ఆకలి కడుపులకు అక్షయపాత్ర | ISKCON Bangalore branch of their 'akshaya patra ' Foundation | Sakshi
Sakshi News home page

ఆకలి కడుపులకు అక్షయపాత్ర

Published Mon, Feb 9 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

ఆకలి కడుపులకు అక్షయపాత్ర

ఆకలి కడుపులకు అక్షయపాత్ర

ఒకేసారి 15 లక్షల మందికి ఉచితంగా భోజనాలు పెట్టాలంటే? అలా ప్రతి రోజూ చేయాలంటే?
కచ్చితంగా వారి చేతిలో ఏ అక్షయపాత్రో ఉంటే తప్ప సాధ్యం కాదు అని అంటారా? కాని అది సాధ్యమేనని నిరూపించింది ఇస్కాన్ బెంగుళూరు శాఖ వారి ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్. ప్రతి రోజూ దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం వేళ నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్న  అక్షయపాత్ర ఫౌండేషన్  నేడు ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమంగా గుర్తింపు పొందింది.

 
ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల వారు పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్ ఆలయంలో ఉన్నప్పుడు, వీధుల్లో చెత్తకుప్పలపై ఉన్న ఆహార వ్యర్థాలకోసం కుక్కలతో పాటు చిన్నపిల్లలు కూడా పోటీ పడటాన్ని గమనించారు. ఆనాడే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు కనీసం 10 మైళ్ల దూరం వరకు ఎవరూ ఆకలితో అలమటించకూడదని నిర్ణయించుకున్నారు.
 
2000లో అక్షయపాత్ర ఫౌండేషన్ పేరిట తొలుత బెంగుళూరులో 1500 మంది పిల్లలకు భోజనాలు అందించారు. ఆపై ఈ కార్యక్రమం అంచెలంచెలుగా దేశం నలుమూలలకూ విస్తరించడం మొదలైంది. అలా చిరు ప్రయత్నంతో మొదలై నేడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు మొత్తం 11రాష్ట్రాల్లో, 10550 స్కూళ్లలోని లక్షలాది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అన్నం పెడుతోంది ఇస్కాన్.
 
తమ వంతుగా...
 అక్షయపాత్ర కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన వంతు సాయం చేస్తూనే ఉంది. అలాగే టాటా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, టీసీఎస్‌లతో పాటు అనేక చిన్నాపెద్ద సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నాయి.
 
ప్రభుత్వం చేయూత
ప్రారంభించిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ప్రతి రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి వచ్చాయి. అలాగే ఇస్కాన్ చేస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తనవంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రతి భోజనానికి అయ్యే ఖర్చు రూ.8.50 అయితే ప్రభుత్వం అందులో రూ. 4.50 వరకు ఇస్తే, మిగిలిన రూ.4 ఫౌండేషన్ భరిస్తోంది.
 
పోషకాహార విషయంలో రాజీపడలేదు
ప్రత్యేకమైన యంత్రాల సాయంతో అన్నం, కూరలను వండి, వేడి తగ్గకుండా హాట్ బాక్స్‌లలో పెట్టి వ్యాన్‌లలో స్కూళ్లకు తరలిస్తారు.  దాదాపు 30 వెరైటీ వంటకాలు తయారు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న కిచెన్‌లో రోజూ దాదాపుగా లక్షమందికి సరిపడే ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో 65000 భోజనాలను స్కూళ్లకు, మిగిలినవి అంగన్ వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు.
 
తక్కువ సమయంలో ఎక్కువమందికి...
ప్రస్తుతం పటాన్‌చెరులో ఉన్న యంత్రాలు ఒకసారికి 100 కేజీల బియ్యాన్ని మాత్రమే ఉడికించగలవు. ఇందుకు 45 నిమిషాలు పడుతుంది. ‘‘మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఏర్పాటు కానున్న మోడరన్ కిచెన్‌లోకి రానున్న సరికొత్త యంత్రం 800 కేజీల బియ్యాన్ని కేవలం 30 నిమిషాలలో ఉడికిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి భోజనాన్ని అందించే వీలుంటుంది. ఈ యంత్రాన్ని స్విస్‌నుంచి దిగుమతి చేస్తున్నాం’’ మరింతమందికి ఆహారం అందించనున్నామన్న సంతోషం కళ్లలో కదలాడుతుండగా చెప్పారు అక్షయపాత్ర ఫౌండేషన్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస స్వామి.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైజాగ్‌లో ఏర్పాటయిన కిచెన్‌లో రోజుకి 50వేల మందికి సరిపడ ఆహారాన్ని అక్షయపాత్ర అందిస్తోందని, అలాగే కాకినాడ, రాజమండ్రిలో కూడా త్వరలోనే కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. బడిపిల్లల కోసమే కాదు సామాన్యుడి ఆకలిని తీర్చడంలో కూడా అక్షయపాత్ర తన వంతు చేయూత అందిస్తోంది.

సద్దిమూట
మార్కెట్ యార్డ్‌లలో వ్యాపారం చేసే రైతులకు నాణ్యమైన భోజనాలు అందించే సదుద్దేశంతో అక్షయ పాత్ర ఫౌండేషన్ సిద్దిపేటలో మొదట ‘సద్దిమూట’ ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావడంతో బోయిన్ పల్లి, గజ్వేల్‌లో కూడా ప్రారంభించారు. ప్రతి రోజూ దాదాపు పదికి పైగా హాస్పిటళ్లలో ఉన్న 3500 మంది రోగులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు.

 - శ్రావణ్ జయ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement