ఆ రూపం... అపురూపం
పుణ్య తీర్థం
కోరిన కోరికలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా... ఆపద మొక్కులు తీర్చే ఆపద్బాంధవుడిగా, వీసాలు కోరిన వారికి వీసాలు వచ్చేలా చేసే వీసాల వేంకటేశ్వరుడిగా, పెళ్లి కావడానికి కలుగుతున్న అడ్డంకులను తొలగించి, వెంటనే వివాహ సంబంధాలను కుదిర్చే కల్యాణ వేంకటేశ్వర స్వామిగా, పిల్లల కోసం పరితపిస్తున్న వారికి వెంటనే సంతానాన్ని ప్రసాదించే సంతాన వేంకటేశ్వరుడిగా... జిల్లెలగూడలోని మత్సా్యవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి భక్తకోటి నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ స్వామి వారికి నేటి నుంచి తొమ్మిదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు, తిరుకల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ పుణ్యతీర్థంలోని కొన్ని బిందువులు...
అలనాటి శిల్ప కళాసౌందర్యం ఉట్టిపడే విధంగా... అడుగడుగునా భక్తి పారవశ్యం తొణికిసలాడే మత్సా్యవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం. ఉత్తర ముఖద్వారంతో ఉండే ఈ ఆలయంలో అడుగు పెట్టడంతోటే సర్వపాపాలూ పటాపంచలవుతాయనీ, స్వామిని స్మరించుకుని ఆలయం వెలుపల ఉన్న చింతచెట్టుకు ముడుపులు కడితే కోరికలు తీరతాయనే విశ్వాసానికి వేలాదిమంది భక్తుల నిజజీవిత అనుభవాలే ఆధారం.
స్థల పురాణం...
15–16 శతాబ్దాల మధ్య గోల్కొండను కుతబ్‌షాహీ సుల్తానులు పాలిస్తున్న కాలంలో ఈ ఆలయం నిర్మితమైనదని భావిస్తున్నారు. ఆరోజుల్లో ఒక రైతు తన బిడ్డడైన ప్రసాద్‌ను చక్కగా చదివించి సుల్తానుల కొలువులో ఉద్యోగిగా చేర్చారు. అతన్ని అందరూ కిసాన్ ప్రసాద్ అని పిలిచేవారట. అతను దైవ భక్తి పరాయణుడు. అతనికి పిల్లలు లేరు. ఒకరోజు విధినిర్వహణలో భాగంగా కొంతమంది సహోద్యోగులతో రాజ్యపర్యటనకు బయలులేరి తిరిగి తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికి గుడి ఉన్న ప్రాంతంలో అందరితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కలలో వేంకటేశ్వరస్వామివారు దర్శనమిచ్చి ‘ఈ పక్కన బావిలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించి నన్ను ప్రతిష్టించి నిత్యపూజలకు ఏర్పాట్లు చేయి. నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది’ అని పలికారు. మరునాడు ఉదయమే... కిసాన్ ప్రసాద్ గోల్కొండకు చేరుకుని సుల్తాన్‌కు స్వççప్న వృత్తాంతం తెలిపాడు. ఆయన అనుమతితో తన సహచరులతో క్రితంరోజు తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతంలో ఉన్న చెరువుకు చేరువలో ఉన్న బావిలో వెతికించగా భూదేవి, శ్రీదేవి విగ్రహాలు లభించాయి. భక్తి శ్రద్ధలతో వాటిని వెలికి తీసి ఆలయ నిర్మాణం జరిపి స్వామివారిని ప్రతిష్టించి నిత్యపూజలు జరిపే ఏర్పాట్లు గావించారు. త్వరిత కాలంలోనే ప్రసాద్‌కు ఓ శుభ ముహూర్తాన ఒక çసచ్చీలుడైన కుమారుడు కలగడంతో తన జీవితమంతా స్వామి పాదసేవకు అంకితం చేశారట.
ఇదీ ప్రత్యేకత...
భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాచారాలకు ఆలవాలంగా ఉన్న ఎన్నో సుప్రసిద్ధమైన ఆలయాల కోవలోకే వస్తుంది జిల్లెలగూడలోని మత్సా్యవతార కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోకి అడుగుబెట్టిన తడవే... అపురూపమైన నిర్మాణాలు భక్తులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్‌లోని కోఠి నుంచి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తే... మీర్‌పేట్‌కు చేరుకునే మార్గంలోని జిల్లెలగూడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది.
స్వయంభూగా వెలసిన స్వామివారు...
ఇక్కడి ఆలయంలో వెలసిన స్వామివారిపై రెండు కథనాలు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చే స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారని... కూడా చెబుతారు. ఇక్కడి ఆలయంలో కొలువైన స్వామివారిని నిష్టాగరిష్టలతో దర్శనం చేసుకుంటే... భక్తుల మేధకు అంతుపట్టని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మిక.
అపు‘రూపం’...
ఇక్కడ కొలువుదీరిన స్వామివారి విగ్రహం నాలుగు పలకల స్థూలరూపంలో ఉండి ముందువైపు పై భాగంలో చేప తలభాగం, కింది భాగంలో తోక, మధ్యలో వేంకటేశ్వరస్వామివారి ఆకృతి భక్తులకు దర్శనమిస్తాయి. ఒకపక్క నక్షత్ర పుంజం, సూర్యచంద్రులు, మరోవైపు నాగబంధం దర్శనమిస్తాయి. ఇలా వేంకటేశ్వరస్వామి మత్సా్యవతార మూర్తిగా దర్శనమివ్వడం వెనక తాను ఆదిపురుషుడినని చాటి చెప్పడమే కాకుండా.. భక్తుల కోరికలు తీర్చడంలో కూడా మొదటి స్థానం తనదేనని చెప్పకనే స్వామి చెబుతారని భక్తుల విశ్వాసం. ఈస్థూపంలో స్వామివారి చుట్టూ మత్య్సాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నాగబంధం ఉన్నందున తను సర్వసృష్టికి మూలకర్తనని, నాగదోష నివారణ మూర్తిగా ఉన్నానని స్వామివారి సూచనగా భక్తుల విశ్వాసం. ఇక ప్రచారంలో ఉన్న మరో కథనం మేరకు... స్వామివారి పై భాగంలో లింగాకారం కనిపిస్తుంది కిందిభాగంలో వేంకటేశ్వరస్వామి వారి ఆకృతి కనిపిస్తుంది. ఇలా కనిపించడంలో శైవం, వైష్ణవం వేరుకాదని, అంతా ఒక్కటేనని లోకానికి చాటి చెప్పడమే.
ఆలయ నిర్మాణం...
ఈ ఆలయం సుమారు 15–16 శతాబ్దాల మధ్య నిర్మితం అయినట్టుగా భావింపబడుతోంది. ఈ ఆలయ ముఖద్వారానికి ఉత్తర దిశలో నిరంతరం రామనామమే జపిస్తూ తన్మయత్వంలో కాల గమనానికి అతీతంగా స్వామివారిని చూస్తున్న రామబంటు, భక్తాంజనేయ స్వామివారి ఆలయం, ఆ పక్కనే త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరమైన కదంబ వృక్షపు ఛాయలో బంగారు కోనేరు ఉన్నాయి. ఆంజనేయస్వామివారి ఆలయానికి ఉత్తరంగా ఒక భవనం ఉంది. దాన్ని ‘నవరస్‌కానా’ అంటారు ఆలయగోపురానికి తూర్పు దిశలో సస్యశ్యామలమైన ప్రకృతికి నిదర్శనంగా, చూపరులకు ప్రశాంతతనిస్తూ ఒక చక్కటి ఉద్యాన వనం ఉంది. దాన్ని మంగమ్మతోట అంటారు. ఇక వీటి వైశిష్ట్యాలకు వస్తే కదంబ వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ వృక్షం కాశీ క్షేత్రం తరువాత ఇక్కడే ఉంది అంటారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన, ప్రతి శుక్రవారమూ ఇక్కడ ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలూ జరుగుతాయి. ఈ క్షేత్ర సందర్శనం సకల శుభప్రదం.
ముడుపు కట్టి మరచిపోవచ్చు!
సమస్యలు ఉన్న భక్తులు ఈ ఆలయంలో స్వామివారి ప్రధాన మందిరానికిఆనుకుని ఉన్న చింతచెట్టుకు ముడుపులు కడితే.. ఎంతటి చిక్కు సమస్య అయినా సరే, చిటికెలో తీరిపోతుందని ప్రతీతి. గ్రహపీడలు, దీర్ఘరోగాలు ఉన్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు ఇలా ముడుపు కడుతుంటారు.
– మిరియాల రవికుమార్, సాక్షి, మీర్‌పేట