
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్. నా పేరు కార్తీక్. నేను ఒక అమ్మాయిని ఎయిట్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. మా కులాలు వేరు. అందుకే వాళ్ల ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకుండా తనకు వాళ్ల బావతో మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. ఇప్పుడు తను వాళ్ల బావతో, బాబుతో సంతోషంగా ఉంది. కానీ తను లేకుండా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఏ జాబ్ మీదా ఆసక్తి చూపించ లేకపోతున్నాను. తనని మరిచిపోలేకపోతున్నాను. ఎవరిని చూసినా తనే గుర్తుకొస్తోంది. నిద్ర కూడా పట్టడం లేదు. ప్లీజ్ సలహా ఇవ్వండి. – కార్తీక్
ప్రేమ అమృతం లాంటిది అంటారు. ఏంటో ఒక్కొక్కసారి తియ్యని విషంలాగా అనిపిస్తుంది.చంపదు. బతకనివ్వదు. గుండెను పట్టి పీడిస్తుంది. ఏకాంతాన్ని కోరుకుంటుంది. ఏకాకిని చేసేస్తుంది. ఆకలి మరిపించేస్తుంది. వాంతులను తెప్పించేస్తుంది. కళ్లు గట్టిగా మూసేస్తుంది. కానీ నిద్రను మింగేస్తుంది. ధారలా.. బాధను కార్చేస్తుంది. పిచ్చోడాలిగా నవ్విస్తుంది. అయ్యో ప్రేమా... ఎందుకీ అమానుష చర్య. ప్రేమలో పడకుండా ఉండుంటే బాగుండు. కానీ ఏం చేస్తాం... ప్రేమ పడదోస్తుంది. గాయాలు చేస్తుంది. అగాధంలోకి తోసేస్తుంది. వెక్కిరిస్తుంది.హేళన చేస్తుంది. ఛాలెంజ్ చేస్తుంది.
అయినా ప్రేమ అమృతం లాంటిది. అమృతం లాంటి విషం లాంటి అమృతం లాంటిది. ఉండలేము... వదులుకోలేము... కానీ మనమే అదృష్టవంతులము. ఇలాంటి అనుభవం గొప్ప అదృష్టం. వదిలి వెళ్లిన అమ్మాయికి ఆ అదృష్టం లేదు కదా! మనదే అంతా. మనవే ఈ అమృత ఘడియలు. అలాగే ఉండు బ్రదర్. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాలిట్యూడ్. దూరంగా ప్రేమించడంలోని దగ్గరతనాన్ని అన్వేషించు.. బై. నీలాంబరి గెల అరటి పళ్లు టేబుల్ మీద పెట్టి అడిగింది... ‘మీరు అంతగా ప్రేమించారా సార్.. ఎవరు సార్ ఆ అమ్మాయి..? హు ఈజ్ షి? ఎవరు? ఎవరు? ఎవరు?’ ‘అరటిపండుని’ అని నవ్వాను.
నీలాంబరి నమ్మలేదు.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1,
బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com