పాపకు  నత్తి వస్తోంది... తగ్గేదెలా?  | It is not good for a Cow milk for children | Sakshi
Sakshi News home page

పాపకు  నత్తి వస్తోంది... తగ్గేదెలా? 

Published Mon, Apr 8 2019 1:35 AM | Last Updated on Mon, Apr 8 2019 1:35 AM

It is not good for a Cow milk for children - Sakshi

మా పాపకు పదేళ్లు. చదువులో ముందుంటుంది. కానీ మాట్లాడుతుంటే కొద్దిగా నత్తిగా వస్తుంటుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి. 
 
ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్‌ లేదా స్టట్టరింగ్‌ అంటారు. ఈ కండిషన్‌ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్‌ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం.

పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్‌ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్‌ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్‌ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత.

వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్‌ ఫ్లుయెన్సీ, స్టామరింగ్‌ మాడిఫికేషన్‌ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు  నయమవుతుంది. మీరు మొదట స్పీచ్‌ థెరపిస్ట్‌ కలిసి తగు చికిత్స తీసుకోండి. 

బాబుకు గేదెపాలు పట్టించవచ్చా? 

మా బాబు వయసు నెల రోజులు. తల్లికి పాలు పడకపోవడంతో ఆమె దగ్గర తగినన్ని పాలు లేవు. దాంతో  గేదెపాలు పట్టిస్తున్నాం. ఇంత చిన్న బాబుకు గేదెపాలు తాగించవచ్చా? దీనివల్ల బాబుకి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా?

నెలల బిడ్డకు గేదె పాలు పట్టించడం అంత మంచిదికాదు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్‌ మిల్క్‌)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్‌ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలు రావచ్చని, ఆ సమస్యలకు ఇలా గేదె పాలు పట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తిని  పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్‌ ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితంగా పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు, సురక్షితం కాని పాలు (అన్‌పాష్చరైజ్‌డ్‌ మిల్క్‌) పిల్లలకు ఇవ్వడం సరికాదు.

ఇక తల్లి పాలు ఇవ్వలేని తప్పనిసరి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్‌ ఇన్‌టాలరెన్స్, ప్రోటీన్‌ ఇన్‌టాలరెన్స్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు) మార్కెట్‌లో దొరికే కొన్ని స్పెషల్‌ ఫార్ములా ఫీడ్స్‌ ఉపయోగించవచ్చు. కానీ వీటన్నింటికంటే తల్లిలోనే పాలు పెరిగేలా స్వాభావిక విధానాలు (ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. ఇక తప్పనప్పుడు డాక్టర్‌ సలహా మేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం. మీరు మరొకసారి మీ గైనకాలజిస్ట్‌ను కలిసి రొమ్ముకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. వాటికి చికిత్స తీసుకుని తల్లిపాలే పట్టడానికి ప్రయత్నించండి. అదేమీ సాధ్యం కానప్పుడు మాత్రమే  ఫార్ములా ఫీడ్స్‌ వెళ్లాల్సి ఉంటుంది.

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ,హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement