ఆహారం విలువేంటో తెలియాలని...
వీక్షణం
హోటల్‌కి వెళ్తాం. కావలసినంత తింటాం. మిగిలింది వదిలేసి వస్తాం. ఇంట్లో వంట చేసుకుంటాం. నచ్చినంత తింటాం. మిగిలింది పారేస్తాం. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వృథా చేసే ఆహారమెంతో అందరికీ తెలుసు. కానీ ఎవరూ పట్టించుకోరు.
బాప్టిస్ట్ డ్యూబన్‌షెట్ కూడా పట్టించుకోకుండా ఉండవచ్చు. కానీ అతడలా చేయలేదు. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక, ఆకలితో అల్లాడి మరణిస్తుంటే... ఇలా ఫుడ్‌ని వేస్ట్ చేయడమేంటి అని ఆవేదన చెందాడు. ఆహారం విలువేంటో తెలియజేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు అతడు చేసిన పని గురించి తెలిస్తే షాక్ తింటారు ఎవరైనా.
ఫ్రాన్‌సకు చెందిన పాతికేళ్ల యుకువడు బాప్టిస్ట్... ప్యారిస్ నుంచి వార్సా వరకూ సైకిల్ యాత్ర చేపట్టాడు. అంటే అతడు ప్రయాణించాల్సిన దూరం మూడు వేల కిలోమీటర్ల పైనే. రోజుకు అరవై కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ పోతున్నాడు. అయితే తనతో ఎలాంటి ఆహారం తీసుకుని పోలేదు. మరి ఏం తింటాడు అనేగా? ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఆగుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఏవైనా డస్ట్‌బిన్‌స ఉన్నాయేమో చూస్తున్నాడు. వాటిలో వృథాగా పారేసిన ఆహార పదార్థాల్ని తీసుకుని తింటున్నాడు.
మొదట అతణ్ని చూసి కొందరు అసహ్యించుకున్నారు. కానీ అతడు ‘మీరు పారేసేది మరొకరి కడుపు నింపుతుంది’ అని తెలియజేయడానికే అలా చేస్తున్నాడని తెలిసి విస్మయం చెందారు. కొందరైతే ఇంకెప్పుడూ ఆహారం పారేయమని మాటిచ్చారు కూడా. చూస్తుంటే బాప్టిస్ట్ ప్రయత్నం ఫలించేట్టుగానే ఉంది.