ఆకలి తీర్చేనా చీకటి రాజ్యం | Kamal Haasan's upcoming Telugu film Cheekati Rajyam | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చేనా చీకటి రాజ్యం

Published Sat, Sep 19 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

ఆకలి తీర్చేనా చీకటి రాజ్యం

ఆకలి తీర్చేనా చీకటి రాజ్యం

దశావతారాల్లో అన్ని పాత్రలూ, అన్ని కోణాలూ చూసేశానేమో అనేలా చెలరేగిపోయాడు. సినిమాల్లోనే కాదు, బయట కూడా బరువైన పాత్రలే వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్... ‘స్వయంపాకం’ పాత్ర! అదేనండీ, ‘సెల్ఫ్ డెరైక్షన్’ పాత్ర అంటే బహు పసందు. ఇది ఆయన జీవితంలో చాలా న్యాచురల్ పాత్ర. తరువాత ‘స్వయంకృతం’ పాత్ర! అర్థం కాలేదా!? సొంత ప్రొడక్షన్ పాత్ర! ఆయన వేసే అన్ని పాత్రల్లో డేంజరస్ పాత్ర ఇదే! చేతులు కాలుతాయి స్వామీ అని ఎంతమంది మొత్తుకున్నా, ‘ఊఁహుఁ’ చేతులు కాలినా పాత్రకు న్యాయం చేయాల్సిందే!

బహుశా, చేతులు కాలితే హస్తరేఖలు మారతాయని భరోసా కాబోలు! ‘ఆకలి రాజ్యం’లో జీవించేశాడు కదా, అందుకేనేమో అన్ని పాత్రల రుచులూ చూడాలనుకుంటాడు. ఇప్పుడు ‘చీకటి రాజ్యం’లో బ్యాడ్ పోలీస్ పాత్రలో కొడుకు కోసం కొకెయిన్ గూండాతో పోరాడే కథ! సినిమా థియేటరే ఒక చీకటి రాజ్యం... అందులో కూర్చుని, వీక్షిస్తున్న ప్రేక్షకుడి ఆకలి తీర్చాలన్నదే కమల్ ఆయాసం కాబోలు... కాదు ఆశయమే! మరి, కమల్ ఆకలి తీర్చేనా, ఈ చీకటి రాజ్యం!

రామ్
ఎడిటర్, ఫీచర్స్

 
బుధవారం సాయంత్రం... వినాయక చవితి పండగకు ఇంకా కొన్ని గంటలే ఉంది... దక్షిణాది సినిమా రాజధాని చెన్నై నగర వీధులన్నీ వినాయక విగ్రహాలు, పండగ కొనుగోళ్ళతో రద్దీగా ఉన్నాయి. అదే సమయంలో ఇద్దరు తమిళ సూపర్‌స్టార్ల సినిమాలకు సంబంధించి కూడా కోలాహలం చెలరేగింది. పండుగ నాడు షూటింగ్ ప్రారంభమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కపాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రెండు రిలీజయ్యాయి. అదే టైమ్‌కి షూటింగ్ పూర్తి చేసుకున్న మరో తమిళ స్టార్ హీరో కమలహాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘తూంగావనమ్’ (తెలుగులో ‘చీకటి రాజ్యం’) ఒకటిన్నర నిమిషాల ట్రైలర్ రిలీజైంది.

ట్విట్టర్ మొదలు సామాజిక మాధ్యమాల నిండా ఈ ఇద్దరు హీరోల కొత్త సినిమాల లుక్ గురించే చర్చ. పాతికేళ్ళుగా తరచూ ఏదో ఒక శుక్రవారం కొత్త రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ ఇద్దరు స్టార్స్ సినిమాల పుణ్యమా అని సినీ ప్రియులకు ఈసారి కొద్ది గంటల ముందే చవితి పండగ వచ్చేసింది. బడ్జెట్లు, పణంగా ఒడ్డుతున్న మొత్తాలు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘చంద్రముఖి’, ‘ముంబయ్ ఎక్స్‌ప్రెస్’ల తరువాత ఈ హీరోలిద్దరూ ఒకేసారి తమ సినిమాలు రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ, ఇప్పుడు తమిళనాటే కాదు... తెలుగునాట కూడా ఈ ఇద్దరు హీరోల తాజా సినిమాలపై చర్చ జరుగుతోంది.

యువ దర్శకుడు రంజిత్ నిర్దేశకత్వంలో ‘కలైపులి’ థాను నిర్మిస్తున్న రజనీకాంత్ కొత్త సినిమా ‘కపాలి’ షూటింగ్ ‘వినాయక చవితి’ నాడు ఉదయం చెన్నైలో నిరాడంబరంగా మొదలైంది. మరోపక్క కమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడింది. సరైన టైమ్ చూసుకొని, ఈ దసరా, దీపావళి సీజన్‌లోనే జనం ముందుకు రావాలని తయారవుతోంది. రజనీ కొత్త సినిమా ఒకప్పటి ‘బాషా’ టైప్‌లో వయసు పైబడ్డ మాఫియా డాన్ కథ. మరి, కమల్ ‘చీకటి రాజ్యం’ కథేమిటి?
 
ఫ్రెంచ్ సినిమాకు... ఇండియన్ వెర్షన్
కమలహాసన్ ఇటీవల ఎక్కువగా తమిళంలో నటించి, ఆ సినిమాల అనువాదాల్ని తెలుగులో అందిస్తున్నారు. చాలాకాలం తరువాత ఆయన తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఓ పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు... విళయాడు...’ (తెలుగులో ‘రాఘవన్’)లో పోలీసాఫీసర్‌గా కనిపించిన కమల్ ఈ సినిమాలో కూడా పోలీసు పాత్ర పోషిస్తున్నారు.

అయితే, ఇందులో కొంత నెగిటివ్ టచ్ ఉన్న పోలీసాఫీసర్ అట. ఫ్రెంచ్ హిట్ మూవీ ‘స్లీప్‌లెస్ నైట్స్’ సినిమాకు ఇది అనుసరణ అని కోడంబాకమ్ కబురు. అయితే, చట్టప్రకారం ఆ సినిమా హక్కులు తీసుకొని, మన దక్షిణ భారత సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తిరగరాసుకున్నారు. సొంత సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసుకొనే కమల్ ‘చీకటి రాజ్యం’లోనూ తన రచనానుభవం వినియోగించారు.  
 
ఏమిటీ ‘చీకటి రాజ్యం’?
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ చిత్రకథ ఏమిటంటే... కమల్‌హాసన్ పోలీస్‌శాఖలో ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వింగ్’ ఆఫీసర్. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసే చీకటి ప్రపంచంలోని నేరస్థులను పట్టుకునే పనిలో ఉంటాడట! ఆ క్రమంలో కిడ్నాప్ అయిన తన కుమారుణ్ణి కాపాడుకునేందు ఆ ఆఫీసర్ పడిన శ్రమ ఏమిటన్నది తెరపై చూపారట. నిజానికి, సినిమా అంతా ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథ. ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని ఊహాతీతమైన ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఉండవు. ప్రతిదీ రియలిస్టిక్‌గా ఉంటుంది’ అని చిత్ర యూనిట్ కథనం.  
 
గురువును డెరైక్ట్ చేస్తున్న శిష్యుడు
అంతకన్నా విశేషం ఏమిటంటే, కమలహాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రూపకల్పన బాధ్యతను ఒక కొత్త వాడికి ఇవ్వడం! ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వా గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన విజువల్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్. జీవనోపాధి కోసం కొన్నాళ్ళు డిజైనర్‌గా పనిచేసి, కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’కు ఐ.డి. కార్డులు, బోర్డులు, వగైరా వర్క్ చేశారు. కమల్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఖాళీలున్నాయని తెలియగానే, తన అభిమాన హీరో దగ్గరకు పరిగెత్తారు. అలా 2008 నుంచి ఏడేళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజేశ్‌కు ‘చీకటి రాజ్యం’తో కమలే డెరైక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఇందులో త్రిష, ప్రకాశ్‌రాజ్, ‘దళం’ ఫేమ్ కిశోర్ - ఇలా చాలామంది ప్రముఖులే నటిస్తున్నారు.
 
గౌతమి చేతిలో... కమల్ రూపం
ఎప్పటికప్పుడు తన లుక్, స్టైల్ మార్చేసి, ఏ సినిమాకు ఆ సినిమాలో విభిన్నంగా కనిపించడం నటుడిగా కమలహాసన్ తీసుకొనే జాగ్రత్త. ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’, తాజా తమిళ చిత్రం ‘పాపనాశమ్’లలో ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపించిన కమల్ ‘చీకటి రాజ్యం’లో ఒంటి మీద లెదర్ జాకెట్, పెరిగిన గడ్డం, చేతిలో తుపాకీతో వెరైటీగా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం కమల్ జీవిత భాగస్వామి - నటి గౌతమి ప్రత్యేకంగా కాస్ట్యూమ్‌లు డిజైన్ చేశారు.

ఇవాళ పోస్టర్స్‌లో, తమిళ ట్రైలర్‌లో ఆయన అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటే ఆ జాగ్రత్తే కారణం. త్రిష కూడా మునుపెన్నడూ లేని విధంగా పూర్తిగా డిఫరెంట్‌గా కనపడతారు. ప్రకాశ్‌రాజ్‌ది మరో ముఖ్యపాత్ర. తెలుగు నటి మధుశాలిని ఒక చిత్రమైన పాత్ర చేస్తున్నారు. కమల్ గాఢంగా ముద్దుపెట్టుకుంటున్నట్లు షూటింగ్ షురూ టైమ్‌లోనే రిలీజైన పోస్టర్‌లో ఉన్నది మధుశాలినే! ఆ పాత్ర స్వరూప స్వభావాలు ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారామె!
 
మనవాళ్ళ స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్‌‌స
టెక్నికల్‌గానూ ఈ సినిమాను బ్రిలియంట్‌గా నిలిపే ప్రయత్నాలు జరిగాయి. గతంలో వివాదాస్పద కమల్ ‘విశ్వరూపం’ సినిమాకు పనిచేసిన బాలీవుడ్ ఫేమ్ మలయాళీ శానూ వర్గీస్ దీనికీ సినిమాటోగ్రాఫర్. ‘ఉత్తమ విలన్’ మొదలు కమల్‌కు ఆస్థాన మ్యూజిక్ డెరైక్టరైన యువకుడు జిబ్రాన్ ఈ సినిమాకూ మ్యూజిక్ ఇస్తున్నారు. సినిమాలో ఒకే పాట ఉంటుందట. గీత రచయిత రామజోగయ్యశాస్త్రి అది రాశారు.

తెలుగు వెర్షన్‌కు ప్రముఖ రచయిత అబ్బూరి రవి పనిచేశారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో వీరిద్దరూ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించారు. అదీ కమల్ కాంబినేషన్‌లో. పబ్‌లో జరిగే ఒక సీన్‌లో వీళ్ళిద్దరూ ఎంటర్‌టైన్ చేస్తారని సమాచారం. అన్నట్లు ఈ చిత్రంలో కమల్ స్నేహితుడి పాత్రకు తెలుగులో అబ్బూరి రవి డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా చాలా విశేషాలున్నాయీ సినిమాలో.
 
మొత్తం మీద, బాల నటుడిగా మొదలుపెట్టి ఇప్పటికి 50 ఏళ్ళ నటజీవితం పూర్తయినా, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవడం కళాకారుడిగా కమలహాసన్‌లోని ఆరని జ్వాలకు సంకేతం. అయితే, నిత్యనూతనత్వం కోసం చేసే ఈ అన్వేషణలో నిర్మాతగా, దర్శకుడిగా చాలాసార్లు ఆయనకు చేతులూ కాలాయి. కానీ, ప్రయోగశీలత మాత్రం కమల్ వదులుకోలేదు. ఆ వరుసలోనే ‘ఉత్తమ విలన్’ తరువాత ఈసారి ‘చీకటి రాజ్యం’లోని చీకటి నీడల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఏడాది నవంబర్‌లో కమల్, వచ్చే ఏడాది మొదట్లో రజనీకాంత్ కనువిందు చేయనున్నారు. కమర్షియల్ పరిధిలో ఒకరు, వాటికి అతీతంగా మరొకరు. ఎవరి రూట్ వారిదే. ఈ ఇద్దరి ఫిల్మ్స్... ఇప్పుడు మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్స్!    - రెంటాల జయదేవ
 
‘చీకటి రాజ్యం’లో ఏం జరిగిందంటే..?
* ఒకరోజు త్రిష, ప్రకాశ్‌రాజ్‌లకు ప్రోస్థటిక్ మేకప్ వేయాలి. కానీ, ప్రోస్థటిక్ మేకప్ నిపుణులకు ప్రోగ్రామ్ చెప్పడం మర్చిపోయారు రాజేశ్. చివరలో గుర్తొచ్చి, కమల్ దగ్గరకెళ్లి తన పొరపాటు చెప్పారు. అది విని కమల్ ఫైర్ అవ్వలేదు. నిజానికి, అప్పటికి పదిరోజులుగా కమల్ షూటింగ్‌లో ఉన్నారు. పదిరోజుల తర్వాత ఆయనకు దక్కిన ఒక్కరోజు విరామం అది. కానీ, కమల్ ఆ రోజు లొకేషన్‌కి వెళ్ళి, ప్రోస్థటిక్ మేకప్ వేశారు. దటీజ్ కమల్!
* ‘మన్మథన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) తర్వాత మళ్లీ కమల్‌తో త్రిష నటించిన చిత్రం ఇది. ఇందులో తన పాత్రపోషణ ఒక సవాల్ అన్నారు త్రిష. అన్నట్లు తమిళంలో త్రిష స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ సినిమా ఆమెకు కెరీర్‌లో 50వ చిత్రం.
* ‘చీకటి రాజ్యం’లో రెస్టారెంట్ కిచెన్‌లో కమల్‌హాసన్, త్రిష మధ్య ఓ ఫైటుంది. ఫ్రెంచ్ స్టంట్‌మెన్ ఆధ్వర్యంలో దాన్ని తీశారు.
* ఈ చిత్రాన్ని రూ. 30 కోట్ల నిర్మాణ వ్యయంతో తీశారని టాక్. దానిలో కమల్ పారితోషికం లేదు. తమిళ, తెలుగు భాషల్లో కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్రాన్ని ముగించడం ఓ విశేషం.
* ‘తూంగావనం’ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లో యూ ట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించడం ఒక విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement