ఫ్లిప్ ద స్విచ్ చాలెంజ్‌లో జెన్నిఫర్ లోపేజ్, అలెక్స్ రోడ్రిగేజ్
లాక్‌డౌన్ సమయాన్ని ఆనందంగా మలచుకోవడానికి సోషల్ మీడియాను మించిన ప్లాట్‌ఫామ్ లేదు. జనాలు చేయని ప్రయత్నమూ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఐస్‌బకెట్ చాలెంజ్, ఫ్లిప్ ది స్విచ్ చాలెంజ్, కీకీ చాలెంజ్ నుంచి ఈ మధ్య హల్‌చల్ చేసిన బర్డ్‌బాక్స్ చాలెంజ్, టెన్ ఇయర్స్ చాలెంజ్ వరకు అన్నిటినీ ప్రేరణగా తీసుకొని కొత్త చాలెంజెస్‌ను క్రియేట్ చేసి లాక్‌డౌన్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ‘శారీ చాలెంజ్’, ‘ఓల్డ్ మెమోరీస్ చాలెంజ్’, ‘చైల్డ్‌హుడ్ లేదా ఓల్డ్ ఫ్రెండ్స్ చాలెంజ్’, ‘న్యూ రెసిపీ చాలెంజ్’ అంటూ ఇంట్లో ఉన్న వాళ్లకు టాస్క్‌లు ఇస్తున్నారు. వైరల్ చేసి.. చూస్తున్న వాళ్లకు వినోదం పంచుతున్నారు.
ట్రెడిషనల్ వేర్
ఇందులో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు. సంప్రదాయ కట్టులో ఉన్న తమ ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లో పెడుతూ తనకు నచ్చిన వాళ్లకు ఆ చాలెంజ్‌ను ఇవ్వాలి. స్వీకరించినవాళ్లూ సంప్రదాయవస్త్రధారణతో దిగిన తమ ఫొటోలను స్టేటస్‌లో పెట్టి ఇంకొకరికి చాలెంజ్ విసరాలి. ఇదిలా కొనసాగుతూంటుంది.
ఓల్డ్ మెమోరీస్
ఈ చాలెంజ్ అందరిదీ. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొనే ప్రయత్నం. జీవితంలోని మరిచిపోలేని సందర్భాలు, సంబరాలకు సంబంధించిన ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లో పెట్టి.. తన ఆత్మీయులకూ ఈ చాలెంజ్‌ను ఇవ్వాలి. ఇదీ అంతే... ఓ చైన్‌లా కంటిన్యూ అవుతుంది.
చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్
ఉన్నత చదవులు, ఉద్యోగాల కోసం ఉన్న ఊళ్లను వదిలి ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడిన వాళ్లు ఈ చాలెంజ్‌ను చాలా ఆస్వాదిస్తున్నారు. తమ చిన్ననాటి ఫ్రెండ్స్ లేదా పదేళ్ల కిందటి ఫ్రెండ్స్ ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లో పెట్టి.. ఫ్రెండ్స్‌కు చాలెంజ్ ఇస్తున్నారు.
న్యూ రెసిపీ
ఇది భార్యలు భర్తలకు ఇస్తున్న చాలెంజ్. తమకు వచ్చిన, నచ్చిన వంటను చేయమని భర్తకు పురమాయిస్తున్నారు. అలా అతను వండిన వంటకంతో భర్తను ఫొటో తీసి, ఆ ఫొటోతోపాటు ఆ వంటకం రెసిపీనీ వాట్సప్ స్టేటస్‌లో పెట్టి తన స్నేహితులకు, చుట్టాలకు చాలెంజ్ ఇస్తున్నారు వాళ్లిళ్లలోని మగవాళ్ల చేత కూడా ఏదైన వంటకం వండిచమని. దీనికి మన దేశంలో కన్నా విదేశాల్లో చాలా రెస్పాన్స్ ఉంటోందట. ఈ కుగింక్ చాలెంజ్‌ను మగవాళ్లూ ఇష్టంగానే స్వీకరిస్తున్నారట.
టెన్ ఇయర్స్ చాలెంజ్‌లో సోనమ్ కపూర్, దియా మీర్జా
వీటితోపాటు కొన్ని పాత చాలెంజ్‌లూ కొత్తగా వాట్సప్ స్టేటస్‌లో కనపడుతున్నాయి. కెనడియన్ రాపర్, యాక్టర్ డ్రేక్ పాడిన ‘నోబడి’ పాట అప్పుడెప్పుడో ‘ఫ్లిప్ ది స్విచ్’ చాలెంజ్‌గా మారింది. జెన్నిఫర్ లోపేజ్, బేస్‌బాల్ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగేజ్ లాంటి సెలబ్రిటీలూ ఈ చాలెంజ్‌ను స్వీకరించడంతో వైరల్ అయింది. మన దగ్గరా బాలీవుడ్ సింగర్స్, యాక్టర్స్ ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఈ చాలెంజ్ ఏంటంటే మగవాళ్లు ఆడవాళ్ల డ్రెస్ వేసుకొని ‘నోబడీ’ పాటకు డాన్స్ చేయాలి. అంటే ఆడ,మగ భూమికలు తారుమారవుతాయన్నమాట. అదీ టిక్‌టాక్ వీడియోలోని ఒక టెక్నిక్‌తో. అదిప్పుడు మన దగ్గర మళ్లీ పాపులర్ అయింది. డ్రేక్ ‘నోబడీ’ పాటతో కాకుండా బాలీవుడ్‌లోని హిట్ సాంగ్స్‌తో. అలాగే టెన్ ఇయర్స్ చాలెంజ్ కూడా.
ఇవన్నీ చూస్తున్న పెద్ద తరం ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోవడం లేదు.. లాక్‌డౌన్‌లో ఇంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది అని ఆ తరమూ ఈ చాలెంజెస్‌ను స్వీకరిస్తోంది. యూత్ అయితే చెప్పక్కర్లేదు.. ‘సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీనే దేశానికి చాలెంజెస్ ఇస్తున్నాడు చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని.. అంటే లాక్‌డౌన్‌లో జనాలు మానసికంగా డౌన్ అవకుండా చూడ్డానికే కదా. ఈ చాలెంజెసూ అంతే.. లాక్‌డౌన్ టైమ్‌ను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి’ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment