23 ఏళ్లుగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ..
ముంబై: పాముకు తలలో, తేలుకు తోకలో ఉంటుంది విషం. కానీ బల్లూకి ఒళ్లంతా విషమే. ఆ చీడ పరుగు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మత్తుపదార్థాల అక్రమ రవాణా నుంచి బాంబులు పేల్చి కల్లోలాలు సృష్టించే వరకు వాడిది అందె వేసిన చెయ్యి. చిన్నతనంలో జరిగిన సంఘటనలతో సమాజంపై కక్ష పెంచుకున్న బల్లూ ఓ ఉన్మాదిచేతిలో కీలుబొమ్మలా మారి.. చివరికి కటకటాలపాలవుతాడు. తనను పట్టుకున్న పోలీస్ అదికారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. 23 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు. జరగబోయే విధ్వంసాన్నిచూడాలంటే ఇకొన్ని రోజులు ఆగాల్సిందే!
అవునుమరి, వారసత్వ హీరోగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంజయ్ దత్ కు ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన 'ఖల్ నాయక్' కు 26 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయనున్నారు దర్శకనిర్మాత సుభాష్ ఘాయ్. ఆయన, సంజయ్ దత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సీక్వెల్ పేరు 'ఖల్ నాయక్ రిటర్న్స్'. 1993 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖల్ నాయక్ అనేక సంచలనాలతోపాటు వివాదాలకూ కేంద్ర బిందువు అయిన నాటి 'ఖల్ నాయక్'లో బల్లు అలియాస్ బల్ రామ్ నటించిన సంజయ్ దత్.. 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తిచేసుకుని, బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడతాడు? మళ్లీ మాఫియా డాన్ గా ముంబయిని ఎలా గడగడలాండించాడు? అనే కథాంశంతో ఖల్ నాయక్ రిటర్న్స్ రూపొందుతోంది.
బల్లూకు ఎదురునిలిచే పోలీస్ పాత్రను యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల భొగట్టా. ఖల్ నాయక్ లో సంజయ్ విలన్ అయితే టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ హీరో అన్న సంగతి తెలిసిందే. అయితే సుభాష్ ఘయ్ మాత్రం 'ఖల్ నాయక్ రిటర్న్స్'లో టైగర్ నటించడం లేదని స్పంష్టం చేశారు. బల్లు పాత్రకు సంజయ్ దత్ తప్ప ఇతర నటీనటుల ఎంపిక పూర్తికాలేదని, అయితే డిసెంబర్ లోగా సినిమాను రూపొందించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖల్ నాయక్ కు దర్శకత్వం వహించిన తాను.. ఈ సినిమాకు కేవలం నిర్మతగానే వ్యవహరిస్తానని, కొత్త దర్శకుడు 'ఖల్ నాయక్ రిటర్న్స్ 'ను రూపొందిస్తాడని సుభాష్ ఘాయ్ చెప్పారు.