మానవీయక్షణాలు | Manaviyaksanalu | Sakshi
Sakshi News home page

మానవీయక్షణాలు

Published Mon, Mar 24 2014 11:50 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

మానవీయక్షణాలు - Sakshi

మానవీయక్షణాలు

ఈ తరహా డాక్టర్లకు సాక్షి ఫ్యామిలీ సలాం

డాక్టర్ అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆ వృత్తికి మరెంతో ప్రతిష్ఠ. అలాంటి గౌరవప్రతిష్ఠలు కేవలం కొందరు రోగుల వ్యధలనూ, బాధలను తీర్చడం వల్ల మాత్రమే డాక్టర్లు పొందడం లేదు. కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై ప్రవర్తించడం వల్ల, మాన్యులైనప్పటికీ సామాన్యుల్లా వ్యవహరించడం వల్ల మాన్యతలు పొందుతున్నారు, పొందుతుంటారు. గాఢనిద్రలకు కటీఫ్ చెబుతారు.  వ్యాధులకు కటాఫ్ డేట్ ప్రకటిస్తారు. ఆపరేషన్లతో రోగాన్ని ‘కట్’ చేస్తారు. ఇన్ని కటకటలకు లోనవుతారు కాబట్టే వారికా గౌరవకటాక్షాలు. కొందరు డాక్టర్ల సంక్లిష్ట కేసుల సంక్షిప్త వివరాలు వారి మాటల్లోనే...
 
జీవితానికి ఆవల..!

శ్రీధర్ కళ్లు మూసుకుని ఉన్నాడు. అయితే అతడు నిద్రపోతున్నాడా లేదా అని చెప్పడం కష్టం. ఒకవేళ పట్టినా అది కలత నిద్రే. కళ్ల ముందు తన కుటుంబమే కనిపిస్తోంది. రేపు తాను లేని సమయంలో వాళ్ల పరిస్థితేమిటి? వణికిపోయాడు శ్రీధర్. ఆ ఊహే అతడిని భయందోళనలకు గురిచేసింది. కూతురు చిన్ని పాప. బిడ్డకు ఊహ తెలియదు. భార్యకు లోకం తెలియదు. ఎలా బతుకుతారు వాళ్లు? శ్రీధర్ ఇలా ఆలోచించడానికి కారణం అతడికి ఉన్న టర్మినల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అన్ని విధాలా ఆరోగ్యవంతుడైన తనకది వచ్చిన కారణం తెలియదు. వచ్చిందని తెలిశాక  భవిష్యత్తు తెలియదు. ఇప్పటికి తెలిసిందల్లా ఎవరైనా ఒకరు జీవన్మృతుడిలా మరణిస్తే, వారు దానం చేసిన కిడ్నీని స్వీకరించడమే. ఇలా అనుకుంటుండగా ఫోన్ మోగింది. టైమ్ చూస్తే రాత్రి ఒంటిగంటన్నర. ఆ వేళప్పుడు తనకు చేసేవారెవరూ ఉండరు.
 
‘‘ఈ దురదృష్టవంతుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో’’  అనుకుంటూ ఫోనెత్తాడు.
 అవతలి గొంతు మాట్లాడుతోంది...‘‘ హలో నేను... మీ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌ను. ఈ వేళప్పుడు మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు సారీ. అయితే... మీరు తక్షణం బయలుదేరాలి. ఎందుకంటే... ఎవరైనా జీవన్మృతుల నుంచి కిడ్నీ కావాలంటూ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా. అదృష్టంకొద్దీ అది దొరికింది. వెంటనే ఆసుపత్రికి రాగలరా’’ అంటోంది ఆ స్వరం.
 
ఎప్పట్నుంచో వారానికి మూడు రోజులు తప్పనిసరిగా డయాలసిస్ అనే బాధను మౌనంగా అనుభవిస్తూ... జీవితాన్ని దాదాపుగా ఆసుపత్రికి అంకితం చేసినట్లు గడిపే బాధ నుంచి ఇకపై విముక్తి దొరకబోతోందా? నిజంగా నమ్మొచ్చా?
 
కానీ ఆ గొంతు చెబుతున్న చివరి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అవి పూర్తిగా ముగిసీ ముగియకముందే...
 ‘‘తక్షణం వస్తున్నా’’ అంటూ బయల్దేరాడు శ్రీధర్.
 
ఇక్కడ డాక్టర్‌గా నాదొక మాట. శ్రీధర్‌ది చాలా సంక్లిష్టమైన కేసు. బతుకుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మరొకరి దురదృష్టం అతడి అదృష్టంగా పరిణమించింది. బతికాడు. కానీ శ్రీధర్‌కు వచ్చిన జబ్బు మనదేశంలో ప్రతి ఏటా 200 మందికి వస్తోంది. కానీ కిడ్నీలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. కానీ వీళ్లలో పదిశాతం మందికి కూడా కిడ్నీలు దొరకడం లేదు. కాబట్టి మిగతావారంతా మౌనంగా మరణించాల్సి వస్తోంది. స్వర్గంలో ప్రతి వారికీ ఓ దివ్యరూపం ఉంటుంది. మట్టిలో కలిసిపోయే ఈ అవయవాల అవసరం అక్కడ ఎవరికీ ఉండదు. అందుకే ఇక్కడి అవయవాలను ఇక్కడే ఇచ్చేయండి. స్వర్గార్హతను మరింతగా సంపాదించుకోండి.
 
అన్నట్టు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఒక మాట చెబుతున్నా. శ్రీధర్‌కు కిడ్నీ ఇచ్చిన వ్యక్తి ఒక యువడాక్టర్. డాక్టర్లు జీవితం ఇస్తారని అందరూ అనుకుంటారు. అది మాత్రమేకాదు... ఆ డాక్టర్ శ్రీధర్‌కు కిడ్నీ ఇచ్చినట్టే... మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మరో సిర్రోసిస్ రోగికి కాలేయం ఇచ్చాడు. చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతూ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతున్న ఇంకో వ్యక్తికి హృదయం పంచాడు. అవును... కొందరు డాక్టర్లు కారుణ్యాల పుట్టలు. బతికి ఉండగానే కాదు... చచ్చిపోయాకా బతికిస్తారు.
 
చివరగా...

 శ్రీధర్‌కు రక్తాన్ని వడపోసే ఓ అవయవం దొరికింది.
 ఇకపై అతడు జీవితాన్ని కాచి వడపోస్తాడు.
 ఇక అతడు తన బాధ్యతలు నెరవేరుస్తాడు.
 సమస్త సంతోషాలను భార్యాబిడ్డల ఒళ్లో పోస్తాడు.
 (వ్యాస రచయిత ప్రముఖ నెఫ్రాలజిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement