
కలెక్టర్ దూకుడు
‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్‌సీ, సీలింగ్, అసైన్‌మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
వివరాలు ఆయన మాటల్లోనే... -సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ భూముల పరిరక్షణ
ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూ ముల పరిరక్షణ. తెలంగాణకు ఆయువు పట్టయిన జిల్లాలోని విలువైన భూములను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేస్తున్నాం. తద్వారా అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించాం. ఇందులో ఎంత విస్తీర్ణం వృథాగా ఉందనేది నిర్ధారించుకుంటున్నాం.
అదేవిధంగా ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్‌లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ట్రస్ట్ భూమిలో వెలిసిన కట్టడాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్‌ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనవద్దని, వ్యాపారాలు నిర్వహించకూడదని ప్రజలను చైతన్యపరుస్తూ నోటీసు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం.
‘ఎన్’ కన్వెన్షన్‌లో తమ్మిడి కుంట..
‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్‌సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం.
పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు..
పరిశ్రమల స్థాపనకు మంచి వాతావరణం కల్పిస్తాం. భూ కేటాయింపులు, అనుమతులను సరళతరం చేసే దిశగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్‌ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం.
చేతులు మారిన అసైన్డ్ భూములు వెనక్కి..
భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్‌భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. అసలైన లబ్ధిదారులుగాకుండా ఇతరులకు వీటిని విక్రయించినట్లు తేలితే ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్‌సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం.
దళితుల సమగ్రాభివృద్ధి..
దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. మండల ం యూనిట్‌గా ఒక బస్తీని ఎంపిక చేసి.. ఆ బస్తీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం.
మౌలిక సదుపాయాల కల్పన, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపడతాం. దీనికోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను వినియోగిస్తాం. జిల్లావ్యాప్తంగా భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. ఇప్పటికే భూమి ఉన్నా.. వ్యవసాయానికి అనువుగా లేని రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు విత్తనాలు, డ్రిప్, ఇరిగేషన్ తదితర రాయితీలను వర్తింపజేయనున్నాం.
పనిదొంగల భరతం పడతా..
సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. ప్రతి రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాల్సినతహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు హాజరుపై అంచనాకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
64 మందికి శ్రీముఖాలు
విదినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్‌సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా