
హలో రామ్ అన్నయ్యా! నువ్వు ఎలా ఉన్నా.. నేను మాత్రం అస్సలు బాగోలేను. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు. బట్ ప్రాబ్లమ్ అంతా నా దగ్గరే ఉంది. ఇప్పుడు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి.. ఆ అబ్బాయికి దూరం అవుతున్నా. కానీ, ఆ అబ్బాయి లేకుండా లైఫ్‌నే ఊహించుకోలేకపోతున్నా. మా పేరెంట్స్ కోసం నా హ్యాపీనెస్‌ని వదిలేసుకుందాం అనుకున్నా కానీ, నా లవ్‌ని శాక్రిఫైజ్ చేస్తే నా జీవితంలో ఇంకేం మిగలదు. ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో చెప్పి ఒప్పించేశాడు. వాళ్ల అమ్మ నన్ను కూతుర్లా చూసుకుంటోంది. మా లవ్ మేటర్ మా ఇంట్లో చెప్పలేదు. చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటే మా నేపథ్యాలు వేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? లవ్ చేసిన వాడితో ఉండాలా? ఫ్యామిలీ కోసం లవ్‌ని వదిలెయ్యాలా?? – మౌనిక
లవ్ అంటేనే ఛాయిస్! ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి!! వదులుకోవడానికి రెడీ అయితేనే ఇంకొకటి దొరుకుతుంది!! రెండూ కావాలంటే.... ‘లవ్ డాక్టర్‌కి ఉత్తరం రాయాలి కదా సార్??’ నీది చాలా బిజినెస్ మైండ్ నీలాంబరీ! ‘అరటిపండ్లేమైనా చెట్లకు కాస్తున్నాయా సార్???’ కాయట్లేదా? ‘బజారుకెళ్లి జీఎస్‌టీ కట్టి మరీ తెచ్చుకోవాలి సార్!!’ చెట్టుకు కాయకుండా బజారుకు ఎలా వస్తాయి నీలూ?? ‘సార్ నన్ను ఇంటెలిజెంట్ క్వశ్చన్లు అడగకండి. అరటిపండ్లు ఏమయినా చెట్లకు కాస్తాయా.. బజారులో దొరుకుతాయి అన్నాను.
అది నిజం కాదా? కాసేది చెట్లకే అయినా ఎంత కాస్ట్‌లీఅయిపోయాయంటే.. డబ్బులు చెట్లకు కాస్తేనే కొనగలిగేంత.. అని చమత్కరించాను! దానికే మీరు మళ్లీ క్లాస్ పీకడం బాగోలేదు సార్!!!’ కరెక్ట్‌గా చెప్పావు నీలూ.. అమ్మాయి ఏమయినా చెట్టుకు కాసిందా? అబ్బాయి ఇష్టపడగానే తెంచుకుని వెళ్లిపోవడానికి..?? అమ్మాయి అమ్మ కడుపులో కాసింది. నాన్న కష్టంతో పెరిగింది. ఇంటి గౌరవంతో ముడిపడింది.
ఇన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోవడం కరెక్టా? కాదు! ప్రేమ చెట్టింటిదయినా, మెట్టినింటిదయినా అంతే గొప్పది! మౌనికకి రెండూ దొరుకుతాయి కానీ, దానికి సాహసం కన్నా, తెగింపు కన్నా.. స్వార్థం కన్నా... ‘సార్ కన్నా ఏంటి సార్?’ కన్నవారి ప్రేమ కన్నా, వారి అభిప్రాయం కన్నా, వారి అంగీకారం అవసరం!! ‘కుదరదు అని మమ్మీడాడీ అంటారని చెబుతోంది కదా సార్???’ చాక్లెట్ వద్దంటే మానేసిందా..? ఐస్‌క్రీమ్ వద్దంటే మానేసిందా..? కొత్త బట్టలు ఇప్పుడు వద్దులేరా అంటే మానేసిందా? కాస్త మారాం చెయ్యాలి.
కాస్త ప్రేమగా అడగాలి. కాస్త బుజ్జగించుకోవాలి. కాస్త నిబ్బరంగా ఉండాలి. కాస్త పేషెన్స్ చూపించాలి. ఇప్పుడు మౌనిక ప్రేమ ఇంకా పిందె దశలోనే ఉంది. పండు అవ్వడానికి, చెట్టు నుంచి వీడటానికి ఇంకా సమయం ఉంది. అప్పుడు మమ్మీడాడీలే పండంటి మౌనికను తమలపాకులో పెట్టి మరీ అబ్బాయికి ఇస్తారు! ‘సార్ మీ పాజిటివ్ థింకింగ్ తప్పకుండా వర్కౌట్ కావాలి సార్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment