Subhash Ghai
-
ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ
‘హీరో’ సినిమా కోసం జాకీష్రాఫ్‌ను తీసుకున్నాక దర్శకుడు సుభాష్ ఘాయ్ ‘నీకు ఫ్లూట్ తెలుసా?’ అని అడిగాడు. ‘ఆ... దూరం నుంచి ఒకసారి చూశాను’ అన్నాడు జాకీష్రాఫ్. సుభాష్ ఘాయ్ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ‘హీరో’ సినిమాలో హీరో ఫ్లూటిస్ట్. సినిమా సంగీతం అంతా ఫ్లూట్ మీదే ఆధారపడి ఉంది. జాకీ ష్రాఫ్‌కు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు. ఈ మైనస్‌ను తాను ఎలా ప్లస్ చేశాడో ‘ఇండియన్ ఐడెల్’ తాజా ఎపిసోడ్లో సుభాష్ ఘాయ్ విశేషంగా చెప్పారు. 1983లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘హీరో’. సుభాష్ ఘాయ్‌ని ‘షో మేన్’ను చేసిన సినిమా ఇది. దీనికి ముందు సుభాష్ ఘాయ్ రిషి కపూర్‌తో ‘కర్జ్’ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తిగా కొత్త వాళ్లతో సినిమా తీద్దామనుకున్నాడు. ఈ విషయం తెలిసిన జాకీ ష్రాఫ్ సుభాష్ ఘాయ్‌ని కలిశాడు. అతను అప్పటికి మోడల్‌గా పని చేస్తున్నాడు. ‘నీకు యాక్టింగ్ వచ్చా’ అని అడిగాడు సుభాష్ ఘాయ్. ‘రాదు’ అన్నాడు జాకీ. ‘ఏదీ... ఈ సీన్ చేసి చూపించు’ అనంటే సీన్‌పేపర్ తీసుకుని ‘ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ’ అన్నాడు. ఆ ఫ్రాంక్‌నెస్ సుభాష్‌కు నచ్చింది. ‘నువ్వే నా సినిమా హీరో’ అని అప్పటికప్పుడు చెప్పేశాడు. దానికి జాకీ ష్రాఫ్ ఆశ్చర్యపోయి ‘సార్... నేను నిజాలు మాట్లాడే మనిషిని. ఈ మధ్యే ఒక సినిమాలో శక్తికపూర్ అసిస్టెంట్‌కు అసిస్టెంట్‌గా నటించా. నన్ను మీరు హీరో అంటున్నారు. ఆలోచించుకోండి’ అన్నాడు. ఆ మాటలకు ఇంకా నచ్చేశాడు సుభాష్ ఘాయ్‌కు. ‘హీరో’ సినిమా షూటింగ్ మొదలైంది. అందులో హీరో ఫ్లూట్ వాయిస్తుంటాడు. ‘నాకు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు’ అన్నాడు జాకీ ష్రాఫ్. టేప్ రికార్డర్లో ఫ్లూట్ల బిట్ వస్తుంటే తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నాడు. ‘సరే... నీకు మెడ ఊపడం వచ్చా?’ అని అడిగారు సుభాష్ ఘాయ్. ‘వచ్చు’ అన్నాడు జాకీ ఫ్రాఫ్. ‘అయితే ఫ్లూట్ పట్టుకుని దాని ధ్వని ఎలా పోతుంటే అలా తల ఊపు. అప్పుడు నీ తలను చూస్తారు. వేళ్లను కాదు’ అన్నారు సుభాష్ ఘాయ్. జాకీ ష్రాఫ్ అలాగే ఊపాడు. సినిమా చూస్తే అతను నిజంగా వాయిస్తున్నట్టు ఉంటుంది. ఈ విశేషాలు జనవరి 23న ప్రసారం అయిన ‘ఇండియన్ ఐడెల్’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుభాష్ చెప్పారు. ‘కర్జ్’లో ‘ఓం శాంతి ఓం’ పాట రికార్డు చేయడానికి కిశోర్ కుమార్ కోసం 4 నెలలు వెయిట్ చేశారట ఆయన. ‘నా కోసం ఎందుకు? వేరే ఎవరి చేతైనా పాడించవచ్చుగా’ అని కిశోర్ కుమార్ అడిగితే ’ఈ పాటకు నాకు పెర్ఫార్మర్ కావాలి. మీకు మించిన పెర్ఫార్మర్ ఎవరున్నారు’ అన్నారట సుభాష్. ‘ఆ పాట ఆయన వల్లే అంత బాగుంది’ అన్నారాయన. ‘తాళ్’ సినిమా కోసం రహమాన్ని బుక్ చేశాక రహమాన్ని తీసుకొని గీత రచయిత ఆనంద్ బక్షీ ఇంటికి వెళ్లారట. అక్కడ ఇద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేసి 15 నిమిషాలు కూచుంటే ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోలేదట. దానికి కారణం ఆనంద్ బక్షీకి ఇంగ్లిష్ రాదు. రహమాన్‌కు హిందీ రాదు. ‘సుభాష్ ఘాయ్ వల్లే నేను హిందీ నేర్చుకున్నాను’ అని రహమాన్ ఈ ఎపిసోడ్లో వీడియో సందేశంలో అన్నాడు. తాళ్ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిజంగా సుభాష్ ఘాయ్ పెద్ద షో మేన్. పామరుణ్ణి రంజింప చేసిన దర్శకుడు. జనవరి 24 ఆయన జన్మదినం. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఖల్నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసినది యాంటీ హీరో రోల్ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ చిత్రం సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్ దత్ చేసిన విలన్ బల్లూ పాత్రను సీక్వెల్లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్నాయక్’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ మలి భాగంలో యాంటీ హీరో రోల్ చేయనున్నారు. ‘వార్’ సినిమా తర్వాత విలన్‌గా టైగర్ ష్రాఫ్‌కి మంచి మార్కులు పడటంతో మరో పవర్ఫుల్ విలన్ ‘ఖల్నాయక్’ పాత్రకు టైగర్ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్ దత్ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్నాయక్’ని గ్యాంగ్‌స్టర్ కథగా తీశారు. సీక్వెల్‌ను డ్రగ్ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం. -
మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బయటి వ్యక్తిని కావడంతో ఇండస్ట్రీలో పలు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘పర్దేస్’ డైరెక్టర్ సుభాష్ ఘయ్ తనను తిట్టారని.. కోర్టుకు లాగుతానని బెదిరించారని తెలిపారు. ఆ సమయంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. మహిమా చౌదరి మాట్లాడుతూ.. ‘సుభాష్ ఘయ్ నన్ను విపరీతంగా తిట్టారు. కోర్టుకు లాగాలని ప్రయత్నించారు. నా ఫస్ట్ షోని రద్దు చేయించాలని చూశారు. నాతో పని చేయవద్దని మిగతా నిర్మాతలకు సందేశాలు పంపారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. వారు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, డేవిడ్ ధావన్, రాజ్‌కుమార్ సంతోషి. వీరు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. డేవిడ్ ధావన్ నన్ను పిలిచి బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన నిన్ను వేధించకుండా చూస్తాము అని ధైర్యం చెప్పారు. వీరు తప్ప మిగతా ఎవ్వరు నాకు ఫోన్ చేయలేదు’ అన్నారు మహిమా చౌదరి. కానీ తాను కొన్ని మంచి అవకాశాలను కోల్పోయినట్లు తెలిపారు. వాటిలో 1998లో వచ్చిన రాంగోపాల్ వర్మ ‘సత్య’ చిత్రం కూడా ఉందన్నారు మహిమా చౌదరి. ('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') ఈ చిత్రం కోసం మొదట తననే తీసుకున్నారని.. తర్వాత తన స్థానంలో ఉర్మిళా మండోద్కర్‌ను పెట్టారని తెలిపారు మహిమా చౌదరి. ఇది తాను సంతకం చేసిన రెండవ చిత్రం అన్నారు. అయితే ఈ చిత్రం నుంచి తనను తొలగిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులన్ని తాను బయటి వ్యక్తిని కావడం వల్లనే ఎదురయ్యాయని.. పరిశ్రమకు చెందిన వ్యక్తి అయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదన్నారు. ఏది ఏమైనా ధైర్యంగా నిలిచి పోరాడాలని తెలిపారు. మహిమా చౌదరి 1997లో వచ్చిన పర్దేస్ చిత్రంతో పరిశ్రమలో అడుగు పెట్టారు. -
క్లీన్ చిట్
తనని లైంగికంగా వేధించాడంటూ మోడల్ కేట్ శర్మ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేశారు. సుభాష్ ఘాయ్‌కు ముంబై పోలీస్‌లు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ విషయంపై సుభాష్ ఘాయ్ ఎటువంటి కామెంట్స్ చేయనప్పటికీ ఆయన సన్నిహితులు మాట్లాడుతూ –‘‘సుభాష్ ఈ ఆరోపణలకు చాలా బాధపడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు. పోయిన పేరు, మర్యాద తిరిగి ఎలా వస్తాయి’’ అని ఆవేదనగా అన్నారు. ‘‘ఇచ్చిన కంప్లయింట్ అబద్ధం అని తేలినప్పుడు ఆరోపణలు జరిపిన వాళ్లను అరెస్ట్ చేయాలి’’ అని పేర్కొన్నారు వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల కేసుని కేట్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో ఎలాంటి ఆధారాలు లేవని సుభాష్‌పై కేసుని కోర్టు కొట్టివేసింది. -
సుభాష్ ఘాయ్... కేస్ గయా
‘తాల్, ఖల్నాయక్’ వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు మోడల్ కేట్ శర్మ. తనతో తప్పుగా ప్రవర్తించాడని, మానసికంగా టార్చర్ చేశాడని గత నెల ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారామె. నెలన్నర తర్వాత ఆ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ – ‘‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. మా ఇంట్లోవాళ్లను చూసుకోవాలి. నాకు జరిగిపోయినదాని గురించి న్యాయం కోసం పరుగులు తీయలేను. ఇప్పటికే అన్నింటికీ విసిగిపోయాను’’ అన్నారు. ఇంకా ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ – ‘‘మీటూ’ గురించి చాలా మంది జోక్ చేస్తున్నారు. ఇంతమంది బయటకు వచ్చి చెబుతున్నా ఇంకా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. పోరాటం చేయడానికి గల కారణం నాకు కనిపించడం లేదు. నేను చెప్పాల్సిందంతా పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లోనే ఉంది. నేను, సుభాష్ ఘాయ్ ఫ్రెండ్స్. కానీ ఆ స్నేహం నిలిచేలా అతను ప్రవర్తించలేదు’’ అని పేర్కొన్నారు కేట్ శర్మ. -
వాళ్లతో ఎందుకు పని చేయకూడదు?
‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల బాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్, ముఖేష్ చాబ్రాలు ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమం గురించి తాజాగా సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా స్పందించారు. ‘‘నా 40 ఏళ్ల కెరీర్లో ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళతోనూ చాలా మర్యాదతో నడుచుకుంటున్నాను’’ అన్నారు. మరి.. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ ఘాయ్‌తో కలిసి మీరు పని చేస్తారా? అంటే.. ‘‘ఎందుకు పని చేయకూడదు. అతను ఇప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. అతను దోషిగా తేలినప్పటికీ కలిసి పని చేస్తాను. ఎందుకంటే... అతని తప్పు నిరూపితమైతే ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అయినా.. సంజయ్ దత్ దోషిగా తేలి జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా?. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయమని కొందరు అంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో వాళ్లు హీరోలుగా హైలైట్ కావడానికి అలా మాట్లాడుతున్నారేమో?’’ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్ ఖాన్‌తో(హౌస్‌ఫుల్ 4) వర్క్ చేయనని అక్షయ్ కుమార్, ‘మొఘల్’ సినిమాలో సుభాష్ కపూర్‌తో పని చేయనని ఆమిర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. -
#మీటూ : ‘ఖల్నాయక్’ దర్శకునిపై ఆరోపణలు
భారత్‌లో కూడా మీటూ మూవ్మెంట్ ఉధృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపులు గురించి బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బాలీవుడ్ ప్రముఖులు, మీడియా రంగం పెద్దలు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి కోవలోకి మరో ప్రముఖ దర్శకుడు చేరాడు. ‘ఖల్నాయక్’, ‘రామ్ లఖాన్’, ‘పర్దేస్’ వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు సుభాష్ ఘయ్ ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలే ఎదర్కొంటున్నారు. తన వివరాలు వెల్లడించని ఓ మహిళ సుభాష్ ఘయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. స్క్రిప్ట్ డిస్కషన్ కోసమని సుభాష్ నన్ను తన ఆఫీస్‌కు పిలిచేవాడని ఆ సమయంలో తనతో తప్పుగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఒక రోజు కూల్ డ్రింక్‌లో మత్తు మందు.. కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. అంతేకాక ఈ విషయం గురించి బయటకు చెబితే తనకు వచ్చే జీతం డబ్బులు కూడా ఇవ్వనని బెదిరించాడని వెల్లడించారు. ఆ సమయంలో తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ జాబ్ తనకు ఎంతో అవసరం ఉండటం వల్ల తాను ఈ దారుణం గురించి బయటకు వెల్లడించలేదని పేర్కొన్నారు. అయితే సదరు మహిళ చేసిన ఆరోపణలను సుభాష్ ఖండించారు. తాను ఎవరి వేధింపులకు గురి చేయలేదని తెలిపారు. ఒకవేళ ఆ మహిళ చేసిన ఆరోపణలు వాస్తవమే అయితే ఆమె కోర్టుకు వెళ్లి వాటిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తానే ఆమె మీద పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని సుభాష్ ఘయ్ ఆరోపించారు. -
23 ఏళ్లుగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ..
ముంబై: పాముకు తలలో, తేలుకు తోకలో ఉంటుంది విషం. కానీ బల్లూకి ఒళ్లంతా విషమే. ఆ చీడ పరుగు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మత్తుపదార్థాల అక్రమ రవాణా నుంచి బాంబులు పేల్చి కల్లోలాలు సృష్టించే వరకు వాడిది అందె వేసిన చెయ్యి. చిన్నతనంలో జరిగిన సంఘటనలతో సమాజంపై కక్ష పెంచుకున్న బల్లూ ఓ ఉన్మాదిచేతిలో కీలుబొమ్మలా మారి.. చివరికి కటకటాలపాలవుతాడు. తనను పట్టుకున్న పోలీస్ అదికారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. 23 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు. జరగబోయే విధ్వంసాన్నిచూడాలంటే ఇకొన్ని రోజులు ఆగాల్సిందే! అవునుమరి, వారసత్వ హీరోగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంజయ్ దత్ కు ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన 'ఖల్ నాయక్' కు 26 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయనున్నారు దర్శకనిర్మాత సుభాష్ ఘాయ్. ఆయన, సంజయ్ దత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సీక్వెల్ పేరు 'ఖల్ నాయక్ రిటర్న్స్'. 1993 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖల్ నాయక్ అనేక సంచలనాలతోపాటు వివాదాలకూ కేంద్ర బిందువు అయిన నాటి 'ఖల్ నాయక్'లో బల్లు అలియాస్ బల్ రామ్ నటించిన సంజయ్ దత్.. 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తిచేసుకుని, బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడతాడు? మళ్లీ మాఫియా డాన్ గా ముంబయిని ఎలా గడగడలాండించాడు? అనే కథాంశంతో ఖల్ నాయక్ రిటర్న్స్ రూపొందుతోంది. బల్లూకు ఎదురునిలిచే పోలీస్ పాత్రను యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల భొగట్టా. ఖల్ నాయక్ లో సంజయ్ విలన్ అయితే టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ హీరో అన్న సంగతి తెలిసిందే. అయితే సుభాష్ ఘయ్ మాత్రం 'ఖల్ నాయక్ రిటర్న్స్'లో టైగర్ నటించడం లేదని స్పంష్టం చేశారు. బల్లు పాత్రకు సంజయ్ దత్ తప్ప ఇతర నటీనటుల ఎంపిక పూర్తికాలేదని, అయితే డిసెంబర్ లోగా సినిమాను రూపొందించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖల్ నాయక్ కు దర్శకత్వం వహించిన తాను.. ఈ సినిమాకు కేవలం నిర్మతగానే వ్యవహరిస్తానని, కొత్త దర్శకుడు 'ఖల్ నాయక్ రిటర్న్స్ 'ను రూపొందిస్తాడని సుభాష్ ఘాయ్ చెప్పారు. -
తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు!
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఓ మూవీలో నటించబోతున్నాడని, అందుకుగానూ అగ్రిమెంట్ పై సంతకం చేశాడంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని నిర్మాత సుభాష్ ఘాయ్ తెలిపాడు. 1993లో విడుదలై సక్సెస్ సాధించిన యాక్షన్ మూవీ 'ఖల్నాయక్' రీమేక్ లో టైగర్ నటిస్తున్నాడని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని విషయాలను నిర్మాత మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు 2013లోనే సుభాష్ ప్రకటించాడు. ఇప్పటివరకూ ఏ హీరోను సంప్రదించలేదని మరిన్ని ఈ ప్రాజెక్టు వివరాలు కొన్ని వివరించాడు. 'అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. టైగర్ ష్రాఫ్ ఈ మూవీలో నటించడం లేదు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. రణవీర్ సింగ్ తో మూవీ చేయాలని భన్సాలీ కోరుకుంటున్నాడు. మూవీ స్క్రిప్టు చివరి దశకు వచ్చిందని, ప్రేక్షకులు ఈ మూవీ రీమేక్ పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు' అని నిర్మాత చెప్పాడు. 1993లో వచ్చిన 'ఖల్నాయక్' లో సంజయ్ దత్ టెర్రరిస్టు బల్లు పాత్రలో కనిపించగా, అతడ్ని పట్టుకునేందుకు యత్నించే పోలీసు పాత్రలో జాకీ ష్రాఫ్, అతడి ప్రేయసిగా మాధురీ దీక్షిత్ నటించారు. తండ్రి మూవీ రీమేక్ అనగానే టైగర్ పై వదంతులు ప్రచారం అవుతున్నాయి. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ దత్ కోసం మరో ఆసక్తికరమైన సీక్వెల్‌ను రెడీ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'ఖల్నాయక్'కు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సుభాష్ ఘయ్. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ లీడ్‌రోల్స్‌లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సీక్వెల్ కు 'ఖల్నాయక్ రిటర్న్స్' అన్న టైటిల్‌ను కూడా ఫైనల్ చేశాడు సుభాష్ ఘయ్. అయితే ప్రస్తుతం ఎర్రావడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్, ఈ సీక్వెల్ కు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. తన మీద ఉన్న బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను చెరిపేసుకోవాలనుకుంటున్న సంజయ్ మరోసారి ఇలాంటి పాత్రలో నటిస్తాడా లేక సుభాష్ ఘయ్ ఆఫర్ ను తిరస్కరిస్తాడా చూడాలి. తన కూతురు ఆపరేషన్ సందర్భంగా ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చిన సంజయ్‌దత్, విదు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీలను కలిశాడు. వీరి కాంబినేషన్లో మున్నాభాయ్ సీక్వెల్‌పై కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మరి సంజయ్, ఏ సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తాడో చూడాలి. -
హైదరాబాద్‌లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
-
ఇక... ధ్యాన ‘విద్యాబాల!’
మేకప్ మెరుగులు అవసరం లేని అందం విద్యాబాలన్‌ది. దర్శక, నిర్మాత సుభాష్ ఘయ్ అలానే అంటారు. అందుకే తాను ప్రారంభించిన ‘గురుకుల్’ అనే ధ్యాన కేంద్రానికి విద్యాబాలన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేసుకున్నారు. మానసిక ప్రశాంతత కోరుకునే తారలు ఈ మెడిటేషన్ సెంటర్‌కు రావచ్చని సుభాష్ తెలిపారు. అలాగే, త్వరలో సుభాష్ ఘయ్ ఆరంభించనున్న ఓ క్లాసికల్ మ్యూజిక్ స్కూల్లో భాగస్వామి కావడానికీ విద్యాబాలన్ పచ్చజెండా ఊపారు. -
ఒక కొత్తమ్మాయి ఒక పాత సెంటిమెంటు!
కొత్త ముఖం తాను కొత్తగా పరిచయం చేసే కథానాయికలకు ‘యం’తో మొదలయ్యే పేర్లు పెట్టడం డెరైక్టర్ సుభాష్ ఘయ్‌కు ఉన్న సెంటిమెంట్. ‘కాంచి’ సినిమా కథానాయిక అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. అయితే ఆమె పేరును తన సెంటిమెంట్ ప్రకారం ‘మిస్తి’గా మార్చాడు. ‘యం’ సెంటిమెంట్ ఏమిటి? అని అడిగితే- ‘యం’ ఫర్ మదర్... స్త్రీ అంటే తల్లితో సమానం... అంటాడు ఘయ్. మిస్తి అనే పేరేమిటి? కాస్త విచిత్రంగా ఉంది... అనేకదా మీ డౌటు? అసలు విషయం ఏమిటంటే, ఇంద్రాణి నిక్‌నేమ్ ‘మిస్తి’! ఎలాగూ ఈ పేరు ‘యం’తో మొదలవుతుంది కాబట్టి నిక్ నేమ్‌నే అసలు పేరు చేశాడు సుభాష్ ఘయ్. ఘయ్ సెంటిమెంట్ గోల పక్కన పెడదాం. ఇంతకీ ఇంద్రాణి తన ‘స్క్రీన్ నేమ్’ మీద సంతృప్తిగా ఉందా? ఆమె ఇలా అంటుంది- ‘‘నా పేరు ఇంద్రాణి అనే విషయం చాలామందికి తెలియదు తెలుసా! నేను మిస్తిగానే అందరికి తెలుసు’’ (బాప్రే!) ‘కాంచి’ సినిమాకు అనూహ్యమైన స్పందన ఏమీ రాలేదు. ‘పాత సీసాలో కొత్త హీరోయిన్’ అని కొందరు వెక్కిరించారు. మిస్తి నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత విజయమేమీ సాధించలేదు. ‘‘సినిమా సూపర్ హిట్ కాలేదు కదా. మరి మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా?’’ అని అడిగితే- ‘‘అదేమీ లేదు. మూడు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాను’’ అంటుంది. ‘‘వాటి వివరాలు చెబుతారా?’’ అని అడిగితే- ‘‘పూర్తి వివరాలు త్వరలోనే’’ అని అంటుంది మాటలు నేర్చిన మిస్తి! -
కత్తులూ కఠార్లూ నూరుతున్న మిఠాయి!
ఏప్రిల్ 25న దేశం ఒక కొత్త అమ్మాయిని చూడబోతోంది. 21 ఏళ్ల ఆ అందమైన బెంగాలీ అమ్మాయి ‘మిష్తీ’ని వెండితెరపై ‘కాంచీ’గా చూపించబోతున్నది సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్. అయితే కాంచీని ఆయన అందంగా మాత్రమే చూపించబోవడం లేదు! పరిస్థితులతో పోరాడి గెలిచిన ఒక యువతిగా తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. ఉత్తరాఖండ్‌లో ఓ కుటుంబం. ఆ కుటుంబంలోని అమ్మాయి కాంచీ. మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రిని దుండగులు కాల్చి చంపుతారు. దాంతో కాంచీ జీవితం తలకిందులవుతుంది. ఒక దశలో ఆమె ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తుంది. ఇదీ కథ. దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ‘కాంచీ’ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ఘాయ్ ఏడాది పాటు దేశమంతా గాలించారు. 350 మందికి పైగా అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశారు. చివరికి కోల్‌కతా అమ్మాయి మిష్తీని ఎంపిక చేసుకున్నారు. ఇది ఘాయ్ అదృష్టమా? మిష్తీ అదృష్టమా అనేది చెప్పడం కష్టం. ఒకటి మాత్రం వాస్తవం. కొత్త ముఖాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు మిష్తీ విపరీతంగా నచ్చుతుంది అని ఘాయ్ అంటున్నారు. మిష్తీ ప్రస్తుతం సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కఠోర శిక్షణ అని అనాలి. ‘‘స్త్రీలోని అంతశ్శక్తికి ప్రతీకగా కాంచీ పాత్రను మలిచేందుకే ఈ కాఠిన్యం’’ అని ఘాయ్ అంటారు. ‘ప్యార్ కా పంచ్‌నామా’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన కార్తీక్ తివారీ ‘కాంచీ’లో మిష్తీ పక్కన నటిస్తున్నారు. మిష్తీ అసలు పేరు ఇంద్రాణీ చక్రవర్తి. మిష్తీ అన్నది ఆమె ముద్దుపేరు. బెంగాలీలో మిష్తీ అంటే ‘మిఠాయి’ అని అర్థమట. ఈ మిఠాయి చేత సుభాష్ ఘాయ్ కత్తులూ కటార్లూ నూరిస్తున్నారన్నమాట! -
అనంతరం: వినయ మేఘన
తాము చేయలేకపోయినవి తమ పిల్లలు చేయాలని, తమ కలలను వారు నిజం చేయాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎంతమంది పిల్లలు ఆ ఆశల్ని నెరవేరుస్తారో తెలియదు కానీ... మేఘన మాత్రం నెరవేర్చింది. తండ్రి సుభాష్‌ఘాయ్ కలను తాను నిజం చేసి చూపించింది. తండ్రికి తగ్గ తనయ అని అందరూ ప్రశంసించేలా చేసింది. అయితే ఆమెను పొగిడిన చాలామందికి తెలియదు... ఆమె సుభాష్ సొంత కూతురు కాదని! సినిమా వాళ్ల పిల్లల్లో చాలామంది తామూ ఆ రంగుల ప్రపంచంలోనే విహరించాలని ఆశపడుతుంటారు. అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, అక్కడే జీవిద్దాం, అక్కడే సాధిద్దాం అనుకుంటారు. కానీ మేఘన అలా అనుకోలేదు. సినిమా ప్రపంచం తనకు నచ్చదంది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన తనకి ఎప్పటికీ కలగదు అంది. కానీ సినీ ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకోలేకపోయింది. దానికి కారణం... ఆమె తండ్రి సుభాష్ ఘాయ్... ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. ఆయన ఆశ నెరవేర్చడం కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది మేఘన. పిల్లలు లేని సుభాష్... తన తమ్ముడి కూతురు మేఘన పసిబిడ్డగా ఉన్నపుడే దత్తత చేసుకున్నారు. కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. అలాగని మరీ కాలు కందకుండా పెంచలేదు. సుభాష్ ప్రాక్టికల్ మనిషి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అని నమ్ముతారాయన. అందుకే అందలాల మీద కాకుండా అందరితో కలిసిపోయేలా కూతుర్ని పెంచాలనుకున్నారు. సెలెబ్రిటీల పిల్లలు చదివే బడిలో కాకుండా, మధ్య తరగతి పిల్లలు అధికంగా ఉండే స్కూల్లో మేఘనను చేర్పించారు. కారులో కాకుండా స్కూలు బస్సులో పంపించారు. ధనవంతులతో కాకుండా సామాన్యుల పిల్లలతో స్నేహం చేయడం నేర్పించారు. తన తండ్రిలోని ఆ గొప్ప గుణం... తనకు జీవితమంటే ఏంటో, జీవితంలో ఎలా ఉండాలో నేర్పింది అంటుంది మేఘన. మేఘనను చూసినవాళ్లంతా ఆశ్చర్యంగా అనే మాట ఒకటే... ‘అంత పెద్ద దర్శకుడి కూతురై ఉండి, భలే సింపుల్‌గా ఉందే’ అని. ఆ కాంప్లిమెంట్ తన తండ్రికి దక్కాలంటుంది మేఘన. ఆయనంటే చాలా ఇష్టం మేఘనకి. అందుకే సినిమాల వైపు రాకూడదు అనుకున్నా... తండ్రి మీద ప్రేమతో, ఆయన కలను నెరవేర్చాలన్న ఆశయంతో ‘విజిల్వుడ్ ఇన్స్టిట్యూట్’ బాధ్యతలు చేపట్టింది. ‘విజిల్వుడ్’ అనేది సుభాష్ స్థాపించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. సుభాష్ దాన్ని తెరిచేనాటికి మేఘన లండన్‌లో మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసి, ఓ మీడియా హౌస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. సినీ పరిశ్రమకు ప్రతిభావంతులను అందించాలనే ఆశయంతో ఆయన దీనికి ఊపిరిపోశారు. అయితే దర్శకుడిగా బిజీగా ఉన్న ఆయనకు దాన్ని అభివృద్ధి చేయడం కష్టమైంది. అందుకే దాని బాధ్యతను కూతుర్ని స్వీకరించమని కోరారు. ఆయన మాటను మేఘన కాదనలేదు. వెంటనే ఇన్స్టిట్యూట్ పగ్గాలు చేపట్టింది. దాన్ని ఆమె ఎంత సమర్థంగా నిర్వహించిందంటే... అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వచ్చి మరీ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మీ నాన్న పేరు నిలబెట్టారు అని ఎవరైనా అంటే... ‘నాన్న నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నిజం చేయాలనుకున్నాను. చేశానేమో తెలీదు, కానీ ఆయనతో పోల్చుకునేంత గొప్పదాన్ని మాత్రం ఇంకా కాలేదు’ అంటుంది. ఈ వినయమే మేఘనను ఈ రోజు ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు! -
'సరబ్ జిత్'లో అమితాబ్ నటించడం లేదు: సుభాష్ ఘయ్
పాకిస్థానీ జైల్లో మరణించి భారతీయ ఖైదీ సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించడం లేదని ఆ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయి వెల్లడించారు. ఆ చిత్రంలో పాకిస్థానీ న్యాయవాది పాత్ర పోషించాలని అమితాబ్‌ని కలసి కోరానని ఆయన తెలిపారు. అయితే ఆయన సినిమాల్లో నటిస్తు మహా బీజిగా ఉన్నానని చెప్పారని పేర్కొన్నారు. అదికాక ఓ చిత్రంలో న్యాయవాద పాత్ర పోషించేందుకు ఇప్పటికే ఒప్పకున్నట్లు కూడా ఆయన వివరించారని మంగళవారం ముంబైలో తెలిపారు. ఆ మహానటుడితో కలసి పనిచేయాలని తన ఆశపడుతున్నట్లు చెప్పారు. ఆ పాత్ర కోసం మరోకరిని ఎంపిక చేసేందుకు నటుడి అన్వేషణ ప్రారంభించినట్లు వివరించారు. సరబ్జిత్ చిత్రానికి ఈశ్వర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. అలాగే అనురాగ్ సిన్హా, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారని సుభాష్ ఘాయి వెల్లడించారు. పాకిస్థానీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు భారతీయుడు సరబ్ జిత్ పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో ఆ దేశ దళాలు సరబ్ జిత్త్ ను అరెస్ట్ చేశారు. పాక్ లో పేలిన బాంబు ఘటనకు సరబ్ తో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో శిక్ష అనుభవిస్తూ... తోటి ఖైదీల దాడిలో గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. -
సుభాష్ ఘై డెరైక్షన్‌లో...
ఇటీవలి కాలంలో వరుస సంచలన విజయాలతో బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సల్మాన్ ఖాన్. గతంలో బాలీవుడ్‌కి రికార్డు స్థాయిలో హిట్స్ అందించారు షోమేన్ సుభాష్ ఘై. ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి బాలీవుడ్ నివ్వెరపోయే విధంగా ‘యువరాజ్’ అనే ఓ ఘోర పరాజయ చిత్రాన్ని అందించారు. అప్పటినుంచీ వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ బాలీవుడ్ తెరపై కనిపించలేదు. కొద్దికాలంగా సుభాష్ ఘై బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ తన మార్క్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సల్మాన్ ఖాన్‌తో పని చేయబోతున్నారు. ‘‘మేమిద్దరం ఓ చిత్రం చేయాలని కమిట్ అయ్యాం. సల్మాన్ వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే మేమిద్దరం కలిసి.. ఈ ప్రాజెక్ట్‌కు ఓ రూపం ఇవ్వనున్నాం. నా తదుపరి చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తోనే రూపొందించనున్నాను’’ అని సుభాష్ ఘై తెలిపారు. ఇదిలా ఉండగా - 1983లో సుభాష్ ఘై దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హీరో’ని రీమేక్ చేసుకోవాలని సల్మాన్ ముచ్చటపడుతున్నారు. సల్మాన్ అడిగిన వెంటనే సుభాష్ ఘై హక్కులు ఇచ్చేశారు. జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి నటించిన ‘హీరో’ చిత్రం రీమేక్‌లో ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలు నటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కాంచీ విడుదలకు తొందరేం లేదు: సుభాష్ ఘాయ్
తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు. సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.