‘సోషల్ మీడియా అనేది ప్రపంచంలోని మనుషుల మధ్య స్నేహసంబంధాలు పెంపొందించే బహుళ అంతస్తుల భవంతి కాదు.. ఇదొక భారీ వాణిజ్య సముదాయం. పెద్ద మాల్ లాంటిది. ఇక్కడ వాళ్ల ఉత్పత్తులు అమ్ముకోడానికి ఎంతకైనా తెగిస్తారు. మీ ఆత్మగౌరవం దెబ్బతినే ప్రకటనల వ్యూహాలను రచిస్తారు. మీలో ఆత్మ న్యూనతను కలిగించి.. వ్యాపార ప్రకటనల్లో వాళ్లు చెప్పిందే నిజమని నమ్మేలా చేసి.. ఆ ఉత్పత్తులను కొనేలా మిమ్మల్ని ఉసిగొల్పుతారు’’ అంటుంది జమీలా జమీల్.
33 ఏళ్ల ఈ యువతి ఓ యేడాది కిందట ఇన్‌స్టాగ్రామ్ లో ‘ఐ వే (I weigh తెలుగులో నా బరువు నా ఇష్టం అని చెప్పుకోవచ్చు)’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది.. స్థూలకాయానికి సంబంధించి బాడీ షేమింగ్‌ని వ్యతిరేకిస్తూ. శరీరాకృతితో కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో, లక్ష్యాల సాధనతో తమను తాము అభివర్ణించుకునేలా ఆడవాళ్లను ప్రోత్సహించడానికే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది జమీలా. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఈ యేడాది సోషల్ మీడియాలో బరువు తగ్గించే ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలని ఒక పిటిషన్‌ను వేసింది. ఆ న్యాయ పోరాటంలో విజయం సాధించింది కూడా. ఇక నుంచి టీన్స్‌కి సోషల్ మీడియాలో ఈ తరహా యాడ్స్ కనిపించవని సోషల్ మీడియా ప్రకటించింది.
ఈ ఉద్యమానికి నేపథ్యం
ముందు జమీలా జమీల్ గురించి చిన్న పరిచయం ఇవ్వాలి. బ్రిటన్‌లోని చానల్ 4 హోస్ట్, బాడీ పాజిటివ్ యాక్టివిస్ట్, వర్థమాన నటి. లండన్‌లో పుట్టి పెరిగింది. తండ్రి భారతీయుడు. తల్లి పాకిస్తానీ. పాక్షికంగా వినికిడి లోపంతో పుట్టిన జమీలాకు దాన్ని సరిచేయడానికి బాల్యంలోనే చాలా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. టీన్స్‌లో అనరెక్సియా (బరువు తగ్గించుకోవడానికి ఆకలిని చంపేసుకోవడం. ఇదొక మానసిక రుగ్మత) బారిన పడింది. ఆ సమయంలోనే కారు ప్రమాదానికి గురై వెన్నెముకకు గాయం అయింది. యేడాది పాటు ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక ఓ వైపు చదువు సాగిస్తూనే ఇంకోవైపు అంతర్జాతీయ విద్యార్థులకు ఇంగ్లీష్ ట్యూటర్‌గా మారింది.22వ యేట చానల్ 4లో షో హోస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. తక్కువ సమయంలోనే పాపులర్ అయింది.
‘రేడియో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. ఈ క్రమంలో.. 2014లో బ్రిటిష్ టాబ్లాయిడ్స్ ఆమె బరువు పెరగడం మీద కథనాలతో జమీలా మీద దాడి చేశాయి. ‘‘ఎవరైనా ఇష్టంగా స్థూలకాయులు కావాలని కోరుకోరు. అనారోగ్యం, ఆ అనారోగ్యానికి తీసుకుంటున్న చికిత్స దుష్ప్రభావాల వల్ల కూడా బరువు పెరుగుతారు. నా విషయంలో అదే జరిగింది. ఆస్తమా కోసం ట్రీట్‌మెంట్‌లో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే బరువు పెరిగాను. అయినా చానెల్ 4 హోస్ట్‌గా నేను ఫలానా అంత బరువునే మెయిన్‌టెయిన్ చేస్తాను.. జీరో సైజ్ అవుతాను అని ఎవరికీ మాటివ్వలేదు.. అగ్రిమెంట్ చేసుకోలేదు’’ అని చెప్పింది జమీలా. ఆ తర్వాత రెండేళ్లకు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చుకుంది. అక్కడ స్క్రీన్ రైటర్‌గా అవకాశాలు వెదుక్కుంది.
‘ది గుడ్ ప్లేస్’ అనే ప్లేలో నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. కాని తన బరువు మీద బ్రిటిష్ టాబ్లాయిడ్స్ చేసిన దాడిని మరిచిపోలేదు. ఈలోపు.. 2018 ఆగస్ట్‌లో ఓ మ్యాగజైన్.. అందులో ప్రచురించిన ఆమె ఫోటోలోని చర్మం రంగును ఎయిర్ బ్రష్‌తో తెల్లగా మార్చింది. దాంతో ఆ మ్యాగజైన్ మీద విరుచుకుపడింది., ఫోటోలో తన చర్మం రంగు మార్చి తనను మానసికంగా కుంగదీశారంటూ. తననే కాదు ఆ రంగుతో ఉన్న ఎంతో మంది అమ్మాయిలనూ మానసికంగా కుంగదీసి వాళ్లలో ఆత్మన్యూనతను కలిగించారంటూ కామెంట్ చేసింది. అప్పుడే రంగు, బరువు వీటన్నిటితో జరుగుతున్న బాడీ షేమింగ్‌ను ఖండిస్తూ ‘ఐ వే’ అనే ఉద్యమాన్ని లేవదీసి, ఇన్‌స్టాగ్రామ్‌లోని బ్యూటీప్రొడక్ట్స్‌ను బ్యాన్‌చేయాలనే పిటిషన్‌నూ వేసింది జమీలా. ‘‘నేను ఫేస్ చేసినవి ఇంకే ఆడపిల్లా ఫేస్ చేయకూడదు. అందుకే ఈ పోరాటం. నేనొక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉండాలనుకుంటున్నా’’ అంటుంది జమీలా జమీల్.
►అమ్మాయంటే తెల్లగా ఉండాలి. అమ్మాయంటే సన్నగా ఉండాలి. అమ్మాయంటే.. అంటూ ఇంకా చాలా చెబుతుంటాయి టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనలు! కానీ అమ్మాయంటే ఎలా ఉండాలో తెలుసా? జమీలా జమీల్‌లా ఉండాలి!
Comments
Please login to add a commentAdd a comment