తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు.
సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.