
హాయ్ సార్! నా వయసు 22. నేను కాలేజ్‌లో డిగ్రీ చదివేటప్పుడు నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి చాలా క్లోజ్‌గా ఉండేది. తను నన్ను లవ్ చేస్తుందేమో అనుకున్నా. కాలేజ్ అయిపోయాకా నాకు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది. కాలేజ్ అయిపోయిన వన్ ఇయర్ తరువాత డైలీ మెసేజ్‌లు చెయ్యడం మొదలుపెట్టింది. నేనంటే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడేది. ‘ఎవరినైనా లవ్ చేస్తున్నావా’ అంటూ నా నుంచి విషయం రాబట్టింది. తీరా ‘నిన్నే లవ్ చేస్తున్నా’ అని చెబితే.. ‘నేను అందరితోనూ ఇలానే ఉంటా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు నాది కాదు. పైగా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు’ అంది. మరి ఇంకెందుకు వదిలెయ్యి.. మాట్లాడితే నాకు ఫీలింగ్స్ వస్తాయి అంటే.. ‘నో’ అంటోంది. ‘మాట్లాడు ఫ్రెండ్స్‌లా ఉందాం లవ్ వద్దు ప్లీజ్’ అంటోంది. నేను ఆ అమ్మాయిని లవ్ చెయ్యాలని అనుకోలేదు సార్. అలా జరిగిపోయింది. నాకు నరకంలా ఉంది సార్. అమ్మాయి చాలా మంచిది. తనను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. తననుంచి బయటకి వచ్చే సలహా చెప్పండి సార్ ప్లీజ్. – ప్రసాద్
చాలా కష్టమైన పరిస్థితి ప్రసాద్! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది! ‘నమ్మద్దు ప్రసాద్ ఈయనకు అబ్బాయిల కష్టం చూస్తే ఎప్పుడూ గుండె తరుక్కుపోదు... కదా సార్!?’ మరి ఏమవుతుంది నీలూ..? ‘సార్ అబ్బాయిలు లవ్‌ప్రాబ్లమ్‌లో చిక్కుకుంటే మీ గుండె హ్యాపీగా డాన్స్ చేస్తుంది.. పట్టలేని సంతోషంతో ఆరోజు అరటిపండు కూడా తినరు సార్.. కార్టూన్ నెట్‌వర్క్ చూసినట్టు చూస్తారు సార్ మీరు అబ్బాయిలను... అబ్బాయిలు లవ్ ప్రాబ్లంలో పడితే ముసిముసి నవ్వులు కూడా నవ్వుతూ ఉంటారు సార్ రోజంతా.. ఒక్కోసారి సార్‌కి పిచ్చెక్కిందా అనిపిస్తున్నంత హ్యాపీగా ఉంటారు సార్.. మీరు ఒట్టి శాడిస్ట్ సార్.. అబ్బాయిలు ఎందుకు రాస్తారో నాకు అర్థం కావడం లేదు సార్!?’ ఎందుకు రాస్తారు నీలూ..?
‘దిక్కులేక.. మార్కెట్లో వేరే లవ్ డాక్టర్ ఏడవక!! మీది నడుస్తోంది సార్.. రేపెప్పుడైనా మీ ముందు షాప్‌లో కొత్త లవ్‌డాక్టర్ వస్తే మీరు ఈగలు తోలుకోవాల్సిందే సార్.. అయినా అరటిపండులేకపోతే మిమ్మల్ని ఈగలు కూడా టచ్ చెయ్యవు సార్!’ అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి నీలూ..? ‘ఊరికే ఓవర్ చెయ్యకుండా సింఫుల్‌గా చెప్పండి సార్ ప్రసాద్‌కి!!’ ఫోన్ నెంబర్ మార్చుకో ప్రసాద్!! ‘అంత సింఫుల్‌గానా సార్?’ ఫోన్ నంబర్ మార్చు, ఆ నంబర్ అమ్మాయికి ఇవ్వకు.. ముక్కు మూసుకుని పాత సిమ్మును గమ్మున డ్రైనేజ్‌లో వేసెయ్యి అన్నా! లేకపోతే మళ్లీ టెంప్ట్ అయిపోతావ్!!
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్