
ప్రేమ బంధం: సరోజ్‌తో ప్రమోదిని
యాసిడ్ మంటల్లో జీవితం బూడిదగా కనిపించింది. కానీ, ఆ బూడిదలోనే ఆశల చిగుళ్లను మొలకెత్తించుకునే ప్రయత్నం చేసింది ప్రమోదిని. ఈ వాలెంటైన్స్ రోజు తను ప్రేమించిన యువకుడితో లక్నోలో నిశ్చితార్థ వేడుకను జరుపుకొని జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిగా మిగుల్చుకుంది. ప్రమోదిని నిశ్చితార్థం చేసుకున్న ఆ యువకుడి పేరు సరోజ్. చూపు పోయింది: పదహారేళ్ల వయసులో ప్రమోదిని మీద పారామిలిటరీ ఫోర్స్ జవాన్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన 2009 ఏప్రిల్ 18న ఒడిశాలోని ఆమె స్వస్థలం జగత్‌సింగ్‌పూర్‌లో జరిగింది. నేరస్తుడిని కిందటేడాది అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కానీ, ఆమె మాత్రం ఇన్నేళ్లూ నరకం అనుభవిస్తూనే ఉంది. ముఖం, జుట్టు, చెవులు యాసిడ్ ప్రభావానికి బుగ్గి అయ్యాయి ఈ దాడిలో 80 శాతం మేరకు చూపు కోల్పోయింది. 20 శాతం మాత్రమే ఎడమ కన్ను ద్వారా.. అదీ కిందటేడాది ఆపరేషన్ తర్వాత చూడగలుగుతోంది ప్రమోదిని.
వెలుగు వచ్చింది: దాడి జరిగిన ఆరేళ్లకు నోయిడాలోని ‘షిరోస్ (యాసిడ్ దాడి బాధితులు) హోం’లో సహాయక ప్రతినిధిగా చేరింది ప్రమోదిని. ఇన్నేళ్ల నరకం గురించి, తన ప్రేమ గురించి ప్రమోదిని చెబుతున్నప్పుడు ఇంత కష్టం ఎవరికీ రాకూడదని అనిపిస్తుంది. ‘‘నాపై యాసిడ్ దాడి జరిగాక తొమ్మిది నెలల పాటు ఐసియులో ఉన్నాను. కోమాలో నుంచి బయట పడ్డాక నా చూపు కొద్దిగానైనా రావడానికి ఐదేళ్లు పట్టింది. మా అమ్మ, నా ఇద్దరు తోబుట్టువులు అండగా నిలిచారు. చికిత్స కోసం కటక్‌లోని ఆసుపత్రికి వెళ్లినప్పుడు.. నాలుళ్ల క్రితం సరోజ్ కలిశాడు. చాలా డిప్రెస్డ్‌గా ఉండేదాన్ని. ఆ సమయంలో సరోజ్ పరిచయంతో నా జీవితంలోకి వెలుగు వచ్చింది. సైకోథెరపిస్ట్ చికిత్సతో నాలుగు నెలల తర్వాత నడవడం మొదలుపెట్టాను. షిరోస్ హోంలో చేరాను. ఏడాది క్రితం సరోజ్ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. మొదట కాదన్నాను. కానీ, తన మంచి మనసును అర్థం చేసుకున్నాను.. నేనూ సరేనన్నాను’ అంటూ ఎరుపు– నారింజ, లేత పసుపు రంగు లెహంగాలో ఉత్సాహంగా మాట్లాడుతూ కనిపించారు ప్రమోదిని.
జోడీ కుదిరింది
‘‘నేను మెడికల్ రిప్రజెంటేటివ్‌ని.కానీ, ఆ జాబ్ మానేసి యాసిడ్ దాడి బాధితులకు సాయం అందించే గ్రూప్‌లో చేరాను. ప్రమోదిని మనసు ఎంతో అందమైనది. బాధితులకు చేయూతనివ్వడంలో ఆమె సహాయగుణం, జీవితంలో నిలదొక్కుకోవాలనే లక్ష్యం నన్ను బాగా ఆకర్షించాయి.’’
– సరోజ్
Comments
Please login to add a commentAdd a comment