చివరి క్షణాలు
ఆకలి... మనిషికి అతి పెద్ద శత్రువు. గుప్పెడు మెతుకులు లేక పేగులు మెలిపడుతుంటే... కలిగే బాధ కన్నీరుగా కనుల జారుతుంటే... బతుకు మీద ఆశ అడుగంటిపోతుంది. ఇలాంటి జన్మనిచ్చినందుకు భగవంతుడి మీద సైతం కోపం వస్తుంది. ఎనభైల్లో ఇథియోపియా ప్రజల పరిస్థితి అదే!
1983 నుంచి 85 వరకు ఇథియోపియాలో దారుణమైన కరవు కమ్ముకుంది. ఆకలి మంటలకు నాలుగు లక్షల మంది జీవితాలు ఆహుతైపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు. అభాగ్యుల ఆక్రందనలు. వీధుల నిండా శవాల గుట్టలు. వాటిని పీక్కు తినడానికి వచ్చిన రాబందుల రెక్కల చప్పుళ్లు. అంతా భయానకం... బీభత్సం... బాధాకరం... హృదయ విదారకం!
పెద్దవాళ్లే ఆకలికి తాళలేక అలమటిస్తుంటే... ఇక పసివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది! డొక్కలు ఎండిపోయి, చర్మాలు అతుక్కుపోయి, ఎముకల గూళ్లలా ఉన్న బిడ్డలను చూసి కన్నవాళ్ల మనసులు కుంగిపోయేవి. కళ్లముందే బిడ్డలు నిర్జీవంగా రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూండి పోవడం తప్ప ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డని కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన తపనకు సాక్ష్యమే ఈ చిత్రం.
ఆ దారుణ కరవును తరిమి కొట్టలేకపోయినా... కొందరి ప్రాణాలనైనా నిలబెట్టాలన్న ఆశతో కొన్ని ఎన్జీవోలు ఆహా రంతో అక్కడకు చేరుకున్నారు. వారు జావను ఇవ్వగానే ఓ తండ్రి... చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు గబగబా దాన్ని తాగించసాగాడు. ‘తాగు నాన్నా తాగు’ అంటూ కొడుకును బతికించుకోవాలని తపన పడ్డాడు. అప్పుడే ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్ ఈ ఫొటో తీశాడు. కానీ దురదృష్టం... తర్వాతి రోజు రాత్రే ఆ చిన్నారి కన్నుమూశాడు. అతడు పోయినా... అతడి చివరి క్షణాలను ఈ ఫొటో తనలో దాచుకుంది. నాటి దారుణ స్థితిని ప్రపంచానికి పదే పదే గుర్తు చేస్తూనే ఉంది!