జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం.
ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు.
ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం.
ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు.
స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి!
మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది.
పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు.
గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి..
దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి.
‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు.
ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు.
సూక్తి సుధ
► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు.
► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే.
► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు.
► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి.
► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది.
– ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్.
Comments
Please login to add a commentAdd a comment