
ఆ ఘర్షణ
ప్రేమ అనుకుని ఆకర్షణలో పడింది... ఆకర్షణ అని తెలిశాక ఘర్షణలో పడింది.
ప్రేమకు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయని తెలుసుకోలేకపోయింది!
వన్‌వేలు, టూవేలు ఉంటాయని కూడా తెలుసుకోలేకపోయింది.
ప్రేమ ఒక్కోసారి సడన్‌గా పుడుతుంది... love ఎట్ ఫస్ట్ సైట్.
ఒక్కోసారి మెల్లగా పుడుతుంది... పరిచయం పెరిగాక.
తరచు ప్రేమ ఆకర్షణ నుంచి పుడుతుంది. ఇది చాలా కన్‌ఫ్యూజన్‌ను పుట్టిస్తుంది.
ఘర్షణను పెంచుతుంది. ద్వేషాన్ని పోషిస్తుంది.
ఆ ఘర్షణ నుంచి.. ఆఘర్షణ నుంచి బయటపడేసే కథనమే ఇది.
‘‘నేహా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! నీ తెలివంతా నా దగ్గర చూపించకు..’ సౌరభ్ మాటలకు ఓ క్షణం బిత్తరపోయింది నేహ. ‘‘ఏంటీ, నీ దగ్గర తెలివి చూపించానా! అంత తెలివి ఉన్నదాన్నయితే ఇన్నాళ్లు నీ వెంట ఎందుకు తిరుగుతాను?’’ అంతే విసురుగా సమాధానమిచ్చింది నేహ. ‘‘ఇక డిస్కషన్స్ అనవసరం. ఎవరిదారి వాళ్లది. బై..’’ అని చెప్పేసి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు సౌరభ్.
ఆ మాటలతో నేహలో రోషం, ఆ వెంటనే దుఃఖం ఒకేసారి ముంచుకొచ్చేశాయి. ‘వీడ్ని ప్రేమించినందుకు తగినశాస్తి జరిగింది. బాధ్యత తెలిసినవాడనుకున్నాను. కానీ, వీడూ ఓ అవకాశవాది. ఆ అనూ ఉందిగా! అదొచ్చాకే నేను ‘వేస్ట్’ అయిపోయాను. చూస్తాను నన్ను కాదనుకొని ఎలా ఆనందంగా ఉంటారో.. ’ కోపంగా పళ్లునూరింది నేహ. ‘‘నేహ ఎంత అమాయకంగా ఉండేదిరా... ఎంత ఇష్టపడ్డాను తనను. ఇప్పుడు నన్నే అన్ని మాటలంటుందా? ఎంత హెల్ప్ చేశాను తనకి. కనీస కృతజ్ఞత కూడా లేదు .. ఛీ. చీ..’’ ఫ్రెండ్ దగ్గర వాపోయాడు సౌరభ్.
దారి మళ్ళిన ఆకర్షణ
‘‘నేహ ఒంటరిగా గదిలోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లమంటే వెళ్లనంటోంది. ఏమైనా అడిగితే ఏం లేదు అని తప్పించుకుంటోంది. మునుపటి సరదా లేదు తనలో... దాన్ని చూస్తుంటే మాకు భయమేస్తోందమ్మా. దాని బాగుకోరేదానివైతే ఏమైందో చెప్పు..?’’ బతిమాలుతూ వేదను ఫోన్‌లో అడిగింది నేహ తల్లి వనజ. నేహ స్నేహితురాలు వేద. ఇద్దరూ బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.‘‘ఏంలేదాంటీ.. ఇంటికి వచ్చి కలుస్తాను’’ అని, నేహ దగ్గరకు వచ్చింది వేద. ‘‘ఆ సౌరభ్ అంతు చూడనిదే నేనేపనీ చేయలేను వేదా, ఎవరి మొహం చూడలేను’’ అంది నేహ. ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వాణ్ణి చంపనైనా చంపుతాను కానీ, సంతోషంగా ఉండనివ్వను’’ కోపంతో ఊగిపోతూ అంటున్న నేహను చూస్తే భయమేసింది వేదకు. అనుకున్నంతా అయ్యింది. ముందునుంచీ చెబుతూనే ఉంది. కానీ, నేహ వినలేదు. ఇప్పుడు సమస్య తన చేయి దాటిపోయింది. మెల్లగా అక్కణ్ణుంచి వచ్చిన వేద.. నేహ తల్లితో సౌరభ్–నేహల ప్రేమ విషయమంతా చెప్పింది. ‘‘భయపడి ఇన్నాళ్లూ మీకీ విషయం చెప్పలేకపోయానాంటీ. కానీ, నేహ ఏం చేసుకుంటుందో అని భయమేస్తోంది’’ అని భయం భయంగా చెప్పింది వేద. వనజ షాక్ అయ్యింది.
వెలుతురువైపు పయనం
‘‘నేహా, ఇది మీ జీవిత సమస్య. ఏం జరిగిందో మీరు వివరించనక్కర్లేదు. అవగాహన కలిగేందుకు ఈ థెరపీ మీకు ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు సిద్ధమైతేనే..’’ కౌన్సెలర్ మాటలకు సిద్దమేనన్నట్టుగా తలూపింది నేహ. భార్య ద్వారా కూతురి పరిస్థితి తెలిసిన ప్రభాకర్ ఆమె జీవితాన్ని చక్కదిద్దడానికి ఈ థెరపీ సాయపడుతుందనే ఆశతో కౌన్సెలర్ దగ్గరకు తీసుకొచ్చాడు. థెరపీ మొదలైంది. ఆ థెరపీలో నేహతో పాటు తల్లీ తండ్రీ పాల్గొన్నారు. కౌన్సెలర్ సూచనలు నేహకు అందుతున్నాయి.
ఆ తర్వాత 5–10–15 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆ మౌనాన్ని ఛేదిస్తూ ‘‘నేహా, మీ అంతర్నేత్రంలో మీ కాలేజీని దర్శించండి. మీకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. నేహ చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నేను బి.టెక్‌లో చేరిన మొదటిరోజు. చాలా ఆనందంగా ఉంది. అక్కడే వేద పరిచయం అయ్యింది. ఫ్రెండ్స్‌తో రోజులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి. మేమొక పార్టీకి వెళ్లాం. అక్కడ ఒకతను చాలా డీసెంట్‌గా కనిపించాడు. అతని పేరు సౌరభ్ అని తెలిసింది. మా క్లాస్‌మేట్‌కి ఫ్రెండ్ అట. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డిగ్రీ చదువుతున్నాడని తెలిసి ఆశ్చర్యమేసింది. ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ. నాకతని బిõß వియర్ బాగా నచ్చింది. ఆ తర్వాత మేం మళ్లీ మళ్లీ కలుసుకున్నాం. సౌరభ్ నన్ను చాలా అపురూపంగా, చిన్నపిల్లలా చూసుకునేవాడు. నాకు సౌరభ్ అంటే చాలా ఇష్టం. నేనంటే సౌరభ్‌కు అంతే ఇష్టం’’ నేహ చెబుతూనే ఉంది. వనజ, ప్రభాకర్‌లు ఆశ్చర్యపోతూనే నేహ చెబుతున్నది వింటున్నారు.
వెలుగు చూసిన నిజాలు
‘‘రెండేళ్లు మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్నో చోట్లకు తిరిగాం. ఎంత సంతోషంగా ఉన్నామో.. కానీ ఇప్పుడు ... ’’ అని చెబుతూనే నేహ ఏడ్వడం మొదలుపెట్టింది. వనజ, ప్రభాకర్ తల్లడిల్లిపోయారు. సైగలతోనే వారిని వారించిన కౌన్సెలర్ నేహ కన్నీళ్లు ఆగేంతవరకు ఎదురుచూశారు. ‘‘ఇప్పుడు ఏం జరిగింది నేహ... ఎందుకు మీరింత బాధ పడుతున్నారు’’ అడిగారు కౌన్సెలర్.
‘‘నేనంటే సౌరభ్‌కి నచ్చడం లేదు. నా మంచి చెడు పట్టించుకోవడం లేదు. పైగా నన్ను మునుపటిలా లేవు అంటున్నాడు..’’ అని చెప్పి మౌనంగా ఉండిపోయిన నేహ కాసేపటికి.. ‘‘మా జూనియర్ అనూ వల్లే సమస్య అనుకున్నాను. కానీ, ఆమె వల్ల కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అసలు ప్రేమే కాదు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని ఇష్టపడ్డాను. అమ్మనాన్నలు వాళ్ల పనుల్లో వాళ్లు బిజీ నన్ను పట్టించుకోరు. సౌరభ్ అలా కాదు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి సౌరభ్‌తో ఉన్నాను. ఇప్పుడు అతను దూరమైతే నన్ను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే సౌరభ్ వెళ్లిపోతుంటే నాకు బాధగా ఉంది. అతను దూరమవడం నాకిష్టం లేదు..’’ చెబుతూ ఆగిపోయింది నేహ.
కౌన్సెలర్ సూచనలతో థెరపీ పూర్తయింది. నేహకు తనేంటో అర్థమైంది. సౌరభ్‌పై ఉన్న కోపం, పగ, ప్రతీకారాలు అవి తన ఒంటరితనం మీద అని గుర్తించింది. ఆకర్షణకు ప్రేమకు గల వ్యత్యాసం తెలుసుకొని, అవగాహన చేసుకొని తన భవిష్యత్తును ఆనందంగా మలుచుకోవడంపై శ్రద్ధ పెట్టింది. తల్లీతండ్రి తమ తీరిక లేని పనులను సడలించుకొని, కూతురి భవిష్యత్తు కోసం తమ సమయాన్ని కేటాయించారు.
కృష్ణుడి ప్రేమ తత్వం గురించి మహాభారతం విశదపరు స్తుంది. ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఆకర్షణలు– ప్రేమ తత్వం గురించి తెలియజేశారు. పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ ఫ్యూచర్, లైఫ్ ప్రోగ్రెషన్ మీద విస్తృతమైన పరిశోధనలు జరిపిన డాక్టర్ బ్రియాన్ వెయిజ్ అమెరికన్ సైకియాట్రిస్ట్, హిప్నోథెరపిస్ట్. ఇతను ‘ఓన్లీ లవ్ ఈజ్ రియల్’ అనే పుస్తకంలో ప్రేమ–ఆకర్షణల గురించి తెలియజేశారు. ‘లైఫ్ బిట్వీన్ లైఫ్’ అని ఆకర్షణల గురించి తన పరిశోధనా గ్రంధం ద్వారా వివరించారు బ్రాండ్ విడ్త్. ఆకర్ణణ సిద్ధాంతం గురించి తెలియజేసిన వారిలో డా.జాన్ అబ్రహం ప్రముఖులు.
7 చక్రాలు... ఆకర్షణలు...
మానవ శరీరంలో కుండలిని చక్రం ఉంటుంది. మూలాధార చక్రంతో మన ఆలోచనలు ముడిపడి ఉంటే శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడంపై దృష్టి నిలుపుతారు. దీంతో అలాంటివారినే ఆకర్షిస్తుంటారు. మూలాధార చక్రంపైన ఉండే స్వాధిష్టాన, మణిపుర చక్రాలతో కనెక్ట్ అయితే భావోద్వేగాల నడుము కొట్టుమిట్టాడుతారు. రకరకాల ఉద్వేగాలకు ఆకర్షితులు అవుతారు అనహత, విశుద్ధ చక్రాలతో ముడిపెట్టుకుంటే జ్ఞానులు ఆకర్షిస్తుంటారు. ఆధ్యాత్మిక విషయాలకు అట్రాక్ట్ అవుతారు. సహస్రార చక్రంతో కనెక్ట్ అయితే ఏది అవసరం? ఏది అనవసరం? అనే విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. గొప్ప గురువులు, జ్ఞానులు ఆకర్షిస్తారు. అవసరం లేనిది త్వరితంగా విడిచిపెట్టగల శక్తి వస్తుంది. ఇదంతా ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. సాధన ద్వారా ధ్యానం తద్వారా జ్ఞానం అలవడతాయి.
తమను తాము కోల్పోయి
బాల్యంలో పరిస్థితుల వల్ల కొన్ని సుగుణాలను పోగొట్టుకుంటాం. నేహ, సౌరభ్‌లకు థెరపీ చేశాక ఇది స్పష్టమైంది. నేహ తల్లీతండ్రి ఉద్యోగస్తులు. ఆమె బాల్యమంతా అభద్రతల మధ్య భయం భయంగా గడిచింది. సౌరభ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి నాలుగిళ్లలో పనిచేస్తేనే తమ పొట్ట గడిచేది. గడ్డు పరిస్థితులను దాటడానికి తల్లి బాధ్యతలనూ తను తీసుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ కుటుంబ పోషణకు సాయపడేవాడు. ఈ క్రమంలో బాల్యపు అమాయకత్వం కోల్పోయాడు. బాల్యంలో తనలో మాయమైపోయిన అమాయకత్వం నేహలో చూసి ముచ్చటపడ్డాడు సౌరభ్. తనలో లేని సుగుణాలను సౌరభ్‌లో చూసి ఆకర్షితురాలైంది నేహ. ఈ కారణంగా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల తర్వాత లోపాలు బయటపడటం మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరూ దూరమయ్యారు. ఇది తెలియక ఇద్దరూ ఒకరినొకరిని తిట్టుకున్నారు. మనలో లేనిది తెలియజెప్పడానికి వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఎందుకు వాళ్లు మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారో గ్రహించి, సరి చేసుకుంటే మనలోని అవకతవకలు సరిదిద్దుకోవడం సులభం అవుతుంది.
– డా.లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్
భవిష్యత్తు దర్శనం
ఒంటరితనం, అభద్రతా భావాలకు సంబంధించిన బీజాలు శిశువు గర్భంలో ఉన్నప్పుడే పడిపోతాయి. ఆ శిశువుతో పాటు భయాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు ప్రేమను చూపకపోతే బయట వెతుక్కునే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎవరైనా ప్రశంసించడం, ముద్దు చేయడం చేస్తే సులువుగా అటువైపు అట్రాక్ట్ అవుతారు. అది తమ ఈడు వారైతే ఆకర్షణ స్థాయి ఇంకా పెరుగుతుంది. ఇంకొందరు గతజన్మలో పరిపూర్ణంగా అనుభవించని ప్రేమలను ఈ జన్మకు మోసుకొస్తారు. ప్రతి ఒక్కరూ తమలోని అర్థనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. మన లోపాలను సవరించడానికి వచ్చేవారివైపే ఆకర్షితులమౌతామని గుర్తించాలి. ఏడేళ్లకొకసారి మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆకర్షణలు ఎంతకాలం ఉంటాయి? నిజమైన ప్రేమ – స్నేహం అంటే ఏంటి అనేది గుర్తించాలి. భవిష్యత్తును దర్శిస్తే శాశ్వతమైన బంధం ఏది అనే అవగాహన కలుగుతుంది. దుస్తులు మార్చినట్టుగా ఆత్మ.. దేహాలను జన్మ జన్మలుగా మార్చుకుంటూ వెళుతుంది. శాశ్వత ప్రేమ బంధం దైవంతోనే అని గుర్తిస్తే తమ జీవితం పట్ల సందేహాలు తలెత్తువు. – డాక్టర్ హరికుమార్, ఫ్యూచర్ థెరపిస్ట్, హైదరాబాద్
– నిర్మల చిల్కమర్రి