
పాత సూఫీ కథ ఇది. ‘ఓషో’ రజనీశ్ తన శిష్యులకు తరచూ చెబుతుండేవారు. నేడు ఆయన వర్ధంతి. కథేమిటంటే.. ఒక ఇంట్లో ఒక సంగీత సాధనం ఉండేది. పూర్వీకుల నుండి అది ఆ ఇంట్లో ఉంటోంది. తరాలు మారుతున్నాయి కానీ అది మారడం లేదు. అలాగని ఏ తరమూ దానిని సాధన చేయడం లేదు! అసలు దానిని ఎలా పలికించాలో కూడా ఎవరికీ తెలీదు. పడేయడానికి మనసొప్పక ఓ మూలన పడేసి ఉంచుతున్నారు. అలా ఏళ్లుగా దానిపై దుమ్ము పేరుకుపోయింది. మళ్లీ ఓ కొత్త తరం వచ్చింది. దమ్ము దులుపుతుంటే ఆ సంగీత సాధనం బయటపడింది. ‘ఎవరికీ పనికిరానిది ఇంట్లో ఎందుకు?’ అని బయటికి విసిరిపారేసింది కొత్తతరం.
ఆ సాయంత్రం.. పక్షులు ఇళ్లకు చేరే సమయంలో ఆ కొత్తతరం ఉంటున్న వీధిలో శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ఇళ్లలోని వారంతా బయటికి వచ్చి ఆసక్తిగా చూశారు. ఒక యాచకుని చేతిలోని సంగీత వాద్యం అది. అతడి వేళ్లు ఒడుపుగా రాగాలను పలికిస్తున్నాయి! కొత్తతరం కూడా ఇంటి బయటికి వచ్చి చూసింది. యాచకుని చేతిలోని వాద్యాన్నీ చూసింది. ‘‘ఓయ్.. అది మాది, తరతరాలుగా మా ఇంట్లో ఉంటోంది. మాది మాకు ఇచ్చేయ్’’ అని అడిగింది. అందులో అంత మధురమైన రాగాలు ఉంటాయని ఆ కొత్త తరం ఊహించలేదు.యాచకుడు ఇవ్వలేదు! ‘‘తరాలుగా మీ ఇంట్లో ఉన్నా మీరు దీనిని పలికించలేదు కనుక ఇది మీది కాదు. నేను పలికిస్తున్నాను కాబట్టి ఇప్పుడిది నాది’’ అని, వాద్యంలోంచి లయబద్ధంగా గీతాలను ఒలికించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.
జీవితం కూడా అంతే.. సాధన చేసినంతకాలం మనది. జీవన గమకాలు పలికించినంతకాలం మనది. ఊరికే జీవితాన్ని చేత్తో పట్టుకునో, గూట్లో పెట్టుకునో కాలాన్ని గడిపేస్తుంటే ఆ జీవితం మనదవదు. జీవితంలో కదలిక లేదని, దుమ్ముపట్టిపోయిందనీ మనలో చాలామందిమి నిస్పృహలో పడిపోతుంటాం. నిజానికి అది మన జీవితానికి పట్టిన దుమ్ము కాదు. మన వేళ్లకు పట్టిన దుమ్ము. ఆ దమ్మును వదిలించుకుని జీవితాన్ని పలికించుకోవాలి.
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment