ప్రవేశద్వారం వద్ద శివుడి విగ్రహం, గంగా సరస్సు
పచ్చని చెరుకు పొలాలు, వెండి జలపాతాలు, పగడపు దిబ్బలు, కట్టిపడేసే సూర్యోదయాలు, ఎగిరే డాల్ఫిన్లు, గోల్ఫ్ కోర్సులు, బీచ్‌లు, దూరంగా కనిపించే సముద్రపు సొర చేపలు, దీవిని చుట్టిన తెల్లని ఇసుక తీరం, స్కూబా డైవింగ్, హనీమూన్ జంటలు, సినిమా షూటింగ్‌లు, భోజన ప్రియుల కోసం దీవి చుట్టూ స్వాగతం పలికే ఇండియన్ రెస్టారెంట్లు... మారిషస్ అంటే ఎన్నో ఎన్నో..
ప్రపంచంలో 27 వ అతి చిన్న దేశం అయినా బహు భాషల, బహు సంస్కృతులకు నిలయం మారిషస్. తొమ్మిది జిల్లాలు, ఐదు భాషలు (ఇంగ్లిష్ , క్రియోల్, ఫ్రెంచ్, హిందీ, తమిళం) ఇక్కడ వారి సొంతం. ఇవన్నీ అలా ఉంచితే దేశమంతా పవిత్రంగా భావించే రోజు మహాశివరాత్రి. ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో ఉన్న ఈ చిన్న ద్వీపంలో మహాశివుడు ఎలా వెలిశాడు.. మహాశివరాత్రి ఎందుకు ఇక్కడ అంత ప్రాచుర్యం సంతరించుకుంది అంటే..మహా శివుడంటే ఎనలేని భక్తి..
శివరాత్రికి ఇక్కడ జాతీయ సెలవుదినం. మారిషస్ హిందువులకు చాలా పవిత్రమైన రోజు. మహాశివరాత్రిని గ్రాండ్ బాసి¯Œ లోని సరస్సు వద్ద విశేషంగా జరుపుకుంటారు. ఈ సరస్సునే గంగా తలావ్ అని కూడా పిలుస్తారు. శివరాత్రి సమయంలో దాదాపు 6 లక్షల మంది ఈ సరస్సుకు యాత్రగా వెళతారు. ఢోలక్ లాంటి వాయిద్యాలను వాయిస్తూ, కాలినడక, వాహనాల ద్వారా సరస్సుకి చేరుకుంటారు. అక్కడ శివుడిని అర్చించి, సరస్సులోని నీటిని ఇంటికి తీసుకుని వెళతారు. శివరాత్రికి ఉపవాసం ఉండి మరుసటి ఉదయం ఖర్జూరం, వాల్‌నట్స్, స్వీట్ పోటాటోస్‌తో ఉపవాస దీక్షను వదులుతారు. భక్తులకు దారి పొడుగునా అల్పాహారం, పానీయాలను స్వచ్ఛందంగా అందిస్తారు.
గంగా తలావ్
గంగా తలావ్ అంటే ’గంగా సరస్సు’ అని అర్ధం. మన గంగానది సూచకంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. మారిషస్ నడిబొడ్డున లోతైన సావన్నే జిల్లాలో ఏకాంత పర్వత ప్రాంతంలో ఉన్న సరస్సు. ఇది సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉంది. మారిషస్‌లో ఇది అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా పరిగణిస్తారు. సరస్సు ఒడ్డున శివ మందిరం ఉంది. గ్రాండ్ బాసిన్ వెంట హనుమంతుడు, గంగాదేవి, గణేష్‌లతో సహా ఇతర దేవాలయాలు ఉన్నాయి.
అనేక కథలు
ఈ సరస్సు గురించి స్థానికంగా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడి ఝట నుంచి రాలిన ఒక నీటి బిందువు ఈ సరస్సుగా మారిందని ఒక కథ. ఇక్కడ సరస్సు ఉందని ట్రియోలెట్ గ్రామానికి చెందిన పూజారికి కల రావటం, అక్కడ నిజంగానే సరస్సు ఉండటంతో ప్రజల్లో విపరీతమైన భక్తి, విశ్వాసాలు ఏర్పడ్డాయి. గంగా తలావోకు వెళ్ళిన మొదటి యాత్రికుల బృందం ట్రయోలెట్ గ్రామానికి చెందినది. దీనికి 1898 లో టెర్రె రూజ్ నుండి పండిట్ గిరి గోస్సేన్ నాయకత్వం వహించారు. 1866 లో పాండి సంజిబోన్లాల్ రీయూనియన్ ద్వీపం ద్వారా వ్యాపారిగా వచ్చారు. ట్రియోలెట్ వద్ద మిస్టర్ లాంగ్లోయిస్ భవనాన్ని కొనుగోలు చేసి, గ్రాండ్ బాసి¯Œ ను తీర్థయాత్రగా మార్చటానికి కృషి చేశారు. ఆయన కొన్నభవనాన్ని ఆలయంగా మార్చాడు. పోర్ట్ లూయిస్‌లోని సోకలింగం మీనాట్చీ అమ్మెన్ కోవిల్ నిర్మిస్తున్న కొందరు ఆలయానికి ప్రస్తుత ఆకృతిని ఇవ్వడంలో సహాయపడ్డారు. తర్వాత ఆయన భారతదేశానికి వెళ్లి, భారీ శివలింగాన్ని తీసుకువచ్చి గుడిలో ప్రతిష్టించారు. ముందు ఈ సరస్సును ‘పరి తలావ్’ అని పిలిచేవారు. 1998 లో దీనిని ‘పవిత్ర సరస్సు’గా ప్రకటించారు. 1972లో ప్రధాని రామ్‌గూలం గోముఖ్ భారతదేశంలోని గంగానది నుంచి నీటిని తీసుకువచ్చి, గ్రాండ్ బాసిన్ నీటితో కలిపి గంగా తలావ్ అని పేరు పెట్టారు.
సరస్సు, ఆలయ ప్రాంగణం
గంగా తలావ్ ప్రవేశద్వారం వద్ద త్రిశూలంతో నిలబడి ఉన్న శివుడి విగ్రహం ఉంటుంది. మంగల్ మహాదేవ్‌గా పిలిచే ఈ విగ్రహం 33 మీ (108 అడుగులు) ఎత్తు ఉంటుంది. 2007 లో ప్రతిష్టించిన ఈ విగ్రహం గుజరాత్ వడోదరలోని సుర్సాగర్ సరస్సులో ఉన్న శివవిగ్రహం నమూనా. శివుడితో పాటు ఇక్కడ అనేక దేవీదేవతల విగ్రహాలున్నాయి.శివరాత్రి రోజున దేశమంతా ఒక్కచోటికి వచ్చి, ఏకాగ్రతతో శివుడి భక్తిలో లయం అయినట్లు అనిపిస్తుంది. యువత ఈ పండుగ సమయంలో అందించే సేవల గురించి విశేషమైనవి. – మహేశ్ విశ్వనాథ, ట్రావెలర్
Comments
Please login to add a commentAdd a comment