మగ్గం బ్రాండ్ బీడీ | Magam Brand Biedl | Sakshi
Sakshi News home page

మగ్గం బ్రాండ్ బీడీ

Published Wed, Jul 29 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

మగ్గం బ్రాండ్ బీడీ

మగ్గం బ్రాండ్ బీడీ

మగ్గంపై నేసిన చీరతోనే ఉరి వేసుకున్న చేనేత కార్మికుల దీనగాథలు ఎన్నో విన్నాం. మగ్గం నడపలేక పురుగులమందు తాగి బలవన్మరణం పొందిన వారి కథలు చదివాం.మగ్గం నీడలో విరాజిల్లిన ఊళ్లకు ఊళ్లే శ్మశానాలుగా మారడం చూశాం.ఇప్పుడు మగ్గానికి క్యాన్సర్ వచ్చింది! చేనేత... కళాకారులకు బీడీ పని ఇచ్చి వెళ్లింది. ఒకప్పుడు చేనేత కళకు జీవం పోసి ఇప్పుడు చావలేక బతుకుతున్న... మనసు చంపుకుని చావుకట్టలు చుడుతున్న...చేనేత చేతుల బీడు జీవితమే ఈ మగ్గం బ్రాండ్ బీడీ కథనం.
 
50 ఏళ్ల క్రితం..
హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలో... రంగారెడ్డి జిల్లాలోని యాలాల మండలంలో గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామాలు. ఒక్కో గ్రామంలో 500 కు పైగా కుటుంబాలు ఉండేవి. ఒక్కో ఇంటికి పదేసి చొప్పున మరమగ్గాలు, గుట్టల కొద్దీ వడకాల్సిన నూలు ఉండేది. తీసిన దారాలు తీసినట్టే అయిపోయేవి. వేసిన రంగులు వేసినట్టే అయిపోయేవి. రేయింబవళ్లు చేసినా తరగనంత పని చేతుల నిండుగా ఉండేది. వేకువజామునుంచి, అర్ధరాత్రి వరకు వస్త్రాలు నేస్తూనే ఉండటంతో మగ్గాల చప్పుళ్లు గ్రామ పొలిమేరల దాకా వినిపించేవి. చుట్టూ ఉన్న 8 తండాలు, 30 గ్రామాల వాళ్లే కాదు, దూరప్రాంతాల వారూ వస్త్రాల కొనుగోళ్లకు గోవిందరావు పేట, ముద్దాయిపేటకే వచ్చేవారు. ఇక్కడి చేనేత యాలాల పేరుమీదగానే ప్రసిద్ధమైంది. రంగురంగుల యాలాల చేనేతలు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతంలో కోటికాంతులు విరబూసేవి. సిరిసంపదలు తులతూగేవి.
 
నేడు
మణెమ్మకు 90 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వరకు... భర్త, కొడుకు, మనవలు, మనవరాళ్లతో ఇల్లు సందడిగా ఉండేది. భర్త అనారోగ్యంతో చనిపోగా, కొడుకు నేతన్నగానే కన్ను మూశాడు. మనవడు దామోదరూ కులవృత్తినే నమ్ముకున్నాడు. కానీ, మగ్గం మూలన పడటంతో పొట్టకూటికోసం కరీంనగర్‌లోని సిరిసిల్లకు వెళ్లాడు. అక్కడా చుక్కెదురవడంతో ఏడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేక పుట్టినగడ్డకు మనవడి శవాన్ని తీసుకురాలేక ఊరికాని ఊళ్లోనే నలుగురి సాయం అడిగి మట్టిచేసొచ్చింది మణెమ్మ. కూలిన ఇంట్లోనే ఓ పూట తిని, ఓ పూట తినక బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కపెట్టుకుటోంది.
      
పగిడాల నర్సవ్వకు 80 ఏళ్లు. ఉన్న ఊళ్లో పని లేకపోవడంతో పదేళ్ల క్రితం కొడుకుతో కలిసి మహారాష్ట్రకు బతుకుతెరువు కోసం వెళ్లింది. అక్కడా పని లేదని అర్ధమై, కొడుకుకు భారంగా ఉండలేక ఉన్న ఊరు చేరుకుంది. ఇల్లు కూలి, కుప్పగా దర్శనమిచ్చింది. దాన్ని బాగు చేసుకునే స్తోమత లేదు. ఊళ్లోనే అయినవాళ్లను బతిమాలుకొని, వారిళ్లలో తలదాచుకుంటోంది.
      
అంజిలమ్మకు 60 ఏళ్లు. పిల్లాపాపలతో కళకళలాడిన ఇంట్లో ఇప్పుడు ఒక్కతే ఉంటోంది. పొట్టకూటి కోసం పిల్లలు పట్నమెళ్లిపోయారు. భర్త పోయాడు. బీడీలు చుట్టుకుంటూ... గతాన్ని తలచుకుంటూ బతుకు భారంగా నెట్టుకొస్తోంది.
      
వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగిన ఈ రెండు గ్రామాలలో ఇప్పుడు ఎటుచూసినా శిథిలావస్థకు చేరిన గృహాలు, ఆకలి కేకలకు తాళలేక పొట్ట చేత పట్టుకుని సూరత్, షోలాపూర్, భీమండి, నవసాగర్, ముంబయ్.. వంటి ప్రాంతాలకు వలసపోయిన చేనేతకారులు. కూలిపోయిన ఇళ్లు, మొండిగోడలు.. వాటి మధ్యే జీవచ్ఛవాలుగా మారిన నేతన్నల కుటుంబాల అవశేషాలు. జనసంచారం లేక వెక్కిరిస్తున్న వీధులు. ఎటు చూసినా దయనీయ దృశ్యాలే. ఎక్కడికీ వెళ్లలేక, మరో పని తెలియక ముసలీ ముతక, ఉన్న కొద్దిపాటి మహిళలు బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరితో పాటు ఇంకా అవశేషంగా మిగిలిపోయిన నాటి చీరలు కట్టుకున్న వృద్ధులు అక్కడక్కడా కనిపిస్తారు.
 
1200 బీడీలకు 100 రూపాయలు!
ఏ చేతులతోనైతే మగ్గం పనులు చేశారో.. ఆ చేతులతోనే ఇప్పుడు బీడీలు చుడుతున్నారు గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామస్థులు. నాడు పెళ్లి చీర అమ్మితే నెలకు సరిపడా గ్రాసం వెళ్లిపోయేది. నేడు ఎన్ని వందల బీడీలు చుట్టినా పూట గడవడమే కష్టంగా మారింది వారికి. చేనేత చివరాఖరి రోజుల్లో నాటి ప్రభుత్వం భాగ్యనగర్‌ఖాదీని ఏర్పాటు చేసింది. వేతనాలు ఇచ్చింది. ఆడపిల్లలు చెరకలకు దారాలు అల్లేవారు. వాటినే తీసుకెళ్లి మగ్గాల మీద చీరలు నేసేవారు. ఆ సంస్థ 20 ఏళ్లు నడిచి, ఆ తర్వాత మూత పడింది. ‘‘ఇప్పుడు ఆ సంస్థ ఎక్కడపోయిందో... ఎవరూ అడిగింది లేదు. తెలంగాణ ఉద్యమంలో మా చేనేత కార్మికులే ముందున్నారు.

కానీ, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు’‘ అని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ముడిసరుకు ఉంటే ఇప్పటికీ చురుగ్గా పనులు అవుతాయి. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. పొరుగూళ్లకు వెళ్లిన కళాకారులూ తిరిగి సొంత ఊళ్లకు చేరుకుంటారు. కానీ, ముడిసరుకు ఇచ్చేవారెవరు... ఆప్కో నుంచి నూలు ఇప్పించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
 
ఈ పని కూడా గుర్తింపు కార్డు ఉంటేనే!

ప్రస్తుతం ప్రతి చేనేత కుటుంబంలో బీడీల పనే జీవనాధారంగా మారింది. అయితే, బీడీల తయారీకి చేనేతకారుల గుర్తింపు కార్డులు ఉంటేనే ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కార్డులు ఉంటేనే పింఛను మంజూరు, రేషన్ బియ్యం.. వంటి లింకులు ఉన్నాయి. గుర్తింపు కార్డులు లేని, బీడీలు చుట్టే ఓపికా లేని వృద్ధులు ఈ విధానం వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారు.
 
గుప్తనిధుల కోసం తవ్వకాలు!
ఇక్కడి చేనేత కార్మికుల బంగళాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకనాడు సిరిసంపదలు తులతూగిన ఈ ప్రాంతాల్లో గుప్తనిధులు ఉంటాయని ఈ గ్రామాలలో తవ్వకాలు జరిపిన సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం గోవిందరావు పేటలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో రాత్రివేళల్లో పాడుబడిన బంగళాలు, శిథిలావస్థలోకి చేరిన ఇళ్లలో గుప్తనిధుల తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. యాలాల చేనేతకార్మికుల ప్రస్తుత దుస్థితితో పాటు, ఈ తవ్వకాలను ఆపడం ఎలా అన్నదానిపైనా ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది.
- జావెద్, సాక్షి, యాలాల; ఫొటోలు: నాగరాజు
 
పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు..!
నాడు ఎంతో ఉన్నతంగా బతికాం. నే డు మా పిల్లలు కూడా బీడీల తయారీలో ఉండకపోతే పూట గడవని పరిస్థితి. ప్రస్తుతం యాలాల, గోవిందరావుపేటలలోని చేనేత కుటుంబాల్లో నా దగ్గర మాత్రమే మరమగ్గం ఉంది. అది కూడ వృత్తి మీద మమకారంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మొన్నామధ్య ఒక్క పంచె అయినా నేయాలనే పట్టుదలతో బీడీల ఆదాయంతో ముడిసరుకు కొనుక్కొచ్చాను. ఆ పూటకు తిండిలేకపోతే నేసిన అరమీటర్ గుడ్డను తీసుకెళ్లి అమ్మి, గింజలు తెచ్చుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తీరుతాయని భావించాం. కానీ పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది.  
- రాంచందర్, చేనేత కార్మికుడు, గోవిందరావుపేట
 
పీఎఫ్ డబ్బుల జాడే లేదు!
చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఖాదీ సమితిలో ప్రతినెలా మేమంతా డబ్బులు కట్టేవాళ్లం. వీటితో పాటు చేనేత కార్మికులకు అండగా ఉంటుందనే ధీమాతో గతంలో ఖాదీ సమితిలో డబ్బులు చెల్లించాం. కానీ మా డబ్బులతో పాటు పీఎఫ్ డబ్బుల వివరాలు నేటికీ అంతుచిక్కడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి పత్రాలు, ఇతరత్రా డాక్యుమెంట్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ విషయంలో సర్కారు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలి.
- నల్ల మల్లయ్య, చేనేత కార్మికుడు
 
కార్డు లేదని పింఛను ఇస్తలేరు!
నాకు 60 ఏళ్లు పైబడ్డాయి. చేనేత కార్మికురాలిగా నాకు గుర్తింపు కార్డు లేదనే కారణంతో పింఛను మంజూరు కాలేదు. చేనేత కార్మికులుగా బతికిన మాకు న్యాయం జరగాలి.
- మెర్గు అంజిలమ్మ, చేనేత కార్మికురాలు, యాలాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement