జైనథ్‌ లక్ష్మీసూర్యనారాయణా... | jainath laxmi narayana swamy temple special story | Sakshi
Sakshi News home page

జైనథ్‌ లక్ష్మీసూర్యనారాయణా...

Published Tue, Jul 18 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

జైనథ్‌  లక్ష్మీసూర్యనారాయణా...

జైనథ్‌ లక్ష్మీసూర్యనారాయణా...

దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనథ్‌ మండల కేంద్రంలో ఉంది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. ఆలయ మూలవిరాట్టు శ్రీలక్ష్మీనారాయణ స్వామి. చాలా మహిమాన్విత ఆలయం. ఈ ఆలయం జైనసంప్రదాయంతో నిర్మితమైందని ఆలయ శిల్పకళను బట్టి తెలుస్తోంది. అందుకే ఆ గ్రామానికి జైనథ్‌ అని పేరువచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ప్రకృతిసిద్ధంగా లభించే నల్లరాతితో ఈ ఆలయం నిర్మితమైంది. దేశంలోనే గొప్ప పర్యాటకకేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న  ఈ ఆలయ విశేషాలు...

ప్రాచీన శిల్పకళకు సజీవ దర్పణంలా నిలుస్తోంది జైనథ్‌ లక్ష్మీనారాయణ ఆలయం. 11, 13 శతాబ్దకాలంలో మహారాష్ట్రలోని వెమత్మాలపంత్‌ రాతితో ఈ ఆలయం నిర్మించబడింది. జైనథ్‌ పరిసరాల చుట్టూ ఈ ఆలయానికి వాడిన శిలలు ఎక్కడా లభించవు. ఈ శిలను మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంలో, అష్టకోణాకార మండపం పైనున్న గర్భగుడిలో సూర్యనారాయణస్వామి వారు తన అపార కరుణకిరణాలను భక్తులపై ప్రసరింప చేస్తుంటారు. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణదిశలో లక్ష్మీదేవి, ఆళ్వారులు, అన్యదేవతామూర్తులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తికశుద్ధ ఏకాదశి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

ద్వాదశి రోజు స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. దీన్ని వీక్షించుటకు జిల్లావాసులేకాక మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. మండపం అంతర్భాగంలో స్తంభాలపై హనుమంతుడు, రంభాది అప్సరసల శిల్పాలు, ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం ఉంది. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి. ఆలయం ముందున్న కోనేరు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో డోలాహరణ మండపం నిర్మించారు. కాలక్రమేణా అది శిథిలమైంది.

రవికిరణాలు తాకే పాదాలు...
ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో, దసరా అనంతరం ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత సూర్యకిరణాలు లక్ష్మీనారాయణ స్వామి పాదాలను తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కోరికలు తీర్చే నారాయణుడు...
సంతానం లేనివారు స్వామిని మనసులో ధ్యానిస్తూ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధద్వాదశి రోజున కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదం (గరుడముద్ద) స్వీకరిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన కార్తీక బహుళ పంచమి నాడు రాత్రి నిర్వహించే నాగవెల్లి పూజసమయంలో భక్తితో స్వామివారిని తలచుకుని, పూలదండలను ధరిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని విశ్వాసం. కార్తీకమాసంలో పౌర్ణమినాటి నుంచి వరుసగా ఐదు పున్నములకు శ్రీవారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామిæ వ్రతాలు చేస్తే సుఖసంతోషాలతో వర్థిల్లుతారని భక్తుల నమ్మకం. సంతాన సాఫల్యత, కోరిన కోర్కెలు తీర్చే దేవుడని నమ్మకం.

జైనమత కేంద్రం...
శాతవాహనుల కాలం నాటి జైనథ్‌ జైనమత కేంద్రంగా వర్ధి్దల్లింది. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంతరాల మండపాన పగిలిపోయిన శిలాఫలకంపై దేవనాగరి లిపిలో చెక్కబడిన శాసనం సూర్యాయనమఃతో ప్రారంభమవుతుంది. ఈ శాసనం సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ శ్లోకంతో కూడి ఉంది. – రొడ్డ దేవిదాస్‌ సాక్షి, ఆదిలాబాద్‌

ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో ఉన్న ఈ ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 21 కిలో మీటర్ల దూరంలో, హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌ మీదుగా 315 కి.మీల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డుమార్గమే తప్ప రైలు మార్గం లేదు. ఆదిలాబాద్‌ నుంచి జైనథ్‌కు నేరుగా బస్సులున్నాయి.  బేల, చంద్రపూర్‌ వెళ్లే బస్సులు జైనథ్‌ మీదుగా వెళ్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement