ఆదిశంకర సినిమాకి నాకోసం రెండేళ్లు ఆగారు! : కౌశిక్‌బాబు
ఆదిశంకర సినిమాకి నాకోసం రెండేళ్లు ఆగారు! : కౌశిక్‌బాబు
Published Mon, Aug 19 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
అంతకు ముందు పలు సినిమాలు, సీరియల్స్ చేసినా... ప్రేక్షకులకు కౌశిక్‌బాబు బాగా రీచ్ అయ్యింది మాత్రం ఇటీవల విడుదలైన ‘జగద్గురు ఆదిశంకర’తోనే. అయితే... కేరళనాట మాత్రం ‘కుట్టి ఎన్టీఆర్’ అనే బిరుదును అతను ఎప్పుడో కొట్టేశాడు. అయ్యప్పగా, రాముడిగా, కృష్ణుడిగా పలు పౌరాణిక పాత్రలు చేసి, నూనూగు మీసాల వయసులో అక్కడ నూరేళ్లు గుర్తుంచుకోదగ్గ ఇమేజ్‌ని సంపాదించాడు. అంటే.. రచ్చ గెలిచేసి... ఇప్పుడు ఇంట గెలిచే పనిలో ఉన్నాడన్నమాట. ప్రస్తుతం జగద్గురుడిగా జనాల ముందుకొచ్చిన ఈ చిచ్చరపిడుగుతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ...
*** హీరోలందరూ మాస్ ఇమేజ్ వైపు చూస్తుంటే.. మీరేంటి భక్తి అంటున్నారు?
ఈ మధ్య కాలంలో చాలామంది నాతో ఇదే మాటన్నారు. కొందరైతే.. ఈ భక్తి సినిమాలేంటని హేళనగా మాట్లాడారు. వారందరూ ఇప్పుడు ‘ఆదిశంకర’ చూసి షాక్. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవ్వడం చూసి వాళ్ల నోటి వెంట మాట రావడంలేదు. మామూలుగా భక్తి సినిమా అంటే ఓపెనింగ్స్ ఉండవు. పెద్ద హీరోలు చేసే సినిమాలు తప్ప. కానీ నా సినిమాక్కూడా ఇంత ఓపెనింగ్స్ రావడం నిజంగా గొప్ప విషయం.
*** ఆదిశంకర పాత్రకు భారవి అడిగినప్పుడు మీ ఫీలింగ్?
నాలుగేళ్ల క్రితం ఆయన ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు చిన్నవాణ్ణి. రెండేళ్ళ తర్వాత ఈ కుర్రాడితో తీస్తే బావుంటుందని కె.రాఘవేంద్రరావు అన్నారు. ఆయన మాట ప్రకారం నా కోసం రెండేళ్లు ఆగి, ఫిజికల్‌గా నేను కాస్త తయారయ్యాక అప్పుడు షూటింగ్‌కి వెళ్లారు భారవి. కానీ ఈ సినిమా షూటింగే రెండేళ్లు జరిగింది. దాంతో.. నా శరీరంలో ఏ మార్పూ రాకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఎంతో శ్రమకోర్చి చేసిన పాత్ర ఇది.
*** మిమ్మల్ని హీరోని చేయాలని మీ నాన్నగారికి ముందునుంచీ ఉండేదా?
లేదు. మా నాన్నగారు విజయబాబు సాహిత్యాభిమాని. దేశాన్నీ, కళలను ప్రేమిస్తారాయన. అందుకే సాహిత్యం చదవడం నా చిన్నతనం నుంచీ ఆలవాటు చేశారు. ఆ వయసులోనే యువతరాన్ని చైతన్యపరిచే విధంగా ఢిల్లీలో వేలాదిమంది ముందు వివేకానందుని ప్రవచాలు వల్లెవేశాను. ఇప్పటికీ శోభానాయుడుగారి వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్టీఆర్ సినిమాలను బాగా చూడమనేవారు నాన్న. డైలాగ్ అంటే ఆయనలా నాభి నుంచి పలకాలని చెబుతూ ఉండేవారు. మూడేళ్ల వయసులోనే ‘కళంకిత’ సీరియల్‌లో నటించాను. ‘టక్కరి దొంగ’ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించాను. ఆ పాత్రకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది.
*** మరి మలయాళ రంగంలోకి ఎలా వెళ్లారు?
నటన ధ్యాసలో పడి... చదువుని నిర్లక్ష్యం చేస్తానేమోనని నాన్న భయపడ్డారు. ఇక కొన్నాళ్ల పాటు యాక్టింగ్‌ని ఆపుదామనుకుంటున్న టైమ్‌లో మలయాళ సీరియల్ ‘స్వామి అయ్యప్పన్’కి అవకాశం వచ్చింది. దాన్ని నాన్న కాదనలేకపోయారు. ఆ సీరియల్ ఎంత పేరు తెచ్చిందంటే... మోహన్‌లాల్, పృధ్వీరాజ్, కళాభవన్‌మణి లాంటి తారలు వారి ఇళ్లకు నన్ను పిలిచి అతిథ్యం ఇచ్చేంత. ఓ సారి బీజేపీ వారి సభకు వెళితే, నన్ను చూడటానికే లక్షల్లో జనాలు వచ్చారు. ఆ సభలోనే నన్ను ‘కుట్టి ఎన్టీఆర్’ అని సంబోధించారు అక్కడి నాయకులు.
*** అంతటి వ్యక్తితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు మీ నాన్న ఎలా ఫీలయ్యారు?
నాన్న నాకు గొప్ప క్రిటిక్. ఆయనకు పొగడ్తలంటే గిట్టవు. అందుకే స్పందించలేదు. అమ్మ మాత్రం ఆనందంతో ఏడ్చేసింది.
*** మలయాళంలో ఇంకా ఏమేం చేశారు?
‘లక్కీ జోకర్’లో కృష్ణుడిగా చేశాను. అందులో ఏసుదాస్‌గారి పాటకు అభినయించే ఛాన్స్ దక్కింది. ‘నాదబ్రహ్మం’ సినిమాలో మృదంగ కళాకారునిగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ద్విపాత్రాభినయం చేశాను. ‘స్టడీటూర్’ అనే సినిమా చేశాను. అది త్వరలో విడుదల కానుంది. అంతేకాక మలయాళ మనోరమా వారి ఫీచర్ ఫిలిమ్ ‘రామాయణం’లో రాముడిగా, ‘గురువాయురప్పన్’ సీరియల్‌లో కృష్ణుడిగా చేశాను.
*** ప్రస్తుతం హీరోగా ఎదగాలంటే.. ఇలా పద్దతిగా వెళ్తే కుదరదు. తెరపై అన్ని కళలూ చూపించాలి కదా?
మీరన్నది అర్థమైంది. నటనతోపాటు నేను జిమ్నాస్టిక్స్, తైక్వాండోలో శిక్షణ తీసుకున్నాను. అన్ని రకాల డాన్సులూ చేయగలను. ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగలననే నమ్మకం నాకుంది. త్వరలోనే ఓ ప్రముఖ దర్శకునితో ఓ మంచి మాస్ చిత్రంలో నటించబోతున్నాను.
*** మళ్లీ... మైథలాజికల్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారు?
ప్రస్తుతానికి లేనట్టే. రాఘవేంద్రరావు, భారవిలాంటి పెద్దలు అడిగితే మాత్రం చేస్తా. ఎవరికి పడితే వాళ్లకు చేయను.
Advertisement
Advertisement