కత్తులూ కఠార్లూ నూరుతున్న మిఠాయి!
ఏప్రిల్ 25న దేశం ఒక కొత్త అమ్మాయిని చూడబోతోంది. 21 ఏళ్ల ఆ అందమైన బెంగాలీ అమ్మాయి ‘మిష్తీ’ని వెండితెరపై ‘కాంచీ’గా చూపించబోతున్నది సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్. అయితే కాంచీని ఆయన అందంగా మాత్రమే చూపించబోవడం లేదు! పరిస్థితులతో పోరాడి గెలిచిన ఒక యువతిగా తీర్చిదిద్దుతున్నారు.
షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. ఉత్తరాఖండ్‌లో ఓ కుటుంబం. ఆ కుటుంబంలోని అమ్మాయి కాంచీ. మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రిని దుండగులు కాల్చి చంపుతారు. దాంతో కాంచీ జీవితం తలకిందులవుతుంది. ఒక దశలో ఆమె ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తుంది. ఇదీ కథ. దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ‘కాంచీ’ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ఘాయ్ ఏడాది పాటు దేశమంతా గాలించారు.
350 మందికి పైగా అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశారు. చివరికి కోల్‌కతా అమ్మాయి మిష్తీని ఎంపిక చేసుకున్నారు. ఇది ఘాయ్ అదృష్టమా? మిష్తీ అదృష్టమా అనేది చెప్పడం కష్టం. ఒకటి మాత్రం వాస్తవం. కొత్త ముఖాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు మిష్తీ విపరీతంగా నచ్చుతుంది అని ఘాయ్ అంటున్నారు. మిష్తీ ప్రస్తుతం సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కఠోర శిక్షణ అని అనాలి. ‘‘స్త్రీలోని అంతశ్శక్తికి ప్రతీకగా కాంచీ పాత్రను మలిచేందుకే ఈ కాఠిన్యం’’ అని ఘాయ్ అంటారు.
‘ప్యార్ కా పంచ్‌నామా’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన కార్తీక్ తివారీ ‘కాంచీ’లో మిష్తీ పక్కన నటిస్తున్నారు. మిష్తీ అసలు పేరు ఇంద్రాణీ చక్రవర్తి. మిష్తీ అన్నది ఆమె ముద్దుపేరు. బెంగాలీలో మిష్తీ అంటే ‘మిఠాయి’ అని అర్థమట. ఈ మిఠాయి చేత సుభాష్ ఘాయ్ కత్తులూ కటార్లూ నూరిస్తున్నారన్నమాట!