అనంతరం: వినయ మేఘన
తాము చేయలేకపోయినవి తమ పిల్లలు చేయాలని, తమ కలలను వారు నిజం చేయాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎంతమంది పిల్లలు ఆ ఆశల్ని నెరవేరుస్తారో తెలియదు కానీ... మేఘన మాత్రం నెరవేర్చింది. తండ్రి సుభాష్‌ఘాయ్ కలను తాను నిజం చేసి చూపించింది. తండ్రికి తగ్గ తనయ అని అందరూ ప్రశంసించేలా చేసింది. అయితే ఆమెను పొగిడిన చాలామందికి తెలియదు... ఆమె సుభాష్ సొంత కూతురు కాదని!
సినిమా వాళ్ల పిల్లల్లో చాలామంది తామూ ఆ రంగుల ప్రపంచంలోనే విహరించాలని ఆశపడుతుంటారు. అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, అక్కడే జీవిద్దాం, అక్కడే సాధిద్దాం అనుకుంటారు. కానీ మేఘన అలా అనుకోలేదు. సినిమా ప్రపంచం తనకు నచ్చదంది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన తనకి ఎప్పటికీ కలగదు అంది. కానీ సినీ ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకోలేకపోయింది. దానికి కారణం... ఆమె తండ్రి సుభాష్ ఘాయ్... ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. ఆయన ఆశ నెరవేర్చడం కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది మేఘన.
పిల్లలు లేని సుభాష్... తన తమ్ముడి కూతురు మేఘన పసిబిడ్డగా ఉన్నపుడే దత్తత చేసుకున్నారు. కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. అలాగని మరీ కాలు కందకుండా పెంచలేదు. సుభాష్ ప్రాక్టికల్ మనిషి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అని నమ్ముతారాయన. అందుకే అందలాల మీద కాకుండా అందరితో కలిసిపోయేలా కూతుర్ని పెంచాలనుకున్నారు. సెలెబ్రిటీల పిల్లలు చదివే బడిలో కాకుండా, మధ్య తరగతి పిల్లలు అధికంగా ఉండే స్కూల్లో మేఘనను చేర్పించారు. కారులో కాకుండా స్కూలు బస్సులో పంపించారు. ధనవంతులతో కాకుండా సామాన్యుల పిల్లలతో స్నేహం చేయడం నేర్పించారు. తన తండ్రిలోని ఆ గొప్ప గుణం... తనకు జీవితమంటే ఏంటో, జీవితంలో ఎలా ఉండాలో నేర్పింది అంటుంది మేఘన.
మేఘనను చూసినవాళ్లంతా ఆశ్చర్యంగా అనే మాట ఒకటే... ‘అంత పెద్ద దర్శకుడి కూతురై ఉండి, భలే సింపుల్‌గా ఉందే’ అని. ఆ కాంప్లిమెంట్ తన తండ్రికి దక్కాలంటుంది మేఘన. ఆయనంటే చాలా ఇష్టం మేఘనకి. అందుకే సినిమాల వైపు రాకూడదు అనుకున్నా... తండ్రి మీద ప్రేమతో, ఆయన కలను నెరవేర్చాలన్న ఆశయంతో ‘విజిల్‌వుడ్ ఇన్‌స్టిట్యూట్’ బాధ్యతలు చేపట్టింది.
‘విజిల్‌వుడ్’ అనేది సుభాష్ స్థాపించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్. సుభాష్ దాన్ని తెరిచేనాటికి మేఘన లండన్‌లో మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసి, ఓ మీడియా హౌస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. సినీ పరిశ్రమకు ప్రతిభావంతులను అందించాలనే ఆశయంతో ఆయన దీనికి ఊపిరిపోశారు. అయితే దర్శకుడిగా బిజీగా ఉన్న ఆయనకు దాన్ని అభివృద్ధి చేయడం కష్టమైంది. అందుకే దాని బాధ్యతను కూతుర్ని స్వీకరించమని కోరారు. ఆయన మాటను మేఘన కాదనలేదు. వెంటనే ఇన్‌స్టిట్యూట్ పగ్గాలు చేపట్టింది. దాన్ని ఆమె ఎంత సమర్థంగా నిర్వహించిందంటే... అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వచ్చి మరీ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
మీ నాన్న పేరు నిలబెట్టారు అని ఎవరైనా అంటే... ‘నాన్న నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నిజం చేయాలనుకున్నాను. చేశానేమో తెలీదు, కానీ ఆయనతో పోల్చుకునేంత గొప్పదాన్ని మాత్రం ఇంకా కాలేదు’ అంటుంది. ఈ వినయమే మేఘనను ఈ రోజు ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు!