తెలిసిన మనిషి | Known to man | Sakshi
Sakshi News home page

తెలిసిన మనిషి

Published Thu, Apr 2 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

తెలిసిన మనిషి

తెలిసిన మనిషి

సునీత తోమర్
 

॥పేరు సునీత. వయసు 27. భర్త, ఇద్దరు పిల్లలు. పొగాకు నమిలే అలవాటు వల్ల రెండేళ్ల వ్యవధిలోనే ఆమెకు నోటి క్యాన్సర్ వచ్చింది. ఆమె ముఖం చూడలేని విధంగా మారిపోయింది.  వైద్యులు ఆపరేషన్ చేసి సునీత చెంప లోపలి క్యాన్సర్ కణితిని తొలగించారు. తిరిగి మునుపటి రూపురేఖల్ని తేగలిగారు. సునీత ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. మీకూ పొగాకు నమిలే అలవాటు ఉంటే కనుక వెంటనే మానండి. క్యాన్సర్ బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ॥
 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గత ఏడాది కాలంగా ప్రసారం చేస్తూ వస్తున్న ముప్పై సెకన్ల నిడివి గల ప్రజాహిత ప్రకటన ఇది. అందులోని సునీత ఇప్పుడు లేరు. బుధవారం చనిపోయారు! అంతకు రెండ్రోజుల క్రితమే ఆమె.. ప్రధాని నరేంద్ర మోదీకి ఒక ఉత్తరం రాశారు. ‘‘పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వస్తుందని భారతదేశంలో జరిగిన ఏ శాస్త్ర పరిశోధనా ఇంతవరకు నిరూపించలేదు’’ అని గౌరవనీయులైన బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ అనడంపై సునీత ఆ ఉత్తరంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ముఖం కంటే వేరే పరిశోధనా ఫలితం కావాలా?’’ అని కూడా అడిగారు. పొగాకు ఉత్పత్తులపై విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి దిలీప్ గాంధీ అధ్యక్షుడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడడం సునీతకు బాధ కలిగించింది. అందుకే ఆ ఉత్తరం.
 సిగరెట్ ప్యాకెట్లపై ప్రభుత్వ ఆదేశానుసారం ఉత్పత్తిదారులు ప్రస్తుతం ముద్రిస్తున్న హెచ్చరిక చిత్రాల సైజును ఈ ఏప్రిల్ ఒకటి నుంచి కనీసం ఎనభై ఐదు శాతం వరకైనా పెంచాల్సి ఉండగా, అలాంటి అవసరమేమీ లేదని దిలీప్ గాంధీ తేల్చేశారు. ఆ సందర్భంలోనే పొగాకు వాడకానికి, క్యాన్సర్ రావడానికి సంబంధం లేనే లేదని కూడా ఆయన అన్నారు!

సునీత సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని భింద్. ఆమె భర్త ట్రక్కు డైవర్. క్యాన్సర్ తిరగబెట్టడంతో రెండు వారాల క్రితం ఆమెను మళ్లీ ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి కొంత మెరుగైంది. పిల్లల్ని (ధ్రువ్, కులదీప్) స్కూలుకు పంపడానికి ఇంట్లో ఎవరూ లేరని అడిగిమరీ సునీత డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత కొన్ని గంటలకే ఆమె చనిపోయారు.

నోటి క్యాన్సర్‌తో సునీత మరణించడం, పొగాకు ఉత్పత్తులపై క్యాన్సర్ బొమ్మలు కనిపించడం... పొగాకు అలవాటు ఉన్నవారిని ఎంతవరకు మారుస్తాయో చెప్పలేం. కానీ సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన నాయకుల ప్రతి చిన్నమాటా సమాజంపై క్యాన్సర్‌కు ఏ విధంగానూ తక్కువ కానంతగా ప్రభావం చూపుతుందని ఆ పెద్ద మనుషులకు ఎవరు చెప్పాలి?

గిరిరాజ్‌సింగ్ కేంద్ర మంత్రి. అంతటి మనిషి ఏమన్నారో విన్నారు కదా! రాజీవ్‌గాంధీ కనుక నైజీరియా మహిళను చేసుకుని వస్తే, ఆమె తెల్లగా లేకపోతే.. కాంగ్రెస్ వాళ్లు ఆమె నాయకత్వాన్ని అంగీకరించేవారా? అని. ఇంకొకాయన గోవా సీయెం లక్ష్మీకాంత్ పర్సేకర్. నర్సులు నిరాహార దీక్షలు చేస్తుంటే, వాళ్ల సమస్యల్ని పట్టించుకోకుండా... ‘‘ఎండలో కూర్చుంటే నల్లబడిపోతారు, తర్వాత పెళ్లి కావడం కష్టం’’ అని పాపం ఆయన ఎంతగానో బాధపడిపోయారు.

జేడీ(యు) ఎంపీ శరద్ యాదవ్ అబ్జర్వేషన్ మరోలా ఉంది. ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీ తీసిన దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ తెల్లగా ఉండబట్టే ఆమెకు ఇంటర్వ్యూ తేలిగ్గా దొరికిందట. అంతే కాదట. తెల్లగా ఉన్న ఆడవాళ్లకు అవకాశాలు వరదలా వచ్చేస్తాయట!
 ఈ ముగ్గురు ‘తెల్లదనం ప్రియులు’ చేసిన కామెంట్లు, అత్యాచారాలకు ఆడవాళ్లనే బాధ్యులను చేస్తూ తరచు మనకు వినిపించే మహానుభావుల వ్యాఖ్యానాలు కూడా క్యాన్సర్ లాంటివే. కాకపోతే అవి నోటి క్యాన్సర్లు కావు. మాట క్యాన్సర్లు. నోటి క్యాన్సర్ ఒక్కరి వరకే ఉంటుంది. మాట కేన్సర్ సమాజం మొత్తానికీ ప్రబలుతుంది.

‘‘నాలాగా అవుతారు జాగ్రత్త’’ అని సునీత భయం చెప్పి వెళ్లారు. ‘‘ఏమీ కాదు’’ అని దిలీప్ గాంధీ భరోసా ఇస్తున్నారు! నిజానికి ‘భయం’ మాత్రమే ఏమీ కానివ్వదు. భరోసా డేంజర్. మంచీచెడును ఆలోచించనివ్వదు.
 
 మాధవ్ శింగరాజు

 
పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికను పెద్ద సైజులో ముద్రించాలని ఉద్యమించిన సునీతా తోమర్, అందుకు గడువు తేదీ అయిన ఏప్రిల్ 1న ప్రభుత్వం ఆ డిమాండును తిరస్కరించిన రోజే మరణించడం యాదృచ్ఛ్చికమే అయినప్పటికీ అత్యంత బాధాకరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement