నమస్తే అన్నయ్యా..! నా విరహ ప్రేమ గాథకి మీ అరటిపండు సలహా కాకుండా చక్కటి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పరిస్థితులు మా రెండు ప్రాణాలను వేరు చేశాయి. తన చదువు పూర్తి కాగానే నేను మా ఇంట్లో చెప్పాను. అందరిలానే మొదట్లో వ్యతిరేకించినా చివరికి ఒప్పుకున్నారు. తను మాత్రం మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదు. ఇక్కడ తను తన రక్షణ చూసుకుంది. ఒకవైపు తను అలా చెయ్యడమే మంచిదనిపిస్తోంది. వాళ్ల ఇంట్లో పరిస్థితుల రీత్యా ఆమెకి పెళ్లి చెయ్యాలని సంకల్పించారు. అప్పుడు కూడా తను ఇంట్లో చెప్పలేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. ‘నీ తర్వాత ఇద్దరు పెళ్లి కావలసిన వాళ్లు ఉన్నారు, మనం అలా చేస్తే మీ పేరెంట్స్ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. వీలైతే పెళ్లి వాయిదా వేసే ప్రయత్నం చెయ్యి’ అని నచ్చజెప్పాను. కానీ పెళ్లి వాయిదా వెయ్యడం కష్టమంది. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగిపోయింది. తను నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఇక్కడ నేను కూడా అంతే. కానీ ఇప్పుడు తనకి పెళ్లైపోయింది. అయినా తను నాతో మాట్లాడుతూ ఉంటోంది.
అలా మాట్లాడటం తప్పని చెప్పినా వినడం లేదు. అందుకే నేను తను అంగీకరించలేని కొన్ని షరతులు పెట్టాను. ‘నువ్వు నాతో మాట్లాడాలంటే మీ ఆయన అనుమతి తీసుకో, మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి’ లాంటి షరతులు పెట్టాను. అలాగైనా తను నాకు దూరంగా ఉంటుందని, తన సంసార జీవితం చూసుకుంటుందని. కానీ నేను తనకి దూరం కాలేకపోతున్నాను. తను గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రాణం పోతోంది. తన ఆలోచనల వల్ల నా ఆరోగ్యం కూడా దెబ్బతింది. తను గుర్తుకొచ్చినప్పుడల్లా ఊపిరాడటం లేదు. చచ్చిపోదామంటే నా కన్నవాళ్లు ఏమైపోతారోనని భయం. కానీ ఇలా ఎన్నాళ్లు బతకాలి? నేను ఊహించుకున్న తన స్థానంలో ఇంకొకర్ని ఊహించలేను. అది ఈ జన్మకి సాధ్యం కాదు. కానీ మా ఇంట్లో వాళ్లు నేను ఎంత వద్దని చెబుతున్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వండి.
– ఎన్.జె
నిండు కుండ లాంటి మేఘానికి నిప్పు పట్టినట్టు ఉంది..!‘సార్ మీ కవిత్వం తుప్పు పట్టినట్టు ఉంది!’ఎందుకు నీలూ! భావం బాగోలేదా??‘నిండు కుండలాంటి మేఘానికి నిప్పు ఎలా అంటుకుంటుంది సార్?అసలు నిప్పు అంటుకుంటే ఆర్పేదే నిండు కుండలోని నీళ్లు కదా సార్?అయినా ఆకాశంలో తడితడిగా ఉండే మబ్బుకు మంట ఎలా పుడుతుంది సార్??అందుకే అన్నాను సార్, మేఘానికి నిప్పు కాదు మీ కవిత్వానికి తుప్పు పట్టిందని!!’అదే నీలూ ప్రేమంటే..!! తమ్ముడి మనస్సు నిండు కుండలాంటి మబ్బువోలే చల్లనిది. అమ్మాయి జీవితం చల్లగుండాలని కోరుకున్నది. తన కన్నీటిని గుండెల్లో నింపుకునితొణకక.. బెణకక.. అమ్మాయి జీవితాన్ని కాపాడిన గుండె ఇప్పుడు నిప్పులా రగిలిపోతోంది.‘అమ్మో ఇంత విషయం ఉందా సార్?!? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి??’మంచితనం మంచులాంటిది. బలంగా.. నిబ్బరంగా.. కొన్నాళ్లు ఉంటే తమ్ముడి జీవితం కూడా కోటి ప్రేమల దీపమై వెలుగుతుంది. ‘సార్ ఇవాళ్టి మీ కవిత్వం మీద.. ఓకే స్టాంప్ కొడుతున్నాను.. కానీ దయచేసి ఇంకోసారి ట్రై చెయ్యకండి, మీ చేతిలో అరటిపండు పెట్టి మరీ వేడుకుంటున్నాను!’ అని నవ్వింది నీలాంబరి..!
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Aug 29 2018 1:51 AM | Last Updated on Wed, Aug 29 2018 1:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment