ఐఏఎస్‌లకు కేంద్రం వాలెంటైన్స్ డే కానుక
న్యూఢిల్లీ:
ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం వాలెంటైన్స్ డే కానుక ప్రకటించింది. ఇకపై దంపతులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒకే రాష్ట్రంలో పనిచేసే వీలు కల్పించింది. అయితే, దంపతులు ఇద్దరూ తమ సొంత రాష్ట్రాల్లో పనిచేసే వీలు మాత్రం ఉండదు. అపాయింట్‌మెంట్స్ కమిటీ చేసిన సవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అంగీకార ముద్ర వేశారు. ఈ మేరకు నిబంధనలు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్(ఫారెస్ట్ సర్వీసెస్)లకు వర్తిస్తాయి.
ఇంతకూ ఈ మేరకు నిబంధనలను ఎందుకు మార్చారంటే.. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పార్తీబన్, ఐపీఎస్ నిషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పార్తీబన్ తమిళనాడు వాసి కాగా, నిషా ఢిల్లీకి చెందిన వారు. పార్తీబన్ ఢిల్లీ క్యాడర్ అధికారి కాగా, నిషా తమిళనాడు క్యాడర్‌కు చెందిన వారు. ఈ నేపథ్యంలోనే వీరు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. తమిళనాడుకు గానీ, ఢిల్లీకి గానీ తామిద్దరూ ఒకే చోట ఉండేలా చూడాలని కోరారు. ఇలాంటి విన్నపాలు తరచూ వస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పార్తీబన్, నిషా దంపతులు తాజా నిబంధనల మేరకు గుజరాత్ క్యాడర్ అధికారులుగా ఆ రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.