ఈ ‘అబ్బాయి’ పేరు ఆడం హ్యారీ. స్వస్థలం కేరళలోని త్రిస్సూర్. వయసు ఇరవై ఏళ్లు. ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్ అవడం. అంతకన్నా ప్రత్యేకత.. తను అమ్మాయి కాదు.. అబ్బాయి అని ప్రపంచం చెవులు పగిలేలా హ్యారీ చేసిన ప్రయత్నం.
హ్యారీ.. పుట్టినప్పుడు అమ్మాయే. కాని యుక్త వయసు వచ్చేసరికి తనలో అమ్మాయి కన్నా అబ్బాయి లక్షణాలే ఉన్నాయనే నిజాన్ని గ్రహించి, తన లైంగికతను అబ్బాయిలాగే నిర్థారించుకుని, అబ్బాయి గుర్తింపునే కోరుకున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ల దగ్గర రహస్యంగా ఉంచాడు. పందొమ్మిదేళ్లప్పుడు హ్యారీని పైలట్ ట్రైనింగ్ కోసం జోహన్నస్‌బర్గ్ (దక్షిణ ఆఫ్రికా)కు పంపారు. అక్కడికి వెళ్లాక సోషల్ మీడియా ద్వారా తన జెండర్ ఐడెంటిటీని బయటపెట్టాడు. దాంతో బంధువులు, తిస్సూర్‌లోని తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లు ‘‘మీ తొలి సంతానం అమ్మాయి కాదు అబ్బాయి’’ అంటూ హ్యారీ తల్లిదండ్రులకు చెప్పి సూటిపోటి మాటలనడం, హేళన చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి గేలి హ్యారీ తమ్ముడికీ అతని స్కూల్లో తప్పలేదు.
ఇవన్నీ తెలిసి హ్యారీ చాలా బాధపడ్డాడు. తల్లిదండ్రులేమో హ్యారీని తమ సంతానమే కాదని వదిలేశారు. ట్రైనింగ్‌కి కావల్సిన ఫీజే కాదు.. ఖర్చులకూ డబ్బు పంపడం ఆపేశారు. అక్కడి నుంచి తిరిగి ఇండియా రావాలన్నా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి హ్యారీది. జోహన్నస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్స్‌లో క్లీనర్‌గా పనిచేసి.. ఇండియాకు టికెట్ కొనుక్కునేంత సమకూర్చుకొని .. పైలట్ శిక్షణను మధ్యలోనే వదిలేసి బోలెడంత డిప్రెషన్‌తో త్రిస్సూర్‌లోని ఇంటికొచ్చేశాడు. కూతురుకి పిచ్చిపట్టిందని కౌన్సెలింగ్స్, హాస్పిటల్స్ చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. డాక్టర్లు, సైకియాట్రిస్ట్‌లు కూడా.. ‘అబ్బాయి అనేదే నా ఐడెంటిటీ’ అని హ్యారీ చెప్తున్నా వినకుండా హ్యారీలో అమ్మాయి హార్మోన్స్‌ను పెంచేలా తప్పుడు చికిత్సను సూచించారు.
ఆ చికిత్స కోసం తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ఇంట్లోంచి వెళ్లిపోయి ఎర్నాకులం వచ్చేశాడు. దొరికిన పనిచేస్తూ బస్‌స్టాండ్‌లలో, రైల్వేప్లాట్‌ఫామ్‌లో, ఫుట్‌పాత్‌ల మీద ఉంటున్నాడు. ఈ క్రమంలో హ్యారి గురించి తెలుసుకున్న ఓ టీవీ చానల్ అతని కథను ప్రసారం చేసింది. ఇది చూసిన కేరళ రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ హ్యారీని పిలిచి, పైలట్ కావాలనే అతని కల, లక్ష్యం గురించి తెలుసుకొని 23 లక్షల రూపాయల లోన్‌ను మంజూరు చేసి.. రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీలో పైలట్ శిక్షణ పూర్తిచేసేలా అతనికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆ శిక్షణలోనే ఉన్నాడు.
‘‘నేను అనుకున్న కల నెరవేరింది. 2023 కల్లా పూర్తిస్థాయి కమర్షియల్ పైలట్ అవుతాను. ఏదో ఒకరోజు మా అమ్మానాన్న నుంచీ పిలుపు వస్తుందనీ ఆశిస్తున్నా. ఈ విషయంలో మా ప్రాంతంలోని వారు మా తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని వాళ్లు ససేమిరా అంటున్నారు. ప్రపంచమంతా నన్ను అబ్బాయిగా అంగీకరించినా ‘మేమైతే ఒప్పుకోం’ అని మావాళ్లు తేల్చేశారు. కాని నాకెక్కడో మూలన ఆశ.. ఎప్పటికైనా మా పేరెంట్స్ నన్ను అక్కున చేర్చుకుంటారని, నేను సాధించినదాన్ని చూసి గర్వపడి.. ఏదోకరోజు నన్ను ఇంటికి పిలుస్తారని’’ అంటాడు ఆడం హ్యారి నమ్మకంగా.
Comments
Please login to add a commentAdd a comment