
శబరిమల : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శన వేళల్లో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మార్పులు చేసింది. ప్రధానంగా మండల పూజల సమయంలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు రావచ్చన్న సంకేతాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని పొడిగించింది.
భక్తులు ఇకపై తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేవారు. అలాగే అర్ధరాత్రి ఒంటి గంటవరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇదే గతంలో 11 గంటలకు అయ్యప్ప స్వామి హరివరాసనం చేసిన తరువాత ఆలయాన్ని మూసివేసేవారు. ఇప్పుడు హరివరాసనం పూజను అర్ధరాత్రి 1 గంటకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సవరణ కేవలం మండల పూజల వరకే ఉంటుందని ట్రావెన్ కోర్‌దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.
భారీగా పోలీసు భద్రత
ఈ ఏడాది శబరిమలకు భారీగా భక్తులు వస్తారన్న అంచనాలు, అలాగే ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ దఫా ఎన్నడూ లేనంత భద్రతను ఆలయానికి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా శబరిమల ఆలయం, స్వామి సన్నిధానం, మాలికాపురం, శరంగుత్తి, పంబా గణపతి ప్రాంతాల్లో భారీ భద్రతను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 1500 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటారని ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment