దేవదాసు... నాకొద్దు బాసూ!
‘‘మాది అంతులేని కథ. ఫుల్‌స్టాప్ పెట్టకుండా మీడియా డిస్కస్ చేస్తూనే ఉంటే.. మా కథ ఎప్పటికీ ఆగదు. రణ్‌బీర్ ఓ మాట అన్నాడు. బదులుగా నేనేదో అన్నాననుకోండి.. మూడో వ్యక్తి ఇంకేదో అంటాడు. ప్లీజ్.. బ్రేకప్‌కి కారణం ఏంటి? వంటి ప్రశ్నలు అడగొద్దు. ఆ డిస్కషన్ మా ఇద్దరి మధ్యే ఉండాలి’’ అని కత్రినా కైఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందాల సుందరి ఇంతలా విజ్ఞప్తి చేసుకున్నా బీ-టౌన్ మీడియా మాత్రం వదలడంలేదు. కూపీలు లాగే పనిలో పడింది. రణ్‌బీర్, కత్రినాల బ్రేకప్ గురించి ఇప్పటికే బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘కత్రినా నాకు చాలా స్పెషల్.
అమ్మానాన్నల తర్వాత నా జీవితంలో అంత ముఖ్యమైన వ్యక్తి. బ్రేకప్ తనను అప్‌సెట్ చేసింది. నేను బాగా తాగుతాను. నా ప్రేయసి కోసం తాగుడు మానేయాలనుకుంటున్నాను’’ అని రణ్‌బీర్ వ్యాఖ్యానించడంతో కొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ వాలకం చూస్తుంటే.. కత్రినాకు దగ్గరయ్యేలా అతని మాటలు ఉన్నాయి. కత్రినా మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదట. ఎందుకంటే... షూటింగ్ లేకపోతే రణ్‌బీర్ నోట్లో చుక్క పడాల్సిందేనట. మామూలుగా ప్రేమలో విఫలమైనవాళ్లు దేవదాసులా మద్యానికి బానిసలవుతారు. కానీ, రణ్‌బీర్ మాత్రం ప్రేమలో ఉన్నప్పటికీ సీసా పట్టుకోకుండా ఉండలేడట.
ఇది కత్రినాకు నచ్చలేదట. అందుకే రణ్‌బీర్ నుంచి విడిపోవాలనుకుందని బీ-టౌన్ మీడియా ఇన్వెస్టిగేషన్ తేల్చింది. ఇదిలా ఉంటే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు కత్రినా దగ్గరైందని కొందరు అంటున్నారు. అందుకే రణ్‌బీర్‌కు దూరం కావాలనుకుందని చెప్పుకుంటారు. మరి.. బ్రేకప్‌కి అదే కారణమా? లేక నిజంగానే రణ్‌బీర్ మద్యానికి బానిస కావడంవల్లే కత్రినా అతనికి దూరమైందా? నిజమేంటో రణ్‌బీర్, కత్రినాలకే ఎరుక.