ఒక కొత్తమ్మాయి ఒక పాత సెంటిమెంటు!
కొత్త ముఖం
తాను కొత్తగా పరిచయం చేసే కథానాయికలకు ‘యం’తో మొదలయ్యే పేర్లు పెట్టడం డెరైక్టర్ సుభాష్ ఘయ్‌కు ఉన్న సెంటిమెంట్. ‘కాంచి’ సినిమా కథానాయిక అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. అయితే ఆమె పేరును తన సెంటిమెంట్ ప్రకారం ‘మిస్తి’గా మార్చాడు.
‘యం’ సెంటిమెంట్ ఏమిటి? అని అడిగితే-
‘యం’ ఫర్ మదర్... స్త్రీ అంటే తల్లితో సమానం... అంటాడు ఘయ్. మిస్తి అనే పేరేమిటి? కాస్త విచిత్రంగా ఉంది... అనేకదా మీ డౌటు? అసలు విషయం ఏమిటంటే, ఇంద్రాణి నిక్‌నేమ్ ‘మిస్తి’! ఎలాగూ ఈ పేరు ‘యం’తో మొదలవుతుంది కాబట్టి నిక్ నేమ్‌నే అసలు పేరు చేశాడు సుభాష్ ఘయ్.
ఘయ్ సెంటిమెంట్ గోల పక్కన పెడదాం. ఇంతకీ ఇంద్రాణి తన ‘స్క్రీన్ నేమ్’ మీద సంతృప్తిగా ఉందా? ఆమె ఇలా అంటుంది- ‘‘నా పేరు ఇంద్రాణి అనే విషయం చాలామందికి తెలియదు తెలుసా! నేను మిస్తిగానే అందరికి తెలుసు’’ (బాప్‌రే!)
‘కాంచి’ సినిమాకు అనూహ్యమైన స్పందన ఏమీ రాలేదు. ‘పాత సీసాలో కొత్త హీరోయిన్’ అని కొందరు వెక్కిరించారు. మిస్తి నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత విజయమేమీ సాధించలేదు.
‘‘సినిమా సూపర్ హిట్ కాలేదు కదా. మరి మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా?’’ అని అడిగితే-
‘‘అదేమీ లేదు. మూడు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాను’’ అంటుంది. ‘‘వాటి వివరాలు చెబుతారా?’’ అని అడిగితే- ‘‘పూర్తి వివరాలు త్వరలోనే’’ అని అంటుంది మాటలు నేర్చిన మిస్తి!