నేతలో ఒక్క పువ్వు కనపడదు కానీ, వస్త్రం అంతా వికసిస్తుంది. చేనేత అందమే అది. సృష్టినే ప్రతిబింబిస్తుంది. మన పిల్లలు చేనేతలు వేసుకుంటే మన సంస్కృతి అద్దమైపోతుంది. పువ్వులా వికసించే హ్యాండ్లూమ్‌ని హ్యాండ్‌బ్లూమ్ అనక తప్పదు. చేనేతకారుడి చేతిలో వికసించిన చమత్కారమే హ్యాండ్లూమ్!
వేసవి వేడుకలలో అకర్షణీయంగా కనిపించాలంటే చేనేత దుస్తులు సరైన ఎంపిక. కాటన్ లేదా టస్సర్ క్లాత్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేసి లెహంగాని రూపొందించాలి. దుపట్టాగా కూడా హ్యాండ్లూమ్ మెటీరి యల్ నే ఉపయోగించాలి. దీనిపైన పువ్వులు, లతలతో అందమైన ఎంబ్రాయిడరీని తీర్చిదిద్దాలి.
⇒ చేనేత ఒంటికి హాయినిస్తుంది. ఇంపైన రంగులతో ఆకట్టుకుంటుంది. లేత గులాబీ రంగు లెహంగాకు బంతిపువ్వు రంగు అంచు ఆకర్షణీయంగా ఇమిడిపోయింది. లెహంగా డిజైన్ ప్లెయిన్‌గా రావడంతో పువ్వుల ఎంబ్రాయిడరీ చేసిన చైనీస్ కాలర్ నెక్ బ్లౌజ్ అందంగా రూపుకట్టింది.
⇒ లేత పసుపు రంగు హ్యాండ్లూమ్ మెటీరియల్ పైన స్వరోస్కి, జర్దోసి ఎంబ్రాయిడరీ మెరిపించడంతో ఈ లెహంగా చూపుతిప్పుకోనివ్వని అందాన్ని అద్దుకుంది.
⇒ పోచంపల్లి ఇక్కత్ చేనేతను ఈ లెహంగాకు ఉపయోగించడంతో ఆకర్షణీయత పెరిగింది. దీనికి అంచుగా స్వరోస్కి వర్క్ చేసిన పసుపు రంగు క్లాత్‌ను జత చేయడంతో లుక్ పూర్తిగా మారిపోయింది. అంచురంగు డిజైనర్ బ్లౌజ్ దీని మీదకు ధరిస్తే చాలు వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
⇒ లేత సాదా రంగు లెహంగా పై ఎంబ్రాయిడరీ సొగసుగా కనిపిస్తోంది. దీనికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ కుచ్చుల అంచు జత చేసి, అదే రంగు దుపట్టా, డిజైనర్ బ్లౌజ్‌ను ధరించాలి.
⇒ ప్లెయిన్ లాంగ్ గౌన్‌కి ఐదు వరసలుగా కుచ్చులు, డిజైనర్ ఓవర్ కోట్ జత చేయడంతో డ్రెస్‌కి ఇండో వెస్ట్రన్ లుక్ వచ్చింది.
⇒ డిజైనర్ అంచును జత చేయడంతో ప్లెయిన్ లెహంగా రూపు ఆకర్షణీయంగా మారింది. దుపట్టా, డిజైనర్ బ్లౌజ్‌తో వేడుకలో హైలైట్‌గా నిలవచ్చు.
రసాయనాలు లేని రంగులు...
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పటికీ మొదట్లో బంధుమిత్రులకే డ్రెస్ డిజైనింగ్ చేసేదాన్ని. నాలుగేళ్ల క్రితం చేనేతకారులను కలిసినప్పుడు నా వర్క్ నుంచి వీరికి ఉపాధి కల్పించాలని ఆలోచించాను. అప్పుడే డిజైనింగ్‌ని వృత్తిగా ఎంచుకున్నాను. ఆదిలాబాద్‌లోని గిరిజనులు సేకరించే కొండపత్తిని కొనుగోలు చేసి, అక్కడి గ్రామాలలోనే చరఖాల మీద దారం తీయించి, చేనేత కారులచే క్లాత్‌ను నేయిస్తుంటాను. క్లాత్ తయారీలో రసాయనాలు లేని నేచురల్ కలర్స్‌ను మాత్రమే ఉపయోగిస్తుంటాను. ఈ హ్యాండ్లూమ్స్‌ని ఉపయోగించడం వల్ల ఎన్నో ఫ్యాషన్ వేదికల మీద నా డిజైన్స్ వెలిగిపోయాయి. కాలానుగుణమైన థీమ్, మన సంస్కృతి డ్రెస్ డిజైన్స్‌లో ఉపయోగించడం ప్రత్యేకతను చాటుతోంది. ఈ ఏడాది ముంబయ్‌లో జరిగిన స్ప్రింగ్ సమ్మర్ లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో హ్యాండ్లూమ్‌తో చేసిన డిజైన్‌లు నన్ను ముందువరసలో నిలబెట్టాయి.
– దివ్యారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
www.facebook.com/Divyareddydesigns
హ్యాండ్ బ్లూమ్
Published Thu, Apr 27 2017 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement