లక్కీ స్టార్ యోగితా బాలి...
యోగితా బాలి యాక్ట్ చేసిన హిట్ సినిమా ఏది? ఎవరికీ గుర్తు ఉండదు. కాని ఆమె అందరికీ తెలుసు. ముందు నుంచి కూడా ఆమె న్యూస్‌లో ఉంది. అలనాటి నటీమణి, షమ్మీ కపూర్ భార్య గీతా బాలి చెల్లెలి కూతురైన యోగితా బాలి 1970లలో హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసింది. ఆయితే కిశోర్ కుమార్ మూడో భార్యగానే ఎక్కువ వార్తల్లోకి ఎక్కింది. రెండో భార్య మధుబాల మరణించాక కిశోర్ కొంచెం వైరాగ్యంలోకి వెళ్లాడు. ఆ సమయంలో కామన్ ఫ్రెండైన డాక్టర్ ఒకాయన యాంటి డిప్రెషన్ మందులను యోగితా బాలి చేత కిశోర్ కుమార్ ఇంటికి పంపేవాడు. అప్పటికే కిశోర్ స్టార్‌డమ్‌లో ఉండటంతో యోగితా ఆయనను కలవడం సరదాగా భావించింది. అది కాస్త పెళ్లిలాగా మారింది. ఇది యోగితా బాలి తల్లికి ఇష్టం లేదు.
హీరోయిన్‌గా మంచి కెరీర్ ఉండగా ఇలా మూడో భార్యగా యోగితా బాలి జీవితం ముగిసిపోవడం భరించలేకపోయింది. పైగా ఎక్కడ గర్భం దాలుస్తుందో దాని వల్ల యాక్టింగ్‌కి శాశ్వతంగా ఎక్కడ దూరమవుతుందోనని కిశోర్‌కు, యోగితాకు దూరం పెంచింది. దాంతో ఆ పెళ్లి నిలవలేదు. ఆ సమయంలోనే మిథున్ ఊపు మీద ఉండటం అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. వాళ్లది విజయవంతమైన దాంపత్యం అనే చెప్పాలి. అయితే మధ్యలో శ్రీదేవితో మిథున్ పెళ్లి వరకూ వెళ్లాడని అప్పుడు యోగితా అపర కాళి అవతారం ఎత్తితే నిర్ణయం మార్చుకున్నాడని అంటారు. ఏమైనా మిథున్ తన సంపాదనతో సృష్టించిన సామ్రాజ్యానికి యోగితా తిరుగులేని మహరాణిగా కొనసాగుతూ ఉంది.