సులైమాన్ (అలైహిస్సలామ్) దర్బారులో ఒక వ్యక్తి కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాడు. అంతలోనే మృత్యుదూత ప్రత్యక్షమయ్యాడు. సులైమాన్ పక్కనే కూర్చుని ఉన్న వ్యక్తివంక పట్టి పట్టి చూశాడు. ఆ వ్యక్తి భయంతో వణకుతూ ‘‘ప్రవక్తా! ఆ మృత్యుదూత నన్నదోలా చూస్తున్నాడు. చూడబోతే అతను నా ప్రాణాలు తోడేసేలా ఉన్నాడు. మీ మహిమతో నన్ను ఈ దేశ సరిహద్దులు దాటించి ఓ నిర్మానుష్య అడవులకు పంపించండి’’ అని వేడుకున్నాడు. హజ్రత్ సులైమాన్ వాయువులతో ‘‘ఈ వ్యక్తిని భారతదేశ సరిహద్దుల్లోని ఫలానా అడవులకు తీసుకువెళ్లండి’’ అని ఆజ్ఞాపించిన క్షణాల వ్యవధిలోనే ఆ వ్యక్తి అడవుల్లో ఉన్నాడు.
ఆ అడవుల్లో కాలుమోపిన కాసేపటికే అతను మృత్యువాతపడ్డాడు. కొన్నిరోజుల తరువాత హజ్రత్ సులైమాన్ తన దర్బారులోకి వచ్చిన మృత్యుదూతతో ‘‘ఆ రోజు ఆ వ్యక్తివంక ఎందుకలా చూశావు?’’ అని అడిగారు. దానికి మృత్యుదూత ‘‘తెల్లారితే ఆ వ్యక్తి ప్రాణాలు ఫలానా అడవిలో తోడేయాలని నాదగ్గర ఉన్న చిట్టాలో రాసి ఉంది. అతనేమో మీ సమక్షంలో కూర్చుని ఉండేసరికి ఆశ్చర్యమేసింది. అంతలోనే తను మీతో మొరపెట్టుకోవడం... తాను ఎక్కడైతే చావాలని ఉందో అక్కడికే అతను చేరడం తమరికి తెలిసిందే’’ మృత్యువు, మీరు ఎక్కడున్నాసరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే...
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment