‘ఆదిశంకర’ తీయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం - దాసరి నారాయణరావు
‘ఆదిశంకర’ తీయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం - దాసరి నారాయణరావు
Published Tue, Aug 20 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
‘శంకరాభరణం’ విడుదలైన సమయంలో ‘ఆదిశంకర’ విడుదలైనట్లయితే... ఇదీ ‘శంకరాభరణం’ అంతటి సినిమా అయ్యుండేది’’ అని డా.దాసరి నారాయణరావు అన్నారు. కౌశిక్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. జేకే భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ చిత్రం విజయోత్సవ సభ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి మాట్లాడుతూ -‘‘తాత-మనవడు, స్వర్గం-నరకం, శంకరాభరణం, సీతారామయ్యగారి మనవరాలు చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే విడుదలయ్యేవే కావు. ఒకవేళ విడుదలైనా వారానికి మించి ఆడేవీ కావు. అసలు అలాంటి సినిమాలు రాకపోతే... నాలాంటి దర్శకులు వచ్చేవారే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మంచి సినిమా విడుదలై ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా విజయఢంకా మోగించడం హర్షణీయం.
ఫైట్లు, పాటలు, నాలుగు బూతు డైలాగులు ఉంటేనే జనాలు సినిమాలు చూస్తారని అనుకుంటున్న టైమ్‌లో ‘ఆదిశంకర’ లాంటి సినిమాను తీయాలనే ఆలోచన భారవి, జయశ్రీదేవిలకు రావడమే గొప్ప విషయం. కేరళలో కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత భారవి నన్ను కలిసి, ‘గురువుగారూ ఈ కథను మీరే డెరైక్ట్ చేయండి’ అన్నాడు. ‘ఒకరు కొబ్బరికాయ్ కొట్టిన సినిమాను టేకప్ చేయడం నా కెరీర్‌లో జరగలేదు. నువ్వు షూటింగ్‌కి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా చేసేవాణ్ణి’ అన్నాను. ఇది అంత గొప్ప కథ. ఏటికి ఎదురీది తను ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. అద్భుతంగా తీశాడు కూడా.
ఇప్పుడున్న దర్శకులు ఈ సినిమా తీయాలంటే కచ్చితంగా 80, 90 కోట్లు అవుతుంది. కానీ ఎక్కడా బడ్జెట్ పెరగకుండా, తన లిమిటేషన్‌లో భారీగానే తీశాడు భారవి. కౌశిక్‌బాబు ‘ఆదిశంకరుడు’గా విజృంభించాడని చెప్పాలి. నాగ్‌శ్రీవత్స సంగీతం అయితే అద్భుతం’’ అన్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు భారవి కృతజ్ఞతలు చెప్పారు. ఖండాంతరాల్లో కూడా విజయం సాధించింది కాబట్టే ఈ చిత్రాన్ని అఖండ విజయం అంటున్నారని నారా జయశ్రీదేవి అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు ఎన్.శంకర్ కూడా మాట్లాడారు.
Advertisement