kaushik babu
-
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
కృష్ణదేవరాయల హారం కహానీ
కౌశిక్ బాబు, వరుణ్ సందేశ్, వితికా షేరు, షీనా (బిందాస్ ఫేమ్) ప్రధాన తారలుగా రూపొందిన సినిమా ‘రాయల హారం’. కర్రి బాలాజీ దర్శకత్వంలో శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై జి.ఎల్.బి శ్రీనివాస్–నూకల లక్ష్మణ సంతోష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి ఓ హారం ప్రధానాంశంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యమిస్తూ వినోదాన్ని మేళవించాం. కృష్ణదేవరాయలుగా కౌశిక్ బాబు పాత్ర అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ముక్తార్ ఖాన్, ధనరాజ్, ఫిష్ వెంకట్, చక్రవర్తి తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: కర్ణ, సంగీతం: శ్రీవత్స–మీనాక్షీ–నాగరాజు–ప్రణవ్, సమర్పణ: ఎం.ఏ.చౌదరి. -
'రాయల హారం' మూవీ స్టిల్స్
-
దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సీత ఐయామ్ నాట్ వర్జిన్ షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబు.. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని సీసీఎస్ డీసీపీ మహంతికి ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. సీత ఐయామ్ నాట్ వర్జిన్ టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది. హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్ పెట్టారని మేడ్చల్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత నీరజ్నాయుడు, దర్శకుడు కైశిక్ బాబులతో పాటు నటీనటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
దొంగ... పోలీస్ అయితే!
తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు విడిచిన పోలీస్ సిద్ధయ్య జీవిత కథ నేపథ్యంలో తెర కెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ కె’. కౌశిక్ బాబు, ఆర్తి జంటగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేశ్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యథార్థ సంఘటనల నేపథ్యంలో క్రైం కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ‘‘పోలీస్ డ్రస్ వేసుకుని తిరిగే దొంగ కథ ఇది. తర్వాత ఆ దొంగే పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పోలీసు సిద్ధయ్య పాత్రను పోసాని కృష్ణమురళి పోషిస్తున్నారు’’ అని కౌశిక్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శారదా విజయబాబు, మాటలు: మోహన్ దీక్షిత్. -
పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకుంటా!
‘‘చిన్నతనం నుంచి కమల్‌హాసన్ అంటే చాలా ఇష్టం. ఆయన తరహాలో వైవిధ్యమైన కథలు చేసుకుంటూ వెళుతున్నా. ఇప్పుడు నేను చేస్తున్న ‘మిస్టర్ కె’ కూడా విభిన్నమైన కథాకథనాలతో ఉంటుంది’’ అని హీరో కౌశిక్ బాబు అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సంద ర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘అయ్యప్పగా, రామునిగా, కృష్ణునిగా, విష్ణుమూర్తిగా, శివునిగా చేశాను. ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించడం వల్ల అలాంటి వాటికే సెట్ అవుతాడని పేరొచ్చింది. అందుకే నటనలో వైవిధ్యం చూపించడానికి ఈ సినిమా చేస్తున్నా. ఇందులో లవ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాలా షేడ్స్ ఉన్న పాత్ర చేసి పూర్తి స్థాయి కథానాయకునిగా నన్ను ఆవిష్కరించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు. -
వంశీ చిత్రంలా..!
కౌశిక్‌బాబు, హరీష్, అశ్విని, మిత్ర ముఖ్య తారలుగా వై.ఎల్. భాస్కరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. డి. మోహన్ దీక్షిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ - ‘‘వంశీ, మెహర్ రమేష్గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ వంశీగారి చిత్రాల తరహాలో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకి కథే బలం. ఓ అందమైన కవితలాంటి సినిమా ఇది. తూర్చు గోదావరి జిల్లాలోని ఇప్పటివరకు ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాల్లో చేశాం. మరో ఆరు రోజులు జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. పాటలను, సినిమాను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘కృష్ణంరాజుగారి ‘రంగూన్ రౌడీ’లోని ‘ఓ జాబిలి...’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాం’’ అని కౌశిక్ తెలిపారు. -
తొలి సంధ్య వేళలో మూవీ స్టిల్స్
-
‘తొలి సంధ్య వేళలో’ స్టిల్స్
-
‘ఆదిశంకర’ తీయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం - దాసరి నారాయణరావు
‘శంకరాభరణం’ విడుదలైన సమయంలో ‘ఆదిశంకర’ విడుదలైనట్లయితే... ఇదీ ‘శంకరాభరణం’ అంతటి సినిమా అయ్యుండేది’’ అని డా.దాసరి నారాయణరావు అన్నారు. కౌశిక్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. జేకే భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ చిత్రం విజయోత్సవ సభ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి మాట్లాడుతూ -‘‘తాత-మనవడు, స్వర్గం-నరకం, శంకరాభరణం, సీతారామయ్యగారి మనవరాలు చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే విడుదలయ్యేవే కావు. ఒకవేళ విడుదలైనా వారానికి మించి ఆడేవీ కావు. అసలు అలాంటి సినిమాలు రాకపోతే... నాలాంటి దర్శకులు వచ్చేవారే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మంచి సినిమా విడుదలై ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా విజయఢంకా మోగించడం హర్షణీయం. ఫైట్లు, పాటలు, నాలుగు బూతు డైలాగులు ఉంటేనే జనాలు సినిమాలు చూస్తారని అనుకుంటున్న టైమ్‌లో ‘ఆదిశంకర’ లాంటి సినిమాను తీయాలనే ఆలోచన భారవి, జయశ్రీదేవిలకు రావడమే గొప్ప విషయం. కేరళలో కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత భారవి నన్ను కలిసి, ‘గురువుగారూ ఈ కథను మీరే డెరైక్ట్ చేయండి’ అన్నాడు. ‘ఒకరు కొబ్బరికాయ్ కొట్టిన సినిమాను టేకప్ చేయడం నా కెరీర్లో జరగలేదు. నువ్వు షూటింగ్‌కి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా చేసేవాణ్ణి’ అన్నాను. ఇది అంత గొప్ప కథ. ఏటికి ఎదురీది తను ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. అద్భుతంగా తీశాడు కూడా. ఇప్పుడున్న దర్శకులు ఈ సినిమా తీయాలంటే కచ్చితంగా 80, 90 కోట్లు అవుతుంది. కానీ ఎక్కడా బడ్జెట్ పెరగకుండా, తన లిమిటేషన్‌లో భారీగానే తీశాడు భారవి. కౌశిక్‌బాబు ‘ఆదిశంకరుడు’గా విజృంభించాడని చెప్పాలి. నాగ్‌శ్రీవత్స సంగీతం అయితే అద్భుతం’’ అన్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు భారవి కృతజ్ఞతలు చెప్పారు. ఖండాంతరాల్లో కూడా విజయం సాధించింది కాబట్టే ఈ చిత్రాన్ని అఖండ విజయం అంటున్నారని నారా జయశ్రీదేవి అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు ఎన్.శంకర్ కూడా మాట్లాడారు. -
ఆదిశంకర సినిమాకి నాకోసం రెండేళ్లు ఆగారు! : కౌశిక్‌బాబు
అంతకు ముందు పలు సినిమాలు, సీరియల్స్ చేసినా... ప్రేక్షకులకు కౌశిక్‌బాబు బాగా రీచ్ అయ్యింది మాత్రం ఇటీవల విడుదలైన ‘జగద్గురు ఆదిశంకర’తోనే. అయితే... కేరళనాట మాత్రం ‘కుట్టి ఎన్టీఆర్’ అనే బిరుదును అతను ఎప్పుడో కొట్టేశాడు. అయ్యప్పగా, రాముడిగా, కృష్ణుడిగా పలు పౌరాణిక పాత్రలు చేసి, నూనూగు మీసాల వయసులో అక్కడ నూరేళ్లు గుర్తుంచుకోదగ్గ ఇమేజ్‌ని సంపాదించాడు. అంటే.. రచ్చ గెలిచేసి... ఇప్పుడు ఇంట గెలిచే పనిలో ఉన్నాడన్నమాట. ప్రస్తుతం జగద్గురుడిగా జనాల ముందుకొచ్చిన ఈ చిచ్చరపిడుగుతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... *** హీరోలందరూ మాస్ ఇమేజ్ వైపు చూస్తుంటే.. మీరేంటి భక్తి అంటున్నారు? ఈ మధ్య కాలంలో చాలామంది నాతో ఇదే మాటన్నారు. కొందరైతే.. ఈ భక్తి సినిమాలేంటని హేళనగా మాట్లాడారు. వారందరూ ఇప్పుడు ‘ఆదిశంకర’ చూసి షాక్. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవ్వడం చూసి వాళ్ల నోటి వెంట మాట రావడంలేదు. మామూలుగా భక్తి సినిమా అంటే ఓపెనింగ్స్ ఉండవు. పెద్ద హీరోలు చేసే సినిమాలు తప్ప. కానీ నా సినిమాక్కూడా ఇంత ఓపెనింగ్స్ రావడం నిజంగా గొప్ప విషయం. *** ఆదిశంకర పాత్రకు భారవి అడిగినప్పుడు మీ ఫీలింగ్? నాలుగేళ్ల క్రితం ఆయన ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు చిన్నవాణ్ణి. రెండేళ్ళ తర్వాత ఈ కుర్రాడితో తీస్తే బావుంటుందని కె.రాఘవేంద్రరావు అన్నారు. ఆయన మాట ప్రకారం నా కోసం రెండేళ్లు ఆగి, ఫిజికల్‌గా నేను కాస్త తయారయ్యాక అప్పుడు షూటింగ్‌కి వెళ్లారు భారవి. కానీ ఈ సినిమా షూటింగే రెండేళ్లు జరిగింది. దాంతో.. నా శరీరంలో ఏ మార్పూ రాకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఎంతో శ్రమకోర్చి చేసిన పాత్ర ఇది. *** మిమ్మల్ని హీరోని చేయాలని మీ నాన్నగారికి ముందునుంచీ ఉండేదా? లేదు. మా నాన్నగారు విజయబాబు సాహిత్యాభిమాని. దేశాన్నీ, కళలను ప్రేమిస్తారాయన. అందుకే సాహిత్యం చదవడం నా చిన్నతనం నుంచీ ఆలవాటు చేశారు. ఆ వయసులోనే యువతరాన్ని చైతన్యపరిచే విధంగా ఢిల్లీలో వేలాదిమంది ముందు వివేకానందుని ప్రవచాలు వల్లెవేశాను. ఇప్పటికీ శోభానాయుడుగారి వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్టీఆర్ సినిమాలను బాగా చూడమనేవారు నాన్న. డైలాగ్ అంటే ఆయనలా నాభి నుంచి పలకాలని చెబుతూ ఉండేవారు. మూడేళ్ల వయసులోనే ‘కళంకిత’ సీరియల్లో నటించాను. ‘టక్కరి దొంగ’ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించాను. ఆ పాత్రకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది. *** మరి మలయాళ రంగంలోకి ఎలా వెళ్లారు? నటన ధ్యాసలో పడి... చదువుని నిర్లక్ష్యం చేస్తానేమోనని నాన్న భయపడ్డారు. ఇక కొన్నాళ్ల పాటు యాక్టింగ్‌ని ఆపుదామనుకుంటున్న టైమ్‌లో మలయాళ సీరియల్ ‘స్వామి అయ్యప్పన్’కి అవకాశం వచ్చింది. దాన్ని నాన్న కాదనలేకపోయారు. ఆ సీరియల్ ఎంత పేరు తెచ్చిందంటే... మోహన్‌లాల్, పృధ్వీరాజ్, కళాభవన్మణి లాంటి తారలు వారి ఇళ్లకు నన్ను పిలిచి అతిథ్యం ఇచ్చేంత. ఓ సారి బీజేపీ వారి సభకు వెళితే, నన్ను చూడటానికే లక్షల్లో జనాలు వచ్చారు. ఆ సభలోనే నన్ను ‘కుట్టి ఎన్టీఆర్’ అని సంబోధించారు అక్కడి నాయకులు. *** అంతటి వ్యక్తితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు మీ నాన్న ఎలా ఫీలయ్యారు? నాన్న నాకు గొప్ప క్రిటిక్. ఆయనకు పొగడ్తలంటే గిట్టవు. అందుకే స్పందించలేదు. అమ్మ మాత్రం ఆనందంతో ఏడ్చేసింది. *** మలయాళంలో ఇంకా ఏమేం చేశారు? ‘లక్కీ జోకర్’లో కృష్ణుడిగా చేశాను. అందులో ఏసుదాస్‌గారి పాటకు అభినయించే ఛాన్స్ దక్కింది. ‘నాదబ్రహ్మం’ సినిమాలో మృదంగ కళాకారునిగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ద్విపాత్రాభినయం చేశాను. ‘స్టడీటూర్’ అనే సినిమా చేశాను. అది త్వరలో విడుదల కానుంది. అంతేకాక మలయాళ మనోరమా వారి ఫీచర్ ఫిలిమ్ ‘రామాయణం’లో రాముడిగా, ‘గురువాయురప్పన్’ సీరియల్లో కృష్ణుడిగా చేశాను. *** ప్రస్తుతం హీరోగా ఎదగాలంటే.. ఇలా పద్దతిగా వెళ్తే కుదరదు. తెరపై అన్ని కళలూ చూపించాలి కదా? మీరన్నది అర్థమైంది. నటనతోపాటు నేను జిమ్నాస్టిక్స్, తైక్వాండోలో శిక్షణ తీసుకున్నాను. అన్ని రకాల డాన్సులూ చేయగలను. ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగలననే నమ్మకం నాకుంది. త్వరలోనే ఓ ప్రముఖ దర్శకునితో ఓ మంచి మాస్ చిత్రంలో నటించబోతున్నాను. *** మళ్లీ... మైథలాజికల్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారు? ప్రస్తుతానికి లేనట్టే. రాఘవేంద్రరావు, భారవిలాంటి పెద్దలు అడిగితే మాత్రం చేస్తా. ఎవరికి పడితే వాళ్లకు చేయను.