త్రీమంకీస్ - 41
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 41
మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘ఓ జంట. ప్రేమ జంట.’’
‘‘ప్రేమ జంట అంటే భార్యాభర్తలు కాదన్నమాట’’ వానర్ చెప్పాడు.
‘‘అవును. గోలచందర్ భార్య పేరు లల్లేశ్వరి. అతని ప్రియురాలు మాంచాల. అతని భార్యకి బెస్ట్‌ఫ్రెండ్ కూడా. మాంచాల డైవోర్సీ. వాళ్ళిద్దరికీ జత కలిసింది. అందుకు కొంత కారణం లల్లేశ్వరికి వెల్లుల్లి వాసన పడకపోవడం. కాని గోలచందర్ మాత్రం రోజూ పాతిక వెల్లుల్లి రేకలని నేతిలో వేయించుకుని అన్నంలో కలుపుకుని ఓ ఆధరువుగా తింటాడు. బాల్యం నించి వచ్చిన ఆ అలవాటు పెళ్ళయ్యాక బంద్ అవడంతో భార్యకి మానసికంగా దూరం అయ్యాడు. మాంచాలకి శారీరకంగా దగ్గిరయ్యాడు. గోలచందర్‌కి మన దుర్యోధన్ గురించి ఓ మిత్రుడి ద్వారా తెలిసింది.’’
ఆ రోజు దినపత్రికలోని పర్సనల్ కాలంలో ఓ ప్రకటనని దుర్యోధన్ చదివాడు.
‘ఎలమంద! అంతా క్షమించబడింది. ఎక్కడున్నా సరే. ఇంటికి రా. దస్తగిరి.’
వెంటనే అతను ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
‘‘ఎలమందని. సాయంత్రం కలుద్దాం. ఎక్కడో తెలుసుగా?’’
‘‘తెలుసు. నా పేరు గోలచందర్. అలాగే.’’
దుర్యోధన్ సాయంత్రం మూడున్నరకి ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని ఓ బెంచీ మీద పేషన్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఓ ముప్ఫై రెండేళ్ళతను అతని దగ్గరకి వచ్చి అడిగాడు.
‘‘దగ్గరలో మినపరొట్టె ఎక్కడ దొరుకుతుంది?’’
‘‘నీ పేరు?’’ దుర్యోధన్ అడిగాడు.
‘‘గోలచందర్.’’
‘‘కూర్చో. నా గురించి నీకు ఎవరు చెప్పారు?’’ దుర్యోధన్ అడిగాడు.
‘‘కల్లయ్య చెప్పాడు.’’
అతను ఇటీవల దుర్యోధన్ సేవని ఉపయోగించుకున్నాడు.
‘‘ఎవర్ని?’’ దుర్యోధన్ అడిగాడు.
‘‘నా భార్యని’’ అతను చెప్పాడు.
‘దేనికి?’’
‘‘నన్ను వెల్లుల్లి తిననివ్వదు. బయట తింటే పడకటింట్లోకి రానివ్వదు.’’
‘‘కష్టమే. సరే. మీ ఆవిడకి ఏం ఇష్టమో చెప్పు’’ దుర్యోధన్ అడిగాడు.
అతని భార్య అభిరుచుల గురించి అడిగి తెలుసుకుని ఇంటి చిరునామా తీసుకున్నాడు.
‘‘పథకం రాత్రికల్లా చెప్తాను. డబ్బు తెచ్చావా?’’
అతను దినపత్రిక చుట్టి, రబ్బర్ బేండ్ పెట్టిన ఓ చెప్పుల పెట్టెని ఇచ్చి చెప్పాడు.
‘‘సగం ఇప్పుడు, సగం పనయ్యాక అని కల్లయ్య చెప్పాడు.’’
‘‘అవును. ఏభై తెచ్చావా?’’
‘‘మరీ ఏభై అని చెప్పలేదే? ఏభై వేలని చెప్పాడు.’’
‘‘అర్థం చేసుకుంటారని వేలు చెప్పలేదు. పనైపోయిందనే అనుకోండి.’’
‘‘ముందే అనుకోను. అయ్యాక అనుకుంటాను’’ గోలచందర్ చెప్పాడు.
ఆ రాత్రి దుర్యోధన్ చక్కటి పథకం ఆలోచించాడు. గోలచందర్‌కి ఫోన్ చేసి అది చెప్పాడు.
‘‘ఎల్లుండి ఆ సమయంలో నీకు మంచి ఎలిబీ ఉండేలా చూసుకో’’ సలహా ఇచ్చాడు.
మాంచాల ఆఫీస్‌నించి వచ్చిన గోలచందర్ టైని లూజ్ చేస్తూ అడిగింది.
‘‘మీరు నిన్న తెచ్చిన హెర్బల్ రోజ్ టీ చేసివ్వనా?’’
‘‘ఒద్దు. అది మన హానీమూన్‌కే పరిమితం.’’
‘‘అలసిపోయినట్లు ఉన్నారు. స్నానం చేస్తారా?’’
‘‘తర్వాతా? ముందా?’’
స్నానం తర్వాత వారి మధ్య సెక్స్ తర్వాత అడిగాడు.
‘‘కాఫీ ఇవ్వు.’’
‘‘రాత్రి భోజనానికి బయటకి వెళ్దామా?’’ మాంచాల కాఫీ కప్పు అందిస్తూ అడిగింది.
‘‘నాకూ వెళ్ళాలనే ఉంది. కాని...’’
‘‘కాని?’’
‘‘నా భార్యకి మన వ్యవహారం మీద అనుమానంగా ఉంది’’ గోలచందర్ చెప్పాడు.
‘‘అసలు ఆమెకి ఎలా తెలుసు?’’
‘‘ఎయిర్‌టెల్ నించి రహస్యంగా నా సెల్‌ఫోన్ కాల్స్ లిస్ట్ట్‌ని తెప్పించింది. నా క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ కూడా.’’
‘‘ఐతే నా క్రెడిట్ కార్డ్ వాడి మనం జాగ్రత్తపడటం మంచిదైంది’’ మాంచాల చెప్పింది.
‘‘అంతేకాదు. ఎయిర్‌టెల్ నించి వచ్చిన కాల్స్ లిస్ట్‌లో కూడా నీకు ఫోన్ చేసిన వివరాలు లేవు. అందుకే ఇంకో ఫోన్ తీసుకున్నాను.’’
‘‘ఆమెకి నిజం తెలుస్తే ఏమవుతుంది?’’ మాంచాల అడిగింది.
‘‘ముందుగా నేను కంపెనీ ఛైర్మన్ కుర్చీలోంచి దిగాలి. ఆ కంపెనీ ఆమె తండ్రిది. ఏభై ఐదు శాతం షేర్లు వారివే కాబట్టి నన్ను దింపేసి విడాకులకి అప్లై చేస్తుంది. అప్పుడు మన పెళ్ళయ్యాక మనకి డబ్బుండదు. డబ్బు లేకపోతే ఆనందం ఉండదు’’ గోలచందర్ చెప్పాడు.
‘‘డబ్బులో ఆనందం లేదు. షాపింగ్‌లో ఉంది’’ మాంచాల నవ్వుతూ చెప్పింది.
(వెల్లుల్లికి విడాకులకి ఏమిటి సంబంధం?)