ఈ లోకంలో దొరికే సమస్త పదార్థాలన్నింటినీ తిని హారాయించుకునే ఏకైక జీవులు బొద్దింకలు. అవి ఎంతకూ అంతరించిపోవట. అందుకే... అణుయుద్ధం సంభవించి జీవజాతులన్నీ అంతరించిపోయినా బొద్దింకలు బతికే ఉంటాయని ఒక అంచనా. అంతేకాదు... బొద్దింక తలను తొలగించినా... అది తొమ్మిది రోజులు బతుకుతుంది. చివరికి మెదడు లేనందకవి మరణించవు గానీ... తల లేకపోవడంతో ఆహారం అందని కారణంగానే అవి చనిపోతాయట.
అంతటి పవర్‌ఫుల్ బొద్దింకలు పెరిగే ప్రధాన ప్రదేశాలు మన వంటిళ్లు. ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింకలకు మినహాయింపు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఈ బొద్దింకలనుంచి ఆరోగ్యాలకు వచ్చే ప్రమాదలేవీ వెనువెంటనే రావు. కానీ మన వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ అవి కలుషితం చేస్తాయి. ప్రధానంగా రాత్రిపూట మనం వంటింట్లోకి వెళ్లినప్పుడు మనం దాచిన ఆహారపదార్థాలపై అవి స్వైరవిహారం చేస్తూ కనిపిస్తాయి. మళ్లీ పగటిపూట అవి ఎక్కడిదొంగలు అక్కడేలా గప్‌చిప్‌గా ఉండిపోతాయి.
క్రితం రాత్రి సైలెంట్‌గా సంచరించిన ఆ బొద్దింకల ప్రభావం కారణంగా మనకు నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వటితో మనకు వచ్చే మరో అనర్థం ఏమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి ఆస్తమా, అలర్జీ రోగులు తమ ఇళ్లలో బొద్దింకల నుంచి వచ్చే ప్రమాదాలను రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
మరి బొద్దింకల నుంచి రక్షించుకోవడం ఎలా?
బొద్దింకలను తుదముట్టించడానికి మార్కెట్‌లో దొరికే విషపదార్థాలున్న ద్రావణాలను పిచికారి చేయడం మరింత ప్రమాదం. దాని వల్ల మన కిచెన్‌ను మనమే విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషాల్లో సంచరించిన బొద్దికలు మళ్లీ మన ఆహారాలపై తిరిగితే అది మరల మనకే హాని చేసే అవకాశాలు మరింత ఎక్కువ.
అందుకే మనం తినగా మిగలిగిన ఆహార పదార్థాలను మెష్ ఉండే కప్‌బోర్డుల వంటి సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇక బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు పెద్దగా పెరగవు. బొద్దింకల సంఖ్య తక్కువగా ఉండేలా చూసుకుంటే వాటితో కలిగే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment