యువతకు ఆదర్శం ఈ సినిమా
యువతకు ఆదర్శం ఈ సినిమా
Published Sun, Aug 11 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుతమైన చిత్రాలకు కథలు అందించిన జేకే భారవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ సినిమాలో ఆదిశంకరుడిగా కౌశిక్, ఇతర ప్రధాన పాత్రల్లో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ శ్రీవత్స స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు.
ఈ సందర్భంగా నారా జయశ్రీదేవి మాట్లాడుతూ -‘‘భారవి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, చూద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. కానీ శ్రీవత్స స్వరపరచిన పాటలు విన్నాక, సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా నిర్మాణంలో ఆలస్యం జరిగింది. గతంలో పలు చిత్రాలకు ఇలా జరిగింది. అవి విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘ఈ కథ చెప్పడానికి భారవి దాదాపు ఏడాది తిరిగాడు.
కథ విన్న తర్వాత నా పాత్ర నన్ను హంట్ చేసింది. దాంతో ఒప్పుకున్నాను’’ అని శ్రీహరి అన్నారు. శివరాత్రి నాడు పాటలు విడుదలయ్యాయని, అప్పట్నుంచీ ఏ గుళ్లో చూసినా, ఏ ఇంట చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయని కౌశిక్‌బాబు తెలిపారు. ఆదిశంకరుని పేరు మీద చేసిన చిత్రానికి పాటలివ్వడం పూర్వజన్మ సుకృతమని శ్రీవత్స చెప్పారు. యువతకు ఆదర్శంగా నిలిచే సినిమా అని ‘శాంతా బయోటెక్’ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని భారవి తెలిపారు.
Advertisement