పంచుకోవటం నేర్పండి
కేరెంటింగ్
సాధారణంగా పిల్లలు తమ వస్తువులు, ఆట బొమ్మలు అన్నీ తమవే అని, అలానే తల్లి, తండ్రి ప్రేమ తమకు మాత్రమే సొంతమని భావిస్తారు. వారిని ఎవరైనా ముట్టుకున్నా ఏడ్చేస్తారు. గొడవ చేస్తారు. అంతవరకు తప్పు లేదు కానీ, దానిని వస్తువులు, పుస్తకాలు, తినుబండారాలు, దుస్తులు వంటి వాటికి కూడా వర్తింప జేస్తేనే ఇబ్బంది. అలా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా ఎవరికీ, ఏమీ ఇవ్వడానికి ఇష్టపడరు. అలా కాకుండా ఉండాలంటే చిన్నప్పటినుంచే పిల్లలకు అన్నింటినీ పంచుకోవటం నేర్పించాలి.
తన వస్తువులను తాను ప్రాణప్రదంగా చూసుకోవడంలో ఏవిధమైన ఇబ్బందీ లేదు. అది మంచి పరిణామమే. అయితే, ఎవరికైనా ఏమైనా అవసరమై, అడిగినప్పుడు దానిని అవతలి వారికి ఇవ్వడంలో తప్పులేదని చెప్పాలి. వారు తినే కుకీస్ లాంటి తినుబండారాలను కూడా ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం నేర్పించాలి. ఇందులో ఒక చిన్న చిట్కాను పాటించాలి. అదేమంటే, మన పిల్లలను వారి వస్తువులు కానీ, తినుబండారాలను కానీ ముందుగా ఎదుటివారికి ఇవ్వమని చెప్పకూడదు.
ముందు అవతలి వారి నుంచి వీరికి ఇప్పించినట్లయితే వాళ్లుముందుగా ఇచ్చారు కాబట్టి తనూ ఇవ్వాలనే భావం కలుగుతుంది. అప్పుడు తమ వద్ద ఉన్న వాటిని అవతలి వారికి ఆనందంగా ఇస్తారు. ఆ విధంగా వారికి పంచుకోవటంలోని ఆనందాన్ని నే ర్పించాలి. అవేకాదు, సామాజిక నైపుణ్యాలూ నే ర్పించాలి. ఇతర పిల్లలతో కలిసి మెలసి ఉండటం, వారిని ప్రేమించటం, వాళ్లతో ఆడుకోవడం అలవాటు చేయాలి.