటు తరువాత ధర్మశాస్తాగా ఉన్న అయ్యప్పను, వావర్ స్వామిని దర్శించుకొని వనయాత్ర ప్రారంభిస్తారు.
పులులు, సింహాల వంటి క్రూరమృగాలు... ఏనుగుల వంటి భారీ జంతువులు... విషసర్పాలు సంచరించే కీకారణ్యంలో... చెప్పులు లేకుండా... రాళ్లూరప్పలు ముళ్ల బాటలో వడివడిగా అడుగులు వేస్తూ సాగిపోతుందీ యాత్ర. శిరస్సున ఇరుముడి... నోట శరణఘోష... దట్టమైన అడవుల్లో ఇవే స్వాములను నడిపించే దివ్యశక్తులు. దారిలో పెరూర్‌తోడు, కాళైకట్టి చేరుకుంటారు. కొద్ది దూరంలోనే అళుదా నదిలో స్నానమాచరించి ఆపై ఎత్తయిన అళుదా మేడు, కరిమల (ఏనుగుల ఆవాసం)ను ఎక్కిదిగుతారు భక్తులు. ఇది ఎంతో ప్రయాసతో కూడింది. అక్కడి నుంచి పెరియానవట్టమ్, చెరియానవట్టమ్ మీదుగా యాత్ర పంబా నది చేరుకుంటుంది. ఈ మార్గం గుండా పయనిస్తుంటే మాటలకందని మధురానుభూతి పొందక మానం. పక్షుల రెక్కల సవ్వడులు... ఏనుగుల ఘీంకరింపులు... స్వచ్ఛమైన గాలి తలపరింతలు... పిల్ల యేరుల పరవళ్లు... కాంక్రీట్ జంగిల్‌లో రణగొణ ధ్వనుల మధ్య కాలుష్యపు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న ప్రాణం కేరింతలు కొడుతుంది.
పంబా స్నానం... సన్నిధానం...
పంబా నదిలో పుణ్య స్నానాల అనంతరం శబరి పీఠం, నీలిమల, అప్పాచీ మేడు, శరంగుత్తి మీదుగా స్వామి సన్నిధానం చేరుతుంది. అక్కడ ఏకశిలపై పరశురాముడు రూపొందించిన పద్దెనిమిది మెట్లు దాటి అయ్యప్ప దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పిస్తారు స్వాములు.
గుడి తెరిచి ఉంచే రోజులు...
ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు (మధ్యలో రెండు రోజులు మినహా) మండలం, మకరవిళక్కుల కోసం ఆలయం నిత్యం తెరిచి ఉంటుంది. అలాగే ప్రతి మళయాళ మాసంలో తొలి ఐదు రోజులూ ఆలయాన్ని తెరుస్తారు. మిగతా రోజుల్లో మూసి ఉంచుతారు. ఈసారి మకర విళక్కు కోసం డిసెంబరు 30 నుంచి జనవరి 21 (ఉదయం 7 గంటల) వరకు మకర విళక్కు నిర్వహిస్తున్నారు. జనవరి 15న మకర విళక్కు, జ్యోతి దర్శనం.
ఆన్‌లైన్‌లో శబరిమలలో వసతి సదుపాయం పొందాలంటే జ్ట్టిఞ://ఠీఠీఠీ.ట్చఛ్చటజీఝ్చ్చ్చఛిఛిౌఝౌఛ్చ్టీజీౌ. ఛిౌఝ లాగిన్ అవ్వచ్చు. పేమెంట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారానే చేయాలి. రిజర్వేషన్ చార్జ్ రూ.100 ఉంటుంది.
- ఎన్.ఆర్.
ఇన్‌పుట్స్: హనుమా
చేరుకొనే మార్గాలు...
రైలు: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ బయలుదేరుతుంది. నాంపల్లిలో బయలుదేరే ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా త్రివేండ్రం వరకు వెళుతుంది. శబరి వెళ్లేవారు కేరళలోని కొట్టాయం లేదా చెంగనూరు రైల్వే స్టేషన్లలో దిగాలి. ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు. అక్కడి నుంచి ఎరుమేలి లేదా పంబా చేరుకోవాలంటే కేరళ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా శబరిమల 1192 కి.మీ.
శబరిమలకు సమీప విమానాశ్రయాలు: కొచ్చిన్, త్రివేండ్రం. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంబ/ ఎరుమేలి చేరుకోవాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల నుంచి రోజూ విమాన సర్వీసులున్నాయి. కొచ్చి నుంచి పంబా: 160 కి.మీ. (రోడ్డు మార్గం)
తిరువనంతపురం నుంచి పంబా: 170 కి.మీ.
దర్శనీయ స్థలాలు...
కోడంగళ్లూర్ భగవతి ఆలయం: త్రిసూర్ నుంచి 38 కిలోమీటర్లు. దారిక రాక్షసుడిపై యుద్ధంలో కాళీ మాత విజయానికి గుర్తుగా ఇక్కడ ఏటా నిర్వహించే ‘కోడంగళ్ భరణి’ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ.
అనంత పద్మనాభ స్వామి ఆలయం
ఇది త్రివేండ్రంలో ఉంది. అనంత పద్మనాభస్వామి మూడు ద్వారాల్లో దర్శనమిస్తారు. నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించిన చిత్రాన్ని ఇక్కడ దర్శించవచ్చు. కొట్టాయం నుంచి తిరువనంతపురం 147 కి.మీ. పంబా నుంచైతే 180 కి.మీ. అనంత పద్మనాభస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న పజావంగడి గణపతి దేవాలయం పురాణ ప్రాశస్త్యమున్నది. చెంగనూర్ భగవతి ఆలయం: పంబా నుంచి చెంగనూరుకు 93 కి.మీ. ఇక్కడ విశాలమైన ప్రాంగణంలో తూర్పు, పడమర ముఖాల్లో పార్వతి, పరమేశ్వరులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని వెనక వైపునకు వెళితే స్వామి దర్శనమిస్తారు. నేరుగా బస్సులుంటాయి.
గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయం: దక్షిణభారత దేశంలో ప్రముఖమైన శ్రీకృష్ణుడి ఆలయం ఇది. ప్రాతఃకాలంలో గజరాజు స్వామివారికి ప్రదక్షిణలు చేసి మేలతాళాలతో మేల్కొల్పడం ఇక్కడి ఆనవాయితీ. త్రిసూర్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది.ఛోటానిక్కర్ అమ్మవారు: కొచ్చి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దేవి కొలువైన మరో అద్భుత క్షేత్రం ఛోటానిక్కర్. ఇవే కాకుండా శబరిమలకు వెళ్లే దారిలో, సమీపంలో మరెన్నో అతి పురాతన దేవాలయాలున్నాయి. కొచ్చికి 20 కి.మీ. దూరంలో వైకోమ్ మహాదేవర ఆలయం, 15 కి.మీ. సమీపంలో కడుత్తురుతి మహాదేవ ఆలయం, ఎట్టుమానూరు మహాదేవర ఆలయం, అక్కడి నుంచి 12 కి.మీ. దూరంలో తిరునక్కర మహాదేవర క్షేత్రం (కొట్టాయం) అలరారుతున్నాయి.
కొట్టరక్కర గణపతి క్షేత్రం: కొల్లమ్ జిల్లాలో కొలువైన ఈ ఆలయం శబరిమల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరన్‌ముల శ్రీపార్థసారథి ఆలయం: పంబానదీ తీరంలో, చంగనూర్ నుంచి శబరికి వెళ్లే దారిలో, తిరువనంతపురానికి 125 కిలోమీటర్ల దూరంలో నెలవైన అరన్‌ముల శ్రీపార్థసారథి ఆలయం చారిత్రక నేపథ్యం గలది. పురాణాల్లో పేర్కొన్న 108 వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి.
మలయలప్పుజ భద్రకాళి: పతనంతిట్టకు సమీపంలో, తిరువనంతపురానికి 110 కి.మీ. దూరంలో దుర్గా అమ్మవారు వేంచేసి ఉన్నారు.