సోషల్ మీడియా పిల్లల మునివేళ్లతో ఆడుకుంటోంది. కొందరు ప్రయోజనానికి వాడుకుంటుంటే.. మరికొందరు బానిసలుగా మారి ‘నెట్’లో పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు విద్యార్థుల్ని, యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టెక్నాలజీ మన ముందు అద్భుతమైన అవకాశాలను ఉంచుతోంది. అదే సమయంలో మొబైల్, సోషల్ నెట్‌వర్క్ సైట్లు యువతని కొన్నింటికి దూరం చేస్తున్నాయి. అటువంటి చిన్నారులు, విద్యార్థులకు గెడైన్స్ చేసేందుకు నిర్వహించిన కార్యక్రమమే... ‘స్మాక్’ (ఎస్‌ఎంఏసీ- సోషల్ మీడియా, మొబైల్, అనలటిక్స్, క్లౌడ్).
తొలిసంధ్య వెలుగు, ప్రకృతి ఆరాధన, భావ వ్యక్తీకరణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి లాంటి సున్నితమైన అంశాల్లో నేటి యువత ఇంకా వెనుకబడే ఉంది. దీనికి కారణం మనదేశంలో పిల్లలు చిన్నతనంలో నుంచే తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడితో బలవంతంగా ఇష్టం లేని లక్ష్యాలవైపు నడవటమే. దీని వల్ల చిన్న పిల్లల్లో సహజంగా ఉండాల్సినంత ఆసక్తి, చురుకుదనం రానురాను కొరవడుతోంది. పైగా విపరీతమైన అసహనం, ఒత్తిడి వారిలో పెరిగిపోతోంది. ఈ విషయాన్నే ప్రధానాంశంగా తీసుకుని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ బుధవారం అంతర్జాతీయ ప్రముఖులతో బంజారాహిల్స్ పార్క్ హయత్‌లో ఓ చర్చా వేదిక ఏర్పాటు చేసింది. నాసా చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ ఎడ్వర్డ్ రోజర్స్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నర్తకి ఆనంద శంకర్ జయంత్, విద్యారంగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న గుత్సవ్ జే గ్రాప్, కెరీర్ మెంటార్ దీపక్ ఇందులో పాల్గొన్నారు.
చెప్పే విధానం తెలియాలి
సోషల్ మీడియా నుంచి పిల్లలను దూరంగా ఉంచడమంటే ఈ రోజుల్లో కష్టమే. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు ప్రతి విద్యార్థీ తెరుస్తున్నాడు. కొందరు వాటికి వ్యసనపరులుగా మారుతున్నారు కూడా. ‘పిల్లలకు ఏ విధంగా చెబితే మన దారికి వస్తారన్నది మొదట తల్లిదండ్రులు తెలుసుకోవాలి’ అంటారు ఈ ప్యానల్ డిస్కషన్‌కు హాజరైన విద్యావేత్త గుత్సవ్ జే గ్రాఫ్. టీవీ, గేమింగ్, సోషల్ మీడియాలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయని చాలామంది పేరెంట్స్ కంప్లయింట్ చేస్తుంటారు. అయితే, పిల్లల్ని మార్చాలనుకునే ముందు పేరెంట్స్ మారాలనేది ఆయన అభిప్రాయం.
పరిధి ఉండాలి
ఈ రోజుల్లో టెక్నాలజీ వినియోగం తప్పనిసరే. అయితే, దాన్ని ఏ మేరకు, ఎంత వరకు వాడాలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకోవాలని నిపుణులు సూచించారు. ఇక పిల్లలపై పెద్దలు తమ అభిరుచులను, అభిప్రాయాలను రుద్దడంపై కూడా ప్రధానంగా చర్చించారు. ఆనందశంకర్ జయంత్... ‘పిల్లల్ని మొండిగా దారిలో పెట్టాలనుకోవడం పొరపాటు. ఎవరి ఆసక్తులు వారివి. అవి చెడ్డవైతే మంచిగా చెప్పి మాన్పించాలి. పోలిక అసలు పనికిరాదు’ అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు గురువుల దృక్కోణమూ మారాలంటారు ఆమె.
ఆసక్తి గమనించాలి: రోజర్స్
భారత్‌లో యువత సొంతంగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. నేటికీ ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు, బంధువుల ప్రభావం వల్ల సరైన లక్ష్యాలను ఎంచుకోలేక పోతున్నారు. పిల్లలు ఏ పనైతే ఎక్కువగా చేయాలని ఆసక్తి చూపుతారో ఆ రంగం వైపే వారి లక్ష్యాలను నిర్దేశించుకునేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి.
- శ్రావణ్‌జయ
అలక్ష్యం వద్దు
Published Thu, Jan 29 2015 12:22 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM
Advertisement
Advertisement