Jagadguru Adi Shankara
-
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్ స్వరూపులు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోదీ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన సందర్శించిన పవిత్రస్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం. ఆదిశంకరాచార్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాన్ని నిర్వహించాము. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 14 ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను నిర్వహించాము. కేదార్‌నాథ్‌లో ప్రధాని నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాము. ఆదిశంకరాచార్యుల విశిష్టతను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..) -
ఏ పీఠం లక్ష్యమైనా... ధర్మరక్షణే
ఏ పీఠం లక్ష్యమైనా ధర్మరక్షణ, సర్వమానవ శ్రేయస్సేనని కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ లలితాపీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అభిభాషించారు. సమాజంలో హిందూ ధర్మాన్ని రక్షించడం, ప్రచారం చేయడం, లౌకికంగా ధర్మ రక్షణ చేపట్టడమే ధార్మిక సంస్థల కర్తవ్యమని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెరుగుతుండటం సంతోషమే అయినా.. మంత్ర సాధన, తపశ్శక్తి తగ్గుతున్నాయని అన్నారు. మనిషిని రక్షించేవి ఇవేనని చెప్పారు. చాతుర్మాస దీక్షల నిర్వహణలో భాగంగా నగరంలోని కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత శ్రీ లలితా పీఠంలో వేంచేసి ఉన్న స్వామి గురువారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు. స్వామి మాటల్లోనే చదువుకుందాం.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది. ఆధ్యాత్మిక చింతనా వెల్లివిరుస్తోంది. గతంలో కాశీ, తిరుపతి, శ్రీశైలం, ఉజ్జయిని వంటి మహా పుణ్యక్ష్రేతాలకే భక్తులు పెద్దసంఖ్యలో వెళ్ళే వారు. కానీ ఇప్పుడు ఏ దేవాలయంలో చూసినా జనమే కనిపిస్తున్నారు.. దేవాలయాల సంఖ్యా పెరుగుతోంది. కానీ తపశ్శక్తి తగ్గుతోంది. ఏకాగ్రతతతో ఆ శక్తిని సిద్ధింపజేసుకోవాలి. మంత్ర సాధనతో భక్తిభావం పెంపొందించుకోవాలి. మంత్రాల్లో దేవతల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అవి మనం సృష్టించినవి కావు. ఆ మంత్రాలను ఇచ్చిన దేవతలు అందులో తమ శక్తిని నిక్షిప్తం చేశారు. ఒక్కో మంత్రంలో ఒక్కో దేవత ఉంటుంది. మంత్రం పఠిస్తే దేవత దిగివచ్చేలా ఉండాలి. మంత్ర శక్తితో ఎంతో మంది గురువులు ఎన్నో సాధించారు. పూర్వం మంత్రశక్తితో దేవతలు దిగివచ్చేవారు. యుగాలు మారాయి. ఈ కలియుగంలో కూడా నిష్టతో తపస్సు చేస్తే సత్ఫలితాలు పొందొచ్చు. మంత్రమే మనిషిని రక్షిస్తుంది మంత్రం దేవుళ్ళను పిలవడానికి సులభమైన ఒక సాధనం. మంత్రమే మనిషిని రక్షిస్తుంది. ప్రతి మనిషీ కష్టసుఖాలను అనుభవించాల్సిందే. సుఖాలు వచ్చినపుడు ఇబ్బంది లేదు గానీ కష్టాలు వచ్చినపుడు మాత్రం అవి తీరే మార్గం ఏమిటి అని మథనపడిపోతుంటారు. అప్పుడు మాత్రం ‘మేం చాలా మంచివాళ్ళమండి.. ఎవరికీ అపకారం తలపెట్టమండి..మావల్ల ఎవరికీ ఏ కష్టం రాదండి ఈ దేవుడు ఏం చేస్తున్నాడండి..మాకు కష్టాలు ఎందుకు ఇచ్చాడండీ’ అంటూ ఆవేదన చెందుతారు. కానీ పూర్వ జన్మల కష్ట సుఖాలు అనుభవించడానికే ఇక్కడికి వస్తారన్న వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు నువ్వు మంచివాడివయినా గత జన్మలో చేసిన పాప ఫలం కచ్చితంగా ఇక్కడ అనుభవించాలి. జపాలు, హోమాలతో గత జన్మల పాపాలూ తొలగించుకోవచ్చు జపాలు, హోమాలు, మంత్రాలతో గత జన్మ పాపాలు పోగొట్టుకోవచ్చు. కొంతమంది పిల్లల కోసం పూజలు చేసుకోమంటే మాకు యోగం లేదంటారు. కానీ మంత్రం యోగాన్ని పుట్టిస్తుంది. అది గుర్తించగలగాలి. మంత్రంతో ఎంతటి కష్టాన్నైనా తొలగించుకోవచ్చు. అయితే మంత్రోచ్ఛరణ సాధారణ మనుషులకు సాధ్యం కాదు కాబటి వారి తరఫున పీఠాధిపతులు దీక్షాపరులు.. సమర్థవంతమైన వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి లక్షల కోట్ల జపాలు చేయించి ధార్మిక సేవ చేయిస్తున్నారు. సిద్ధేశ్వరి పీఠం ద్వారా మేం ఈ గొప్ప సేవకు అంకితమయ్యాం. పూర్వజన్మలపై.... ప్రతి వ్యక్తి కూడా జన్మ పరంపరలోనే జన్మిస్తూ ఉంటారు. పునరపి జననం.. పునరపి మరణం.. అని జగద్గురు శంకరాచార్యుల వారే చెప్పారు. చాలామంది పూర్వజన్మలను చూశామని నాకు చెప్పారు.. వాళ్ళలో కొంతమంది ఆయా స్థలాలకు వెళ్ళి నిర్ధారించుకుని కూడా వచ్చారు. .కొన్నేళ్ళ కిందట హిందూయేతర మతానికి చెందిన అప్పటి మంత్రి సతీమణి గుంటూరులో పీఠానికి వచ్చారు.. ధ్యానం చేసుకోవచ్చా అని అడిగారు..ఎందుకలా అడుగుతున్నారు..దేవత యం దు విశ్వాసం కలిగి వస్తే.. ఎవరైనా చేయొచ్చు అని అన్నాను.. ఆమె ధ్యానం చేసుకుని పూర్వ జన్మ కనిపిస్తోందని అన్నారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ బియాన్ వీసీ మనుషులను హిప్నటైజ్ చేసి పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పిస్తుంటారు. టీవీల్లో కూడా రిలే అయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన జీవించే ఉన్నారు. ఆయన హిప్నటిజం మార్గంలో చెబుతున్నారు.. మనం ధార్మిక మార్గంలో అన్వేషిస్తున్నాం.. అంతే తేడా. తపస్సుతో తరించు.. సమాజానికి అర్పించు తపస్సు చేసి తరించు. అందులో కొంత భాగం సమాజానికి అర్పించు.. అనే నేను భక్తులకు అనుగ్రహభాషణం చేస్తుంటాను. వ్యక్తులకు లౌకికమైన, భౌతికమైన, మానసికమైన సమస్యలు వచ్చినప్పుడు దివ్యశక్తి ద్వారా. మంత్రశక్తి ద్వారా సమస్యలను పరిష్కరించుకునే శక్తిని సంపాదించుకోవాలని చెబుతుంటాను..దేశ విదేశాల్లో హిందూ ధర్మ పరిరక్షణతో పాటు మంత్ర శక్తి, దైవశక్తిపై నమ్మకం, దివ్యానుభవాలు పొందేలా చేయడమే మా పీఠం లక్ష్యం. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు బాగుంది.. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు బాగుంది. బాగుండాలనే మేమందరం అభిలషిస్తాం. పీఠాధిపతుల కర్తవ్యం ప్రజలు సుభిక్షంగా ఉండటమే. హిందూ ధర్మంలో ఓ గొప్ప సంప్రదాయముంది. ఓ వ్యక్తి తన ఇంట్లో పూజ, తపస్సు, యజ్ఞం ఏది చేసినా.. తన కోసమే చేసుకున్నప్పటికీ చిట్ట చివర స్వస్తిప్రయాక్ష పరిపాలయంతాం... అంటూ ప్రజలతో పాటు ప్రజలను పరిపాలించే రాజులు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు.. అటువంటిది ధర్మ పీఠాల నిర్వాహకులైన మేము తప్పకుండా ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలూ బాగుండాలని, ధర్మం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలనే నిత్యం ధ్యానిస్తాం. పూజిస్తాం. చాతుర్మాస దీక్షా విశేషం... సన్యాసులు ఒక్కచోట నిలకడగా ఉండకూడదు. సంచరిస్తూ ధర్మాన్ని ప్రభోదిస్తూ ఉండాలి. అయితే వర్షాకాలంలో నాలుగు నెలల పాటు వారి సంచారానికి అనుకూలంగా ఉండదు కాబట్టి.. ఒక చోట స్థిరంగా ఉండి అక్కడే తపస్సు చేసుకుంటూ ధర్మ ప్రభోదం చేయడం ఒక పద్ధతి, నియమంగా ఏర్పడింది. సన్యాసోపనిషత్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. దీన్నే చాతుర్మాస దీక్ష అని అంటారు. అయితే ఇప్పుడు వసతులు పెరిగిన తర్వాత మాసస్య పక్షః అని నాలుగు నెలలకు నాలుగు పక్షాలు.. అంటే రెండు నెలల కాలంలో చాతుర్మాస దీక్ష చేయడం జరుగుతోంది. సన్యాసులే కాదు.. గృహస్తులు కూడా ఈ దీక్ష చేయొచ్చు.. ఈ ఏడాది చాతుర్మాస దీక్ష విశాఖలోనే చేస్తున్నాను. సెప్టెంబర్ 14 వరకు దీక్షలో ఉంటాను. గతంలో కాశీ, బృందావనం, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో దీక్షలు చేశాను. ఈ ఏడాది భక్తుల కోరిక విశాఖ లలితాపీఠంలో చేయాలని సంకల్పించాం. విశాఖ లలితా పీఠం(సిద్దేశ్వరీ పీఠం) మహనీయమైన పీఠం. దక్షిణామూర్తి పరమహంస అనే మహోన్నత వ్యక్తి స్థాపించారు. ఆయన శిష్యుడు సముచితానంద భారతి అనే స్వామి అభివృద్ది చేశారు. ఆయన తరువాత నేను పీఠం బాధ్యతలు తీసుకున్నాను. అమెరికాలో 108అడుగుల శంకరాచార్యుల విగ్రహం హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఆసేతు హిమాచలమే కాదు.. ఇతర దేశాలూ, ఖండాలూ పర్యటిస్తున్నాను. కైలాస మానస సరోవరంలో ఎక్కువగా ఉంటాను. ఇటీవల అమెరికాలో 500 ఎకరాల స్థలం తీసుకున్నాం. అక్కడ ఆశ్రమం నిర్మించాలని సంకల్పం చేశాం. అక్కడే జగద్గురు శంకరాచార్యుల 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించాం. -
ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు
‘మిథునం’, ‘జగద్గురు ఆదిశంకర’ చిత్రాలు డబుల్ ధమాకా సాధించాయి. ఈ రెండు సినిమాలూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమా తరఫున నామినేట్ అయ్యాయి. నిర్మాతలు మండలి అధికారికంగా ఈ రెండు చిత్రాలను ఎంపిక చేసింది. అలాగే గోవాలో నవంబరులో జరుగనున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగానికి ఈ రెండు సినిమాలూ ఎంపిక కావడం విశేషం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి జంటగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన ‘మిథునం’ గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. జేకే భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన ‘జగద్గురు ఆదిశంకర’ ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. -
చరిత్రలో నిలిచిపోతుంది
‘‘ఎన్నో వందల, వేల సినిమాలొస్తున్నాయి. ఏ సినిమా ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తోందో మనకు తెలుసు. అలాగే ఏ సినిమాని ఎలా ఆదరించాలో కూడా ప్రేక్షకులకు తెలుసు. సినిమా తీసేవాళ్లల్లో ఎంత సంస్కారం ఉండాలో, చూసేవాళ్లలో కూడా అంతే సంస్కారం ఉండాలి’’ అన్నారు పరిపూర్ణానంద స్వామి. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై జేకే భారవి దర్శకత్వంలో శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’ ఇటీవల విడుదలైంది. టైటిల్ రోల్‌ని కౌశిక్‌బాబు, ఇతర ప్రధాన పాత్రలను నాగార్జున, శ్రీహరి, సాయికుమార్ తదితరులు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ -‘‘ప్రతి హిందువు, భారతీయుడు చూడాల్సిన సినిమా. ఆదిశంకర జీవితాన్ని భారవి చాలా స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చేసి భారవ సాహసం చేయలేదు, తపస్సు చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. నేటి తరంలో ఇలాంటి సినిమా రావడం, అది ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సమావేశంలో జయశ్రీదేవి, భారవి, కౌశిక్, నాగ్ శ్రీవత్స, రాజా రవీంద్ర, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిశంకర సినిమాకి నాకోసం రెండేళ్లు ఆగారు! : కౌశిక్‌బాబు
అంతకు ముందు పలు సినిమాలు, సీరియల్స్ చేసినా... ప్రేక్షకులకు కౌశిక్‌బాబు బాగా రీచ్ అయ్యింది మాత్రం ఇటీవల విడుదలైన ‘జగద్గురు ఆదిశంకర’తోనే. అయితే... కేరళనాట మాత్రం ‘కుట్టి ఎన్టీఆర్’ అనే బిరుదును అతను ఎప్పుడో కొట్టేశాడు. అయ్యప్పగా, రాముడిగా, కృష్ణుడిగా పలు పౌరాణిక పాత్రలు చేసి, నూనూగు మీసాల వయసులో అక్కడ నూరేళ్లు గుర్తుంచుకోదగ్గ ఇమేజ్‌ని సంపాదించాడు. అంటే.. రచ్చ గెలిచేసి... ఇప్పుడు ఇంట గెలిచే పనిలో ఉన్నాడన్నమాట. ప్రస్తుతం జగద్గురుడిగా జనాల ముందుకొచ్చిన ఈ చిచ్చరపిడుగుతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... *** హీరోలందరూ మాస్ ఇమేజ్ వైపు చూస్తుంటే.. మీరేంటి భక్తి అంటున్నారు? ఈ మధ్య కాలంలో చాలామంది నాతో ఇదే మాటన్నారు. కొందరైతే.. ఈ భక్తి సినిమాలేంటని హేళనగా మాట్లాడారు. వారందరూ ఇప్పుడు ‘ఆదిశంకర’ చూసి షాక్. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవ్వడం చూసి వాళ్ల నోటి వెంట మాట రావడంలేదు. మామూలుగా భక్తి సినిమా అంటే ఓపెనింగ్స్ ఉండవు. పెద్ద హీరోలు చేసే సినిమాలు తప్ప. కానీ నా సినిమాక్కూడా ఇంత ఓపెనింగ్స్ రావడం నిజంగా గొప్ప విషయం. *** ఆదిశంకర పాత్రకు భారవి అడిగినప్పుడు మీ ఫీలింగ్? నాలుగేళ్ల క్రితం ఆయన ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు చిన్నవాణ్ణి. రెండేళ్ళ తర్వాత ఈ కుర్రాడితో తీస్తే బావుంటుందని కె.రాఘవేంద్రరావు అన్నారు. ఆయన మాట ప్రకారం నా కోసం రెండేళ్లు ఆగి, ఫిజికల్‌గా నేను కాస్త తయారయ్యాక అప్పుడు షూటింగ్‌కి వెళ్లారు భారవి. కానీ ఈ సినిమా షూటింగే రెండేళ్లు జరిగింది. దాంతో.. నా శరీరంలో ఏ మార్పూ రాకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఎంతో శ్రమకోర్చి చేసిన పాత్ర ఇది. *** మిమ్మల్ని హీరోని చేయాలని మీ నాన్నగారికి ముందునుంచీ ఉండేదా? లేదు. మా నాన్నగారు విజయబాబు సాహిత్యాభిమాని. దేశాన్నీ, కళలను ప్రేమిస్తారాయన. అందుకే సాహిత్యం చదవడం నా చిన్నతనం నుంచీ ఆలవాటు చేశారు. ఆ వయసులోనే యువతరాన్ని చైతన్యపరిచే విధంగా ఢిల్లీలో వేలాదిమంది ముందు వివేకానందుని ప్రవచాలు వల్లెవేశాను. ఇప్పటికీ శోభానాయుడుగారి వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్టీఆర్ సినిమాలను బాగా చూడమనేవారు నాన్న. డైలాగ్ అంటే ఆయనలా నాభి నుంచి పలకాలని చెబుతూ ఉండేవారు. మూడేళ్ల వయసులోనే ‘కళంకిత’ సీరియల్లో నటించాను. ‘టక్కరి దొంగ’ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించాను. ఆ పాత్రకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది. *** మరి మలయాళ రంగంలోకి ఎలా వెళ్లారు? నటన ధ్యాసలో పడి... చదువుని నిర్లక్ష్యం చేస్తానేమోనని నాన్న భయపడ్డారు. ఇక కొన్నాళ్ల పాటు యాక్టింగ్‌ని ఆపుదామనుకుంటున్న టైమ్‌లో మలయాళ సీరియల్ ‘స్వామి అయ్యప్పన్’కి అవకాశం వచ్చింది. దాన్ని నాన్న కాదనలేకపోయారు. ఆ సీరియల్ ఎంత పేరు తెచ్చిందంటే... మోహన్‌లాల్, పృధ్వీరాజ్, కళాభవన్మణి లాంటి తారలు వారి ఇళ్లకు నన్ను పిలిచి అతిథ్యం ఇచ్చేంత. ఓ సారి బీజేపీ వారి సభకు వెళితే, నన్ను చూడటానికే లక్షల్లో జనాలు వచ్చారు. ఆ సభలోనే నన్ను ‘కుట్టి ఎన్టీఆర్’ అని సంబోధించారు అక్కడి నాయకులు. *** అంతటి వ్యక్తితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు మీ నాన్న ఎలా ఫీలయ్యారు? నాన్న నాకు గొప్ప క్రిటిక్. ఆయనకు పొగడ్తలంటే గిట్టవు. అందుకే స్పందించలేదు. అమ్మ మాత్రం ఆనందంతో ఏడ్చేసింది. *** మలయాళంలో ఇంకా ఏమేం చేశారు? ‘లక్కీ జోకర్’లో కృష్ణుడిగా చేశాను. అందులో ఏసుదాస్‌గారి పాటకు అభినయించే ఛాన్స్ దక్కింది. ‘నాదబ్రహ్మం’ సినిమాలో మృదంగ కళాకారునిగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ద్విపాత్రాభినయం చేశాను. ‘స్టడీటూర్’ అనే సినిమా చేశాను. అది త్వరలో విడుదల కానుంది. అంతేకాక మలయాళ మనోరమా వారి ఫీచర్ ఫిలిమ్ ‘రామాయణం’లో రాముడిగా, ‘గురువాయురప్పన్’ సీరియల్లో కృష్ణుడిగా చేశాను. *** ప్రస్తుతం హీరోగా ఎదగాలంటే.. ఇలా పద్దతిగా వెళ్తే కుదరదు. తెరపై అన్ని కళలూ చూపించాలి కదా? మీరన్నది అర్థమైంది. నటనతోపాటు నేను జిమ్నాస్టిక్స్, తైక్వాండోలో శిక్షణ తీసుకున్నాను. అన్ని రకాల డాన్సులూ చేయగలను. ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగలననే నమ్మకం నాకుంది. త్వరలోనే ఓ ప్రముఖ దర్శకునితో ఓ మంచి మాస్ చిత్రంలో నటించబోతున్నాను. *** మళ్లీ... మైథలాజికల్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారు? ప్రస్తుతానికి లేనట్టే. రాఘవేంద్రరావు, భారవిలాంటి పెద్దలు అడిగితే మాత్రం చేస్తా. ఎవరికి పడితే వాళ్లకు చేయను. -
యువతకు ఆదర్శం ఈ సినిమా
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుతమైన చిత్రాలకు కథలు అందించిన జేకే భారవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ సినిమాలో ఆదిశంకరుడిగా కౌశిక్, ఇతర ప్రధాన పాత్రల్లో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ శ్రీవత్స స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా నారా జయశ్రీదేవి మాట్లాడుతూ -‘‘భారవి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, చూద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. కానీ శ్రీవత్స స్వరపరచిన పాటలు విన్నాక, సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా నిర్మాణంలో ఆలస్యం జరిగింది. గతంలో పలు చిత్రాలకు ఇలా జరిగింది. అవి విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘ఈ కథ చెప్పడానికి భారవి దాదాపు ఏడాది తిరిగాడు. కథ విన్న తర్వాత నా పాత్ర నన్ను హంట్ చేసింది. దాంతో ఒప్పుకున్నాను’’ అని శ్రీహరి అన్నారు. శివరాత్రి నాడు పాటలు విడుదలయ్యాయని, అప్పట్నుంచీ ఏ గుళ్లో చూసినా, ఏ ఇంట చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయని కౌశిక్‌బాబు తెలిపారు. ఆదిశంకరుని పేరు మీద చేసిన చిత్రానికి పాటలివ్వడం పూర్వజన్మ సుకృతమని శ్రీవత్స చెప్పారు. యువతకు ఆదర్శంగా నిలిచే సినిమా అని ‘శాంతా బయోటెక్’ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని భారవి తెలిపారు.