మీగడపండు | Mango fruit pulp | Sakshi
Sakshi News home page

మీగడపండు

Published Fri, Jun 2 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

మీగడపండు

మీగడపండు

ఐస్‌క్రీమ్‌ పేరు విన్నారా! వినే ఉంటార్లెండి!!
అన్నం తిన్న తర్వాత జుర్రుకుంటాం కదా!
అదే, చల్లగా ఉంటుంది! ఐస్‌ కదా మరి!
క్రీమీగా ఉంటుంది పాలమీగడలాగ!!
మామిడి పండు గుజ్జూ అంతే
మనందరికీ నచ్చే ఈ గుజ్జుతో
ఎన్ని వెరైటీలో..!!


మ్యాంగో ఛీజ్‌ కేక్‌
కావల్సినవి: మ్యారీ బిస్కట్లు – 150 గ్రాములు; వెన్న – 80 గ్రాములు; ఛీజ్‌ – 450 గ్రాములు; పంచదార పొడి – అర కప్పు;
జెలటిన్‌ – టేబుల్‌ స్పూన్‌; వేడినీళ్లు – పావు కప్పు; మామిడిపండ్లు – 4 (పైన తొక్క తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి); నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు; మామిడిపండు – 1 (సర్వ్‌ చేసే ముందు అలంకరణకు తొక్క తీసి, సన్నని ముక్కలుగా కట్‌ చేయాలి)

తయారీ:
మిక్సర్‌జార్లో బిస్కట్లను వేసి పొడి చేయాలి. దీంట్లో వెన్న వేసి కలపాలి ∙ఒక గిన్నెలో క్రీమ్‌ ఛీజ్, పంచదార వేసి మిక్సర్‌తో బ్లెండ్‌ చేసి, వెన్న కలపాలి ∙వేడినీళ్లలో జెలటిన్‌ వేసి కరిగించాలి ∙పావు కప్పు ఛీజ్‌లో ఈ కరిగించిన జెలటిన్‌ వేసి కలపాలి ∙దీనిని బిస్కట్‌ మిశ్రమంలో వేసి కలపాలి ∙బేకింగ్‌ ట్రే లేదా ఒక వెడల్పాటి గిన్నె అడుగున బిస్కట్‌ పొడి వేసి, ఆ పైన కొద్దిగా ఛీజ్‌ మిశ్రమం వేసి, ఆ పైన మామిడిపండు ముక్కలు అమర్చాలి ∙ఆ పైన మళ్లీ ఛీజ్‌ మిశ్రమం పోసి, పైన మామిడిపండు ముక్కల్ని సెట్‌ చేయాలి ∙ఇలా అన్నీ సర్దాక ఈ ట్రేని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి ∙మరుసటి రోజు వడ్డించడానికి 15 నిమిషాల ముందు ఈ ఛీజ్‌ కేక్‌ బయటకు తీయాలి ∙మామిడిముక్కలు, నిమ్మరసం కలిపి మృదువైన మిశ్రమంలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ఛీజ్‌ కేక్‌ మీద స్పూన్‌తో పోయాలి ∙ముక్కలుగా కట్‌ చేసి, సర్వ్‌ చేయాలి.

మ్యాంగో కలాకండ్‌
కావల్సినవి: మాంగో గుజ్జు – 2 కప్పులు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – కప్పు (250 ఎం.ఎల్‌); పనీర్‌ – 2 కప్పులు; పిస్తాపప్పు పలుకులు – టేబుల్‌ స్పూన్‌; బాదంపప్పు పలుకులు – టేబుల్‌ స్పూన్‌

తయారీ: కేక్‌ని బేక్‌ చేసే ట్రే లోపల అడుగు భాగాన కొద్దిగా నెయ్యి రాయాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి అందులో మామిడిపండు గుజ్జు వేసి ఉడికించాలి ∙దీంట్లో సన్నగా తురిమిన పనీర్‌నువేసి బాగా కలపాలి ∙(ఇంట్లోనే పాలతో తయారుచేసుకున్న పనీర్‌ అయితే మంచిది) ∙దీనిని ఉడుకుతున్న మామిడిపండు గుజ్జులో వేసి ఉడికించాలి ∙దీంట్లోనే కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలపాలి ∙బాగా ఉడికి, మిశ్రమం మృదువుగా, కాస్త గట్టి పడేంతవరకు ఉంచాలి ∙ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో లేదా కేక్‌ ట్రేలో పోయాలి ∙పైన పిస్తా, బాదంపప్పు పలుకులు వేసి, చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో 2 గంటల పాటు పెట్టాలి ∙తర్వాత ట్రే బయటకు తీసి, కలాకండ్‌ను చతురస్రాకార ముక్కలుగా కట్‌ చేయాలి ∙తర్వాత సర్వ్‌ చేయాలి.

మాంగో కుల్ఫీ
కావల్సినవి: మామిడిపండు గుజ్జు – ముప్పావు కప్పు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 400 గ్రాములు; బాగా గిలక్కొట్టిన మీగడ – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్‌; పిస్తాపప్పు, బాదంపప్పు – 4 (సన్నగా తరగాలి)

తయారీ: మీగడ లేదా క్రీమ్‌ బాగా గిలక్కొట్టి 4 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గిన్నెలో కండెన్స్‌డ్‌ మిల్క్, మామిడిపండు గుజ్జు, యాలకుల పొడి వేసి కలపాలి ∙దీంట్లో ఫ్రిజ్‌ నుంచి తీసిన చల్లటి క్రీమ్‌ వేసి బాగా కలపాలి ∙కుల్ఫీ అచ్చుల్లో ముందుగా కొన్ని నట్స్‌ పలుకులు వేయాలి. తర్వాత మామిడిపండు మిశ్రమం పోయాలి ∙కుల్ఫీ అచ్చు ముప్పావు భాగం నింపి, దాంట్లో ఒక సన్నని ఐస్‌క్రీమ్‌ పుల్లను గుచ్చి, ఫ్రీజర్‌లో కనీసం 5–6 గంటలసేపు ఉంచాలి ∙సర్వ్‌ చేసే ముందు అచ్చు నుంచి కుల్ఫీని బయటకు తీసివ్వాలి.

కోకోనట్‌ మ్యాంగో పాప్సికెల్‌
కావల్సినవి: మామిడిపండు గుజ్జు – 2 1/2 కప్పులు; పైనాపిల్‌ జ్యూస్‌ – 1/2 కప్పు; ప్యూరీ కోసం... కొబ్బరి పాలు – కప్పు; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; యోగర్ట్‌ (వెన్నలేని పెరుగు) – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: జ్యూస్‌ మిక్సర్‌లో మామిడిపండు గుజ్జు, పైనాపిల్‌ గుజ్జు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి ∙దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరొక గిన్నెలో కొబ్బరిపాలు, పంచదార, పెరుగు, నీళ్లు కలపాలి ∙2 టేబుల్‌ స్పూన్ల మామిడిపండు గుజ్జును పాప్సికెల్‌ అచ్చులో పోయాలి ∙ఫ్రీజర్‌లో 15 నిమిషాలు ఉంచాలి ∙ఫ్రీజర్‌ నుంచి తీసి టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి పూరీ ఆ అచ్చులో పోసి, మళ్ళీ ఫ్రీజర్‌లో 10 నిమిషాలు ఉంచాలి ∙తర్వాత టేబుల్‌ స్పూన్‌ మామిడిపండు గుజ్జు పోయాలి ∙10 నిమిషాలు ప్రీజర్‌ లో ఉంచి తీసి, ఐస్‌క్రీమ్‌ పుల్లను అమర్చాలి ∙మరో పది నిమిషాల తర్వాత కొబ్బరి ప్యూరీ ఆ అచ్చులో పోయాలి ∙ఇలా మిశ్రమం అంతా అచ్చులో అమరిన తర్వాత ఫ్రీజర్‌లో కనీసం 4 గంటల సేపు ఉంచాలి ∙కోకనట్‌ మ్యాంగో పాప్‌సికెల్‌ రెడీ. వేసవిలో పిల్లలే కాదు పెద్దలూ దీనిని ఇష్టపడతారు.

మ్యాంగో ఫాలుదా!
కావల్సినవి: మామిడిపండు గుజ్జు – 1 1/2 కప్పు; పాలు – 1 1/2 కప్పు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఫాలుదా (సబ్జా) గింజలు – టేబుల్‌ స్పూన్‌ (అర కప్పు నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టాలి); ఫాలుదా సేవ్‌ – కప్పు; మ్యాంగో ఐస్‌క్రీమ్‌ – 4 స్కూపులు; మామాడి పండు ముక్కలు – కప్పు; పిస్తాపప్పు – 8 (పలుకులు చేయాలి); బాదంపప్పు – 6 (పలుకులు చేయాలి); చెర్రీ పండ్లు – 4 (అలంకరణకు)
తయారీ: ∙ఒకటిన్నర కప్పు పాలు కప్పుడు అయ్యేదాక మరిగించాలి ∙మంట తీసేసి, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార వేసి కలిపి, చల్లారనివ్వాలి ∙మామిడిపండు గుజ్జులో 3 టేబుల్‌ స్పూన్ల పంచదార వేసి, కలిపి, ఫ్రిజ్‌లో పెట్టాలి ∙ఫాలుదా సేవ్‌ని చల్లని నీళ్లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙ఫాలుదా పోసే గ్లాసును కనీసం అర గంట ఫ్రిజ్‌లో ఉంచాలి (ఇలా చేస్తే ఫాలుదా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది.

తర్వాత గ్లాస్‌ తీసుకొని దీంట్లో మామిడిపండు ముక్కలు అడుగున వేయాలి ∙దీనిపైన 2 టేబుల్‌ స్పూన్ల ఫాలుదా(నానబెట్టిన సబ్జా) గింజలను వేయాలి ∙ఆ పైన ఫాలుదా సేవ్‌ ఆ పైన 3 టేబుల్‌ స్పూన్ల మామిడిపండు గుజ్జు, ఆ పైన 4–5 టేబుల్‌ స్పూన్ల చల్లటి పాలు, ఆ పైన మామిడిముక్కలు, ఫాలుదా, సేవియా, మామిడిపండు గుజ్జు.. ఇలా లేయర్లుగా వేయాలి ∙చివరగా స్కూప్‌తో మ్యాంగో ఐస్‌క్రీమ్‌ వేసి, ఆ పైన పిస్తా, బాదంపప్పు పలుకులు, చెర్రీ పండ్లు వేసి వెంటనే అందించాలి ∙లేదంటే ఐస్‌క్రీమ్‌ కరిగిపోతుంది.
నోట్‌: పాలుదా ఇంకా తియ్యగా కావాలనుకునేవారు పాలు, మామిడిపండు గుజ్జులో పంచదార లేదా తేనె కలుపుకోవచ్చు. గ్లాసు పొడవు వెడల్పును బట్టి ఫాలుదా కూడా అదనంగా వేసుకోవాలి.

మామిడిపండు పాయసం
కావల్సినవి: వెర్మిసెల్లీ – 3 టేబుల్‌ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – పావు కప్పు; పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు; మామిడిపండు గుజ్జు – కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; కిస్‌మిస్‌ – 7; జీడిపప్పు – 7; యాలకుల పొడి – చిటికెడు; మామిడిపండు ముక్కలు – పావు కప్పు

తయారీ:మూకుడు పొయ్యి మీద పెట్టి, నెయ్యి వేసి, వెర్మిసెల్లి వేయించాలి
∙    దీంట్లో పాలు పోసి, సన్నని మంట మీద వెర్మిసెల్లిని ఉడికించాలి
∙    దీంట్లోనే పంచదార, కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోయాలి
∙    ఇది కాస్త ఉడికాక యాలకుల పొడి వేసి, మంట తీసేయాలి
∙    చల్లారాక దీంట్లో మామిడిపండు గుజ్జు వేసి కలపాలి
∙    పైన జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌ వేసి, ఆ పైన సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు కూడా వేసి అందించాలి
     మిశ్రమం గట్టిపడితే కొద్దిగా పాలుకలుపుకోవచ్చు.

మ్యాంగో పన్నా!
కావల్సినవి: బాగా గిలక్కొట్టిన మీగడ – ఒకటింపావు కప్పు; క్యాస్టర్‌ షుగర్‌ (పంచదార పొడి) – పావు కప్పు ; వెనిల్లా బీన్‌ – 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); జెలాటిన్‌ – టేబుల్‌ స్పూన్‌; మామిడిపండ్లు – 4 (పై తొక్క తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి)
అలంకరణకు: పిస్తాపప్పు పలుకులు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ పంచదార పొడి – పావు కప్పు

తయారీ: ∙పన్నా తయారీ అచ్చులను తీసుకొని లోపలి వైపు కొద్దిగా నూనె రాయాలి ∙మామిడిపండు గుజ్జును మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి మరీ మృదువుగా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని పన్నా అచ్చుల్లో సమానంగా పోయాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ∙ఒక గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు పోసి, దీంట్లో జెలటిన్‌ వేసి బాగా కలపాలి ∙(అవెన్‌లో నిమిషం సేపు ఉంచితే జెలటిన్‌ త్వరగా నీటిలో కరుగుతుంది ∙లేదంటే వేడి నీటిలో జెలటిన్‌ గిన్నె ఉంచి, అది పూర్తిగా కరిగేంతవరకు కలపాలి.

క్రీమ్‌ లేయర్‌ కోసం..
∙సాస్‌పాన్‌ పొయ్యిమీద పెట్టి దీంట్లో బాగా గిలక్కొట్టిన మీగడ, పంచదారపొడి, వనిల్లా బీన్‌ వేసి కలపాలి ∙అన్నింటినీ పూర్తిగా మరిగించి, మంట తీసేయాలి ∙ వనిల్లా బీన్‌ ముక్కలను తీసేయాలి ∙దీంట్లో బాగా కరిగిన జెలటిన్‌ను వేయాలి ∙చల్లారిన తర్వాత దీంట్లో క్రీమ్‌ మిశ్రమం పోయాలి ∙ఈ మిశ్రమాన్ని మ్యాంగో మిశ్రమం ఉన్న అచ్చులో పైన పోసి, ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి ∙చిన్న సాస్‌ పాన్‌లో పంచదార, 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి సన్నని మంటపై మరిగించాలి ∙బంగారు రంగు వచ్చేవరకు ఉంచి మంట తీసేసి దీంట్లో పిస్తాపప్పు వేసి కలపాలి ∙ఫ్రిజ్‌లో పెట్టిన మ్యాంగో పన్నా అచ్చు బయటకు తీసి, సర్వింగ్‌ ప్లేట్‌లో బోర్లించాలి ∙ఆ పైన పిస్తాపపప్పు ఉన్న పంచదార సిరప్‌ వేసి వెంటనే సర్వ్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement