ప్రమాణాల దేవుడు | kanipaka varasiddhi vinayaka special | Sakshi
Sakshi News home page

ప్రమాణాల దేవుడు

Published Wed, Sep 7 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

ప్రమాణాల దేవుడు

ప్రమాణాల దేవుడు

కాణిపాక వినాయకుడు
కోరిన వరాలు ఇచ్చే కామితార్థ ప్రదాయకుడు
వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం
సెప్టెంబర్ 5 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు

విఘ్నేశ్వరుని ఆలయాలలో దేశంలోనే ప్రసిద్ధమైనది కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. చిత్తూరు జిల్లాలో బాహుదా నది ఒడ్డున కాణిపాకంలో వెలసి విరాజిల్లుతున్న స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. సెప్టెంబర్ 25 వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పవిత్ర క్షేత్ర చరిత్రను  మననం చేసుకొందాం...


కాణిపాకంను పూర్వం విహారపురి అని పిలిచేవారు. ఈ ఆలయం గురించి ఇక్కడ ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో ధర్మపరాయుణులైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వారు గుడ్డి, మూగ, చెవిటి. అప్పట్లో ఓ ఏడాది గ్రామం కరువు కాటకాలతో అల్లాడిపోయింది. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. కరువును జయించడానికి ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతంబావిని లోతు చేయడానికి పూనుకొన్నారు. ఈ క్రమంలో బావి తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని పలుగు, పారల సాయంతో తొలగిస్తుండగా చేతిలోని పార రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ ముగ్గురు అన్నదమ్ములను తడిపింది. అంతే! వారి అంగవైకల్యం మటుమాయమైంది. వెంటనే వారు గ్రామాధికారికి, గ్రామస్తులకు జరిగింది వివరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్తులు బావిని పూర్తిగా తవ్వగా గణనాథుని శిరస్సు రూపం దర్శనమిచ్చింది. వెంటనే భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి కొబ్బరికాయలను కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్థం)లోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాస్తా కాణిపారకమ్‌గా కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామి వారు  స్వయంభువు వరసిద్ధి వినాయకుడుగా కోరిన వరాలను అందిస్తూ భక్తుల ఇష్టదైవంగా మారాడు.

 
సత్యప్రమాణాల దేవుడిగా...

వరసిద్ధ్ది వినాయకుడు వరాలకే కాదు సత్యప్రమాణాల కు కూడా ప్రసిద్ధం. ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఎంత పెద్దవారైనా వెనుకాడతారు. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అందువల్ల వ్యసనాలకు బానిసలైనవారికి ఇక్కడకు తీసుకొచ్చి ఇకమీదట ఫలానా వ్యసనం జోలికి పోనని ప్రమాణం చేయిస్తుంటారు. స్వామికి భయపడి ఆ వ్యసనాల నుంచి దూరమైనవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు రాజకీయ ప్రమాణాలు కూడా జరగుతుంటాయి. అసెంబ్లీలో నాయకులు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధ్దమా అంటూ సవాల్ విసరడం చూస్తుంటాం. గతంలో ఇక్కడ ప్రమాణం చేస్తే కోర్టులలో నాయ్యమూర్తులు కూడా అంగీకరించే వారట. దీన్నిబట్టి అర్థమవుతుంది స్వామివారు ఎంత సత్యప్రమాణుడో.

 

బాహువులు ఇచ్చిన నది....
కాణిపాక ఆలయం వద్ద ప్రవహించే బహుదా నదికీ ఓ కథ ఉంది. స్వామివారిని దర్శించుకొనేందుకు శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తెచ్చిన భోజన పదార్థాలు అయిపోయాయి. అప్పటికి వారు కాణిపాకం చేరుకోలేదు. చిన్నవాడైన లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడి తోటలో ఓ మామిడి పండు కోసుకొంటానని అన్న శంఖుడిని కోరాడు. అందుకు అన్న శంఖుడు దొంగతనం చేయడం నేరమని వారించాడు. అయినా లిఖితుడు అన్న మాటలు పెడచెవిన పెట్టి తోటలో మామిడి పండు కోసుకొని తిన్నాడు. తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్న రాజుకు తెలియజేస్తాడు. రాజు దొంగతనం చేసిన వ్యక్తికి రెండు చేతులు నరికి వేయించమని శిక్ష  వేస్తారు. వెంటనే లిఖితుని రెండు చేతులను ఖండించి వేస్తారు. ఇలా తమ్ముడి చేతులు పోవడంతో అన్న శంఖుడు చాలా బాధపడతాడు. తర్వాత వారిరువురూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకొని పక్కనే ప్రవహిస్తున్న బహుదా నదిలో మునగగా లిఖితునికి పోయిన చేతులు తిరిగి వస్తాయి. ఇలా పోయిన చేతులు తిరిగి వచ్చాయి కనుక అప్పటి నుంచి ఆ నదికి బాహుదా (బాహువులు ఇచ్చినది కాబట్టి) నది అని పేరు వచ్చింది.

 
నిత్యం పెరుగుతున్న స్వామి......

కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే ఉందని అంటారు. ఈ ప్రధాన ఆలయానికి అనుబంధంగా వాయువ్యదిశలో ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దపు చోళులు నిర్మించారు కనుక కాణిపాక ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉందనడంలో సందేహం లేదు. మరో విశేషం ఏమిటంటే స్వామివారి మూలవిరాట్టు తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోవడం. దీనికి తార్కాణంగా యాభై ఏళ్ల క్రితం నాటి వెండి కవచం కాని, దశాబ్ద కాలం క్రితపు మరో వెండి కవచం కాని స్వామికి పట్టకపోవడమే.

 

 ఎన్నో సేవలు మరెన్నో ఫలితాలు...
స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కోరిన వరాలు పొందడానికి ఆలయంలో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. పంచామృతాభిషేకం, గణపతిహోమం, గణపతి మోదకపూజ, మూల మంత్రార్చన, సంకటహర గణపతి వ్రతం... తదితర పూజల ద్వారా భక్తులు తమ కష్టనష్టాలను తొలగించుకుని స్వామి కృపకు పాత్రులు కావచ్చును.  - పాతుకూరి నరేశ్, సాక్షి, ఐరాల, చిత్తూరు జిల్లా

 

ఆలయానికి చేరుకునే మార్గం
ఈ ఆలయం చిత్తూరుకు 12 కి.మీ, తిరుపతి నుంచి 70 కి.మీ దూరంలో ఉంది. తిరుపతి నుంచి ప్రతి 30 నిమిషాలకు, చిత్తూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సును ఆర్టీసి వారు నడుపుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చే వారికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సౌకర్యం. విమాన ప్రయాణం అయితే తిరుపతి (రేణిగుంట) విమానశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి వాహనాల ద్వారా కాణిపాకం చేరుకోవచ్చును. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారు చిత్తూరు మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు.

 

ఏ రోజు... ఏ ఉత్సవం
ఈ నెల 5 న ఆరంభమైన  కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. ఈఓ పూర్ణచంద్రారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం, 14న ధ్వజ అవరోహణం, 15న అధికార నంది వాహనం, 16న రావణబ్రహ్మ వాహనం, 17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనం, 19న చంద్రప్రభ వాహనం, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం, 24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలతో ముగింపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement